నవరత్నాలు కాపీ కొట్టారు..

Kurasala Kannababu Slams Chandrababu Naidu - Sakshi

జగన్‌పై బురద జల్లుతున్నారు..

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌: సీఎం చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం, ఏవిధంగానైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుతున్నారని, అయితే నవరత్నాల పథకాలను మాత్రం కాపీ కొడుతున్నారని వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. రమణయ్యపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూచనతో ప్రతిపక్ష నేతను కేటీఆర్‌ కలిస్తే టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ముందుకు వస్తారో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తున్నామని పార్టీ అధినేత స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

టీడీపీ ఎవరినైనా కలవచ్చు, ఎవరికైనా మద్దతు ప్రకటించవచ్చని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ అధినేతను కేటీఆర్‌ కలిస్తే తప్పేంటన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమరావతి శంకుస్థాపనకు వస్తే రాచమర్యాదలు చేసిన మర్చిపోయారా అని ప్రశ్నించారు. అనంతపురంలో టీడీపీ నాయకుడు పరిటాల రవి కుమారుడు వివాహానికి వచ్చిన కేసీఆర్‌కు టీడీపీ మంత్రులు సలాంలు చేసి గులాములుగా మారిపోయిన సంగతి ప్రజలకు విదితమేనన్నారు. తిరుపతిలోనూ కేసీఆర్‌కు రెడ్‌ కార్పెట్‌ వేశారని గుర్తించారు. అసెంబ్లీ సాక్షిగా టీఆర్‌ఎస్‌ మద్దతు కోరితే వారు తిరస్కరించారని చంద్రబాబు చెప్పిన మాటను కన్నబాబు గుర్తుచేసారు. కేసీఆర్‌కు చంద్రబాబు ఎప్పుడో సరెండర్‌ అయ్యారని, ఓటుకు నోటు కేసుతో భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారన్నారు. బీజేపీతో కాపురం చేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నేలమట్టం చేశారని విమర్శించారు. వంద రోజుల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదన్నారు. రూ.2 వేల పింఛన్‌ పథకానికి జగనన్నగా, రైతులకు ఇచ్చే సాయానికి జగనన్న భరోసాగా పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక నుంచి జగనన్న బాట నడుస్తుందని అన్నారు.

హత్యయత్నం కేసులో వాస్తవాలు బయట పడతాయని..
కోడి పందాలకు వాడే కత్తితో పార్టీ అధినేతను హతమార్చాలన్న పన్నాగంతో హత్యా యత్నం కేసును ఎన్‌ఐఎ అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు మీరు కంగారు పడుతున్నారని కన్నబాబు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ పసా లేదని ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనకు కేంద్రానిదే బాధ్యతని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్‌ఐఏకు సంబంధం ఏమిటని ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్‌ఐఎ దర్యాప్తునకు ఎందుకు సహకరించడంలేదని నిలదీశారు. ఎన్‌ఐఏ విచారణతో నిజానిజాలు బయటకు వస్తాయని ఆందోళనతో చంద్రబాబు భయంతో వణికిపోతున్నారన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని చంద్రబాబు నిర్వహిస్తే ఆయన ఆత్మకు శాంతి కలగదన్నారు. కాంగ్రెస్‌తో జత కట్టి ఎన్టీఆర్‌ ఆత్మకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top