కుప్పం టు బెంగళూరు

Kuppam To Bangalore Migrant Workers Story - Sakshi

పొట్టకూటి కోసం కూలీలు, యువకుల తిప్పలు

రోజూ రైళ్లల్లో వెళ్లి వచ్చే వారి సంఖ్య వేలల్లోనే..

వీవీఐపీ నియోజకవర్గమైనా దశాబ్దాలుగా అదే దుస్థితి

రాష్ట్రంలో అది వీవీఐపీ నియోజకవర్గం.. కానీ కనీసం ఓ వంద మందికైనా ఉపాధి కల్పించే సంస్థలు, ఫ్యాక్టరీలు అక్కడ లేవు. దీంతో స్థానికంగా పనులు దొరక్క రోజూ దాదాపు 120 కి.మీ. వెళ్లి వస్తున్నారు. తెల్లవారుజామునే5 గంటలకు బయల్దేరితే తిరిగి రాత్రి పది గంటలసమయంలో స్వస్థలాలకు చేరుకునే వీరంతాసూర్యోదయం, సూర్యాస్తమయాలతో సంబంధంలేకుండా రైళ్లలోనే 4 గంటలకుపైగా రాకపోకలుసాగించాల్సి వస్తోందని వాపోతున్నారు.

మళ్లీ రాత్రికి కుప్పం..: ప్రభుత్వాధినేత ప్రాతినిధ్యం వహించే ప్రాంతమైనా కుప్పం ప్రజలకు తిప్పలు మాత్రం తప్పడం లేదు. నిత్యం ఉదయమే కుప్పం, శాంతిపురం, గుడుపల్లి, రామకుప్పం తదితర ప్రాంతాల నుంచి కనీసం 25,000 మంది పొట్టచేత పట్టుకొని బెంగళూరు వెళ్లి వస్తున్నారు. పుష్‌పుల్, జోలారుపేట ఎక్స్‌ప్రెస్, కొచ్చివెళి ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. తిరిగి రాత్రి అదే రైళ్లలో కుప్పం చేరుకుని బస్సులు, ఆటోల్లో ఇంటి ముఖం పడుతున్నారు.

ఆనాటి పరిస్థితులే ఈనాడూ...: వలసలకు అడ్డుకట్ట వేస్తామని, విదేశాల్లో మాదిరిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తరచూ చెప్పే మాటలు కలగానే మిగిలాయి. కుప్పం సెజ్‌లో కొన్ని పరిశ్రమలున్నా ఇతర రాష్ట్రాల వారికే ఎక్కువ ఉద్యోగాలిస్తున్నారు. కనీసం ఒక్కటైనా మంచి ప్రభుత్వ విద్యాసంస్థను నెలకొల్పలేదని స్థానిక యువత వాపోతున్నారు. ఇక్కడ కొద్ది నెలల క్రితం ప్రారంభించిన డిగ్రీ కాలేజీ కూడా వైఎస్సార్‌ హయాంలోనే మంజూరైంది కావడం గమనార్హం. చంద్రబాబు తొలిసారి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని శాంతిపురానికి చెందిన శారదమ్మ నిట్టూర్చారు.
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు– వెంకటాచలం, కుప్పం

ఫ్లాట్‌ఫాంమీదే పడుకున్నా...
కుప్పం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న నార్సనపల్లెకు నిత్యం తిరగలేక అవస్థ పడుతున్నాం. బీటెక్‌ చదివినా ఇక్కడ అవకాశాలు లేక తప్పనిసరై బెంగళూరు వెళ్తున్నాం. రాత్రి పూట రైళ్లు  అందకపోతే నరకయాతనే. ఒక్కోసారి బెంగళూరులో ఫ్లాట్‌ఫాం మీదే పడుకుంటున్నాం.– విజయ్‌కుమార్,నార్సనపల్లె,శాంతిపురం

యువత పరిస్థితి దారుణం..
కుప్పంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్నా పనులు మాత్రం లేవు. కష్టపడి పిల్లల్ని చదివించినా ఫలితం ఉండటం లేదు. ఎంత కష్టమైనా కుప్పం యువత పనుల కోసం బెంగళూరు వెళ్లి రావాల్సిన దుస్థితి  పట్టింది.  – మనోజ్‌కుమార్, కుప్పం

చేసిందేమీలేదు...
వర్షాలు లేక భూములన్నీ బీళ్లుగా మారాయి. కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో బెంగళూరు వెళుతున్నాం. కూలీ డబ్బులు చాలకపోయినా గత్యంతరం లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పాలకులు చెబుతున్నారే తప్ప చేసిందేమీ లేదు.  – నారాయణప్ప,సంగనపల్లె

కంటి నిండా నిద్రపోయి ఏడాదైంది..
కుప్పం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమని గొప్పలు చెబుతుంటారు. ఇక్కడి రైతులు, నిరుద్యోగులు పడుతున్న కష్టాలు ఎవరికీ తెలియవు. తెల్లవారకముందే బయల్దేరి బెంగళూరు వెళ్లి పనులు చేసుకుని రాత్రి కుప్పం తిరిగి వస్తున్నాం. కంటి నిండా నిద్రపోయి ఏడాదైంది. డిగ్రీ  చదువుకున్నా స్థానికంగా ఉపాధి దొరకలేదు. సీఎం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఏవేవో చెబుతుంటారు. ఒక్కటీ చేయరు.  
– రవికుమార్, చిన్నపర్తికుంట

ఉపాధి కల్పిస్తేఇక్కడే బతుకుతాం..
కుప్పం రైల్వే స్టేషన్‌కు మాఊరు 18 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఉదయం 4 గంటలకే నిద్ర లేచి కుప్పం చేరుకుని బెంగళూరు వెళుతున్నాం. అక్కడ ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాకు ఇక్కడే ఉపాధి కల్పిస్తే పని చేసుకుంటూ బతికే వాళ్లం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు.– శ్రీనివాసులు,కుప్పిగానిపల్లె,శాంతిపురం

ఈ కష్టం పగవాడికీ రాకూడదు..
నిత్యం తెల్లవారుజామునే లేచి భోజనం కూడా లేకుండా రైళ్లెక్కి బెంగళూరు వెళ్లి రావాలంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణిస్తున్నాం. పనికి వెళ్లకుంటే పొట్ట గడవదు. ఇలాంటి దుస్థితి శత్రువులకు కూడా రాకూడదు.  – మంజునాథ్, చిన్నపర్తికుంట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top