చరిత్రలో నిలిచిపోయే సంకల్పయాత్ర : కోలగట్ల

Kolagatla veerabhadra Swamy Prices Praja Sankalpa yatra - Sakshi

విజయనగరం రూరల్‌: ప్రపంచ రాజకీయ చరిత్రలో పాదయాత్రతో మూడు వేల కిలోమీటర్లు మైలురాయిని దాటడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లిందని, పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3000 కి.మీ. మైలురాయి జిల్లాలో పూర్తి చేసుకున్న సందర్భంగా  సోమవారం ఉదయం కోలగట్ల నివాసంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నినాదాల మధ్య కోలగట్ల కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా కష్టజీవుల కన్నీళ్లు తుడుస్తూ, శ్రమజీవులకు ధైర్యానిస్తూ, మహిళలకు బాసటగా నిలుస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. 

కొత్తవలసలో జరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కోలగట్ల నేతృత్యంలో నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు భారీఎత్తున తరలివెళ్లారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఆశపు వేణు, నడిపేన శ్రీనివాసరావు, నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్ల ఇన్‌చార్జి, సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్వీ రాజేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కంటుభుక్త తవిటిరాజు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కనకల ప్రసాద్, పార్టీ నాయకుడు కడియాల రామకృష్ణ, మండల యువజన విభాగం అధ్యక్షులు భోగి రమణ, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శులు సత్తరపు శంకర్రావు, కనకల కృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జీవీ రంగారావు, మజ్జి త్రినాధ్, లత, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కొత్తవలస తరలివెళ్లారు. 

మాయమాటలు నమ్మి...
డ్వాక్రా రుణాలు మాఫీ అని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు.  రుణమాఫీ అవుతుందని బ్యాంకులో రుణాలు కట్టడం మానేశాం. రుణాలు మాఫీ కాలేదు సరికదా, బ్యాంకుల్లో పరపతి పోయింది. కొడుకు డిగ్రీ చదివి ఉన్నాడు. నిరుద్యోగ భృతి కూడా లేదు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయాం.  జగన్‌ సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయి. – పిల్ల సంధ్య, తామరాపల్లి, కొత్తవలస మండలం 

పింఛన్‌ పీకేశారు...
నేను వైఎస్‌ అభిమానిని. అందుకే పింఛన్‌ పీకేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నాకు పింఛన్‌ రాలేదు. ఆ పార్టీకి మద్దతు ఇస్తే పింఛన్‌ ఇస్తానన్నారు. నాకు 67సంవత్సరాలు. ఈసారి జగన్‌ అధికారంలోకి రావడం ఖాయం. మాలాంటోళ్ల బతుకులు ఆయనోస్తేనే బాగుపడతాయి. –రావాడ రామ్మూర్తి, సీతారాంపురం, 

పింఛన్‌ కోసం...
పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇవ్వడం లేదు. జగన్‌ వస్తేనే పింఛన్‌ వస్తుం ది. అన్నమాట నిలబెట్టుకునే మనిషి ఆ బాబు, ఆయన వస్తే మా బతుకులు బాగుపడతాయి. అందుకే మేమంతా జగన్‌కే మద్దతు ఇస్తున్నాం. –పిల్లల చంద్రమ్మ, తామరాపల్లి 

మూడు కుటుంబాలు ఉంటున్నాం...
వైఎస్‌ దయవల్ల అప్పట్లో మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. మా తండ్రికి ముగ్గురు కొడుకులం. ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లిళ్లు అయ్యాయి. నేను పెద్ద కొడుకుని. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఎన్నిసార్లు ఇళ్ల స్థలానికి దరఖాస్తు చేసుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దివ్యాంగుడైన 11 సంవత్సరాల నా కొడుక్కి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. జగన్‌ వస్తేనే మా ఇబ్బందులు తీరుతాయని  నమ్మకం.       –చిప్పాడ అప్పారావు,సీతంపేట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top