26న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Thirumananganam on the 26th at TTD - Sakshi

29న వైకుంఠ ఏకాదశి పూజలు ∙ 30న శ్రీవారి చక్రస్నానం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26న (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ మహాద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉపదేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేస్తారు.

ఆ తరువాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసి ప్రత్యేకపూజ, నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అలాగే ఈనెల 29న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆరోజు అర్ధరాత్రి 12:01 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

30న తీర్థ ముక్కోటి.. పుష్కరిణిలో చక్రస్నానం
ఈ నెల 30న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో తీర్థ ముక్కోటి ఉత్సవం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారు పుష్కరిణి వద్ద స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, చక్రస్నానం చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top