ధనార్జనే ధ్యేయంగా కోడెల కుమారుడు, కుమార్తె

Kodela Shiva Prasad Rao Special Story Guntur - Sakshi

శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రాజ్యంగ పదవిలో ఉన్న ముఖ్య నేత. ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి ధనార్జనే థ్యేయంగా ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ప్రశాంతంగా ఉండే సత్తెనపల్లిని సర్వ నాశనం చేశారు.. నరసరావుపేటను అక్రమాల కోటగా మార్చేశారు.. అవినీతికి పాల్పడటం తప్ప వారికి అభివృద్ధి అన్న మాటే పట్టదు.. వారికి పార్టీలతో సంబంధం లేదు.. కప్పం కడితేనే ఏ పని అయినా ప్రశాంతంగా జరిగేది.. కాదూ కూడదంటే అధికారుల దాడులు, ఆపై తప్పుడు కేసులు.. ఇసుక నుంచి రేషన్‌ బియ్యం వరకూ.. మద్యం దుకాణం నుంచి మరుగుదొడ్డి వరకూ అన్నింటిలో అక్రమ వసూళ్లే. ఏదైనా ఒక పని కోసం ఏ అధికారి వద్దకు వెళ్లినా పెదబాబు శివరామకృష్ణను కలిసి రండి అనే మాట కామన్‌గా వినిపిస్తుంది. కోడెల శివప్రసాదరావు కొడుకు, కుమార్తె ఇప్పటి వరకూ సాగించిన దోపిడీ రూ.1000 కోట్లకు పైమాటే...

గుంటూరు : వారికి రాజ్యాంగంపై గౌరవం లేదు.. ప్రజాస్వామ్యం అంటే లెక్కే లేదు.. వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. చెప్పేవి నీతులు చేసేవి మాత్రం దుర్మార్గపు పనులు.. వారి కన్ను పడిందంటే ఎంతటి ఖరీదైన భూమైనా సరే కబ్జాకు గురికావాల్సిందే.. అది ప్రభుత్వ భూమైనా, ప్రైవేటు వ్యక్తుల భూమైనా కబ్జా ఖాయం.. రెవెన్యూ రికార్డులు ఇట్టే మారిపోతాయి.. సబ్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా వారి ఇంటికి వచ్చి మరీ ఆ భూమిని వారి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి వెళ్తారు.. కాదూ కూడదని ఎవరైనా అడ్డం తిరిగితే కిడ్నాప్‌ చేసి, బలవంతంగా వేలిముద్రలు వేయించి పనికానిస్తారు.. సత్తెనపల్లి, నరసరావుపేట  నియోజకవర్గాల్లో ఏ పని చేయాలన్నా ముందుగా కాంట్రాక్టర్‌లు పెదబాబును కలిసి పర్సంటేజీలు మాట్లాడుకోవాల్సిందే.. వైన్‌ షాపులకు రూ.25 లక్షలు, బార్‌లకు రూ.20 లక్షల చొప్పున రౌడీ మామూలు చెల్లించాల్సిందే.. కేబుల్‌ ఎంఎస్‌ఓలు మొత్తం వారి కేబుల్‌ నెట్‌ వర్క్‌నే వాడాలి.. మాట వినని జీసీవీ, ఎన్‌సీవీలపై పోలీసులు ఎదుటే దాడులు చేసి ధ్వసం చేయించారు.. అడ్డు వచ్చిన వారిని తీవ్రంగా గాయపర్చారు.. మెడికల్‌ షాపులు సైతం వారి కంపెనీ మందులు నెలకు రూ.50 వేల చొప్పున అమ్మాల్సిందే.. ఇక్కడ భారీ రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా, షాపింగ్‌ మాల్స్‌ నిర్మించాలన్నా ముందుగా కప్పం కట్టాల్సిందే.. ల్యాండ్‌ కన్వర్షన్‌లు జరగాలంటే రాయల్టీ తప్పనిసరిగా చెల్లించాలి.. రైల్వే కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వలేదని ఏకంగా దాడులకు తెగబడ్డారు.. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట, రేషన్‌ మాఫియా.. ఇలా అన్ని అసాంఘిక కార్యకలాపాలూ వారి కనుసన్నల్లోనే.. చిల్లరకొట్టు వ్యాపారి మొదలు బడా పారిశ్రామికవేత్త  వరకూ అందరూ కోడెల ట్యాక్స్‌ చెల్లించాల్సిందే.. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా సొంత పార్టీ నేతలను సైతం వదలకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.. ఇదీ రాజ్యాంగ పదవిలో ఉన్న శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి సాగిస్తున్న అరాచక పర్వం..

కప్పం కట్టాల్సిందే..
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో ఒక్క ఎకరం ల్యాండ్‌ కన్వర్షన్‌ జరగాలన్నా.. చిన్న అపార్ట్‌మెంట్‌ నిర్మాణం జరగాలన్నా కోడెల శివరామకృష్ణకు తప్పనిసరిగా కప్పం కట్టాల్సిందే. ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్తే మొదటగా వినిపించే మాట ‘పెదబాబును కలిసి రండి’ అన్నదే. నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద వంద ఎకరాల్లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వెంచర్‌ వేశారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ జరుగకుండా యువనేత అడ్డుపడడంతో బతిమాలుకుని రూ.50 లక్షలకు పైగా చెల్లించి ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయించుకున్నారు. కేసానుపల్లి వద్ద 23 ఎకరాల పొలం కొన్న ఓ స్టాంప్‌ వెండర్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, పెదబాబును కలవాలంటూ రెవెన్యూ అధికారులు సలహా ఇచ్చారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. నరసరావుపేట పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ యజమానిని బెదిరించి రూ.25 లక్షలు, ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల ఎదురుగా ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌ యజమాని నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. ఓ కళాశాలకు 24 గంటలూ విద్యుత్‌ వెళ్తోందని తెలుసుకుని, దాన్ని నిలిపివేసి పునరుద్ధరించేందుకు లక్షల్లో డబ్బు వసూలు చేశారు.  నరసరావుపేట పట్టణంలోని ఆర్యవైస్య ప్రముఖులంతా విసప్పాలెం రోడ్డులో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అందులో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ఆలోచన చేశారు. ఈ విషయం తెలుసుకున్న పెదబాబు అందులో తనకు ఉచితంగా వాటా కావాలంటూ భీష్మించాడు.  ఇందులో భాగస్వామ్యులైన సొంత పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఆయనకు అడ్డు చెప్పలేక నిర్మాణాన్ని నిలిపివేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నాలుగైదు అపార్ట్‌మెంట్‌ల కంటే ఎక్కువ నిర్మాణాలు జరగలేదంటే అందుకు కారణం కోడెల తనయుడేననేవిమర్శలు వినిపిస్తున్నాయి.

వేణుగోపాలస్వామి ఆలయ ఈనాం భూమి శివార్పణం
సత్తెనపల్లి పట్టణంలో సర్వే నంబరు 32లో 4.32 ఎకరాలు వేణుగోపాలస్వామి ఆలయ ఈనాం భూమి ఉంది. గతంలో ఈ స్థలాన్ని స్వామివారికి సేవలు చేసే బోయలు, నాయీబ్రాహ్మణ, రజక, వడ్డెర వంటి వృత్తిదారులకు ఈనాంగా ఇచ్చారు. పట్టణం భారీగా పెరిగిపోవడంతో ఈ స్థలం విలువ కోట్లల్లో పెరిగిపోయింది. దీంతో కోడెల తనయుడి కన్ను ఈ స్థలంపై పడింది. వెంటనే రెవెన్యూ అడంగళ్లులో పేర్లు మారిపోయాయి. ఈ స్థలాన్ని రిజిష్ట్రరు చేయవచ్చంటూ తహసీల్దారు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చేశారు. ఆ వెంటనే సబ్‌ రిజిస్ట్రారు సైతం ఆ స్థలాన్ని యువనేత బినామీ అయిన ఓ కాంట్రాక్టర్‌ పేరుతో రిజిష్ట్రరు చేసేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో విలాసవంతమైన భవంతిని నిర్మిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంట్రాక్టు పనులు అప్పగించినందుకుగాను సదరు కాంట్రాక్టర్‌ రూ.2 కోట్లతో ముఖ్యనేతకు ఇంటిని నిర్మించి ఇస్తున్నారు.

పర్సంటేజీ ఇవ్వందేపని జరగదు
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు జరగాలన్నా కాంట్రాక్టర్లు కోడెల తనయుడు శివరాంను కలిసి పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేకుంటే పనులు జరుగవు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. రొంపిచర్ల మండలంలో రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వలేదనే కారణంతో పనులు నిలిపివేయించారు. కోటప్పకొండ వద్ద రూ.7 కోట్లతో టీటీడీ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వనందుకు కొన్ని రోజులపాటు పనులు నిలిపివేయించారు. అక్కడ పనిచేసేవారిపై పోలీసు స్టేషన్‌లలో తప్పుడు కేసులు పెడతామంటూ భయపెట్టి చివరకు పర్సంటేజీలు ఇవ్వగానే పనులు మొదలుపెట్టడానికి అనుమతించారు. కోటప్పకొండ కింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణానికి రూ.5 కోట్లతో ఆన్‌లైన్‌లో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను కమీషన్ల కోసం బెదిరించడంతో తాను పనులు చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో ప్రభుత్వమే దానిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది.

బార్‌లు, వైన్స్‌ల నుంచిరౌడీ మామూళ్లు
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అన్న మండలాలు, పట్టణాల్లో ప్రభుత్వం ద్వారా లైసెన్స్‌లు పొందిన బార్‌లు, వైన్స్‌ల యజమానులు ఒక్కో షాపుకు రూ.20 లక్షలు చెల్లించాలని టార్గెట్‌ పెట్టారు. లేదంటే వ్యాపారాలు చేయనివ్వనంటూ బెదిరింపులకు దిగడంతో చేసేది లేక అంతా మామూళ్ళు పంపారు. బార్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో సైతం రూ.20 లక్షలు ఇవ్వాలని, అప్పటి వరకూ అనుమతులు ఇవ్వవద్దంటూ అధికారులకు ఆదేశాలుజారీ అయ్యాయి. కొద్ది రోజులు దీనిపై ఆందోళన చేసిన బార్‌ల యజమానులు చివరకు మధ్యవర్తుల ద్వారా కొంత తగ్గించి రాజీ కుదుర్చుకున్నారు.  

మరుగుదొడ్లలోమామూళ్ల కంపు
నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో 40 వేల మరుగుదొడ్లు నిర్మించామని గొప్పగా చెప్పుకున్న కోడెల ఆయన తనయుడు మరుగుదొడ్లలో సుమారు రూ.20 కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా గ్రామాల్లో పాత మరుగుదొడ్లకు స్వచ్ఛ భారత్‌ లోగో వేసి కొత్తగా నిర్మించినట్లుగా బిల్లులు చేయించుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముప్పాళ్ల మండలంలో పాత మరుగుదొడ్లకు ముద్రలు వేసేందుకు అంగీకరించకపోవడంతో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై దాడిచేసి కొట్టారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇదిలా ఉంటే దేశ విదేశాల్లో తమకున్న పరిచాయాలతో మరుగుదొడ్ల నిర్మాణాలకు విరాళాలు వసూలు చేసి అవన్నీ తమ జేబుల్లో వేసుకుని భారీ స్కామ్‌కు పాల్పడ్డరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కోడెల కుమార్తె కంపెనీ మందులు అమ్మాల్సిందే
కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్‌ కంపెనీలో తయారయ్యే మందులను జిల్లాలోని అన్ని మెడికల్‌ షాపుల్లో తమ వ్యాపారాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకూ సరుకు అమ్మాల్సిందే. ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ద్వారా ఈ మేరకు మెడికల్‌ షాపుల యజమానులకు ఆదేశాలు జారీ చేయించారు. అలా కాదని ఎవరైనా అడ్డం తిరిగితే వెంటనే సదరు దుకాణాలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తారు. దీంతో ఏం చేయలేక అందరూ వీటిని అమ్ముతున్నారు.

కన్ను పడితే కబ్జాలే...
జిల్లాలో ఎంతటి ఖరీదైన భూమి అయినా శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె, కుమారుడి కళ్లలో పడిందంటే కబ్జాకు గురైనట్లే. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో డి.నం. 167–1ఏ, 167–1సీ, 168–1, 168–3 సర్వే నంబర్లలో 17.13 ఎకరాల భూమిని 19 మంది రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరం ధర రూ.కోటి వరకు ఉండటంతో శివరామకృష్ణ కన్ను దీనిపై పడింది. గతంలో ఆ రైతులకు పొలం అమ్మిన వ్యక్తికి సంబంధించిన బంధువులు, అమెరికాలో ఉంటున్నట్లు తెలుసుకుని అక్కడ వాలిపోయారు. యువనేత వెంట ఉండే ఓ వ్యక్తిపేరుపై జీపీ రాయించుకుని సత్తెనపల్లి రిజిష్ట్రరును ఇంటికి పిలిచి రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతే రూ.17 కోట్ల విలువ చేసే భూమి వారి సొంతమైంది. తమ వద్ద 1953 నుంచి డాక్యుమెంట్లు, సిస్తు రశీదులు, టెన్‌వన్‌ అడంగళ్‌ కాపీలు, పంచాయతీ అప్రూవల్, జీడీసీసీ బ్యాంకు లోను పత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, వీఆర్వో నుంచి ఆర్డీవో వరకు ఇచ్చిన నివేదికలు, ఇలా 23 డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అధికారులు ఏమీ పట్టించుకోలేదు. దీంతో సదరు బాధిత రైతులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

మరో కేసులో రాజుపాలెం గ్రామంలో ఏడు ఎకరాల భూమిని విశ్రాంత ఉద్యోగుల నుంచి లాక్కొని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తానూ ఆ తండ్రిబిడ్డనే అంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మి నల్లపాడు గ్రామ పరిధిలో సర్వే నం 566/1లో 2.16 ఎకరాల అతి ఖరీదైన భూమిపై కన్నేశారు. అనుకుందే తడవుగా సదరు రైతును కిడ్నాప్‌ చేసి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఆమెపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అది ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కోడెల కొడుకు, కుమార్తెల చూపు, భూములపై పడుతుందేమోననే భయంతో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రైతులు, రియల్టర్లు కంటిపై కునుకు లేకుండా ఉన్నారు.

నిఘా విధుల్లో 8 మంది
పెదబాబు తన అక్రమ వ్యవహారాలకు ఎక్కడా వెలితి రాకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గుంటూరులో ద్విచక్ర వాహనాల షోరూం బాధ్యతలు చూసే తన అనుచరులను ఎనిమిది మందిని సత్తెనపల్లి, నరసరావుపేటలో నిఘాకు నియమించారు. భూముల కొనుగోళ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ల్యాండ్‌ కన్వర్షన్‌కు ఎక్కడెక్కడి నుంచి దరఖాస్తులు వస్తున్నాయి, ఏయే కాంట్రాక్టు పనులు రానున్నాయి, రిజిస్ట్రేషన్లు,   ఇతర వ్యాపారాలు ఏమేమి జరుగుతున్నాయనే స్పష్టమైన సమాచారాన్ని ఈ ఎనిమిది మంది సేకరిస్తారు. ఆ సమాచారం ఆధారంగా పెదబాబు నుంచి ఫోన్లు వెళతాయి. చెప్పినంత కప్పం చెల్లించారా సరేసరి.... లేదంటే పోలీసులు, అధికారుల వైపు నుంచి తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు మొదలవుతాయి. అప్పటికీ వినకపోతే పెదబాబు గూండాలు రంగంలోకి దిగి దాడులకు సైతం తెగబడతారు.

రెండు నియోజకవర్గాల్లో కేబుల్‌ దందా..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యనేత తనయుడు కేబుల్‌ ఆపరేటర్‌లపై దౌర్జన్యాలకు దిగారు. తన కేబుల్‌ నెట్‌వర్క్‌ నుంచే కనెక్షన్‌ తీసుకోవాలంటూ ఎంఎస్‌ఓలను బెదిరించి మరీ బలవంతంగా తన కేబుల్‌ను లాగారు. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో 2016 మార్చి 16వ తేదీన జీసీవీ కార్యాలయంపై కోడెల గూండాలు దాడి చేసి సుమారు రూ.కోటి విలువ చేసే ఫర్నిచర్, కేబుల్‌ పరికరాలను ధ్వసం చేశారు. దీనిపై కేబుల్‌ యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అక్షింతలు వేయడంతో పోలీసులు కోడెల శివరాంపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత కొన్ని నెలలకే నరసరావుపేట పట్టణంలో ఉన్న ఎన్‌సీవీ కార్యాలయంపై పోలీసులు చూస్తుండగానే కోడెల అనుచరులు దాడిచేసి ధ్వసం, దాని అధినేత నల్లపాటి రాము తండ్రి, జీడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ నల్లపాటి చంద్రంను తీవ్రంగా గాయపర్చారు. అంతటితో ఆగకుండా ఎదురు కేసులు పెట్టించి అరెస్ట్‌ చేయించారు. వారి వెర్లన్నీ కట్‌ చేసి కోడెల చానల్‌ మాత్రమే ఉండేలా కుయుక్తి పన్నారు.

అసాంఘిక కార్యకలాపాలూ వారి కనుసన్నల్లోనే
ఇసుక అక్రమ రవాణా, రేషన్‌ మాఫీయా, క్రికెట్‌ బుకీలు, పేకాట నిర్వహణ, గుట్కా అక్రమ వ్యాపారం, నకిలీ మందుల వ్యాపారం, బెల్టు దుకాణాలు ఇలా అక్రమ వ్యాపారం, అసాంఘిక కార్యకలాపాలన్నీ యువనేత కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. నరసరావుపేటలోని ఓ కౌన్సిలర్‌ ద్వారా రేషన్‌ మాఫియా నిర్వహిస్తూ నెలనెలా లక్షలు గడిస్తున్నారు. తన అనుచరుల ద్వార క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాట నిర్వహిస్తూ  మామూళ్లు దండుకుంటున్నారు. నరసరావుపేటలోని ఓ సీఐ ద్వారా గుట్కా అక్రమ వ్యాపారుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. తమ కంపెనీల్లో తయారయ్యే మందులను ప్రతి మెడికల్‌ షాపులో నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసి విక్రయించాల్సిందే అని ముఖ్యనేత కుమార్తె సమావేశం నిర్వహించి మరీ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే మరుసటి రోజే ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని హెచ్చరిక చేశారు. రెండు నియోజకవర్గాల్లో మద్యం దుకాణం, బార్‌ యజమానుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేయడమే కాకుండా నెలనెలా రూ.30వేలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ, బెల్టు దుకాణాలను నిర్వహించుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ నుంచి మద్యం వ్యాపారులకు అనుమతులు ఇప్పిస్తున్నారు.

కమీషన్‌ ఇవ్వలేదని దాడి
ప్రతి పనికీ పర్సంటేజీలు వసూలు చేసే కోడెల తనయుడు రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే పనులు జరుగుతున్న సమయంలో తన వాటా పంపాలంటూ సదరు కాంట్రాక్టర్‌కు కబురు పంపించినా పట్టించుకోలేదని పలుమార్లు దాడి చేసి టిప్పర్లు, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసులతో బెదిరించిన ఘటనలు అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ విషయాన్ని సదరు కాంట్రాక్టర్‌ ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ కూడా పెట్టాడు. ఎవరు చెప్పినా తన వాటా ఇవ్వందే పనులు చేసేందుకు అంగీకరించని కోడెల తనయుడు 2016 ఆగస్టు 21వ తేదీన రైల్వే పనులు చేపడుతున్న కార్మికులపై దాడికి దిగారు. కూలీలు ఉండే రేకుల షెడ్‌లను పీకేశారు. మూడు టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే శాఖకు చెందిన కారు అద్దాలు, కాంట్రాక్టర్‌లారీలను ధ్వసం చేశారు. రైల్వే సిబ్బందిగా ఉన్న డ్రైవర్‌ కృష్ణ, సూపర్‌వైజర్‌ ఎండీ ఉస్మాన్‌ను కొట్టుకుంటూ తమ వాహనాల్లో ఈడ్చి పడేసి కిడ్నాప్‌ చేశారు. కర్రలతో, రాడ్లతో కార్మికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top