ఆకలి తీరుస్తున్న కాశినాయన ఆశ్రమం

Kasireddynayana Nityannadanam In Allagadda Kurnool District - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ఉన్నట్టుండి ఇంటికి నలుగురు అతిథులు వస్తే.. భోజన ఏర్పాట్లకు ఆ ఇల్లాలు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఏదైనా శుభకార్యం చేయాలంటే.. ఓ నెల రోజుల ముందు నుంచే వందలెక్కలు వేస్తాం.. అలాంటిది అక్కడ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా వేలాది మందికి వేడివేడిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేస్తారు. సుమారు 50 సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతున్న ఈ అన్నదాన మహత్కార్యం లక్షలాది మంది అభినందనలు అందుకుంటోంది. కరువు సీమ రాయలసీమలో నిత్యాన్నదానాలు జరగడం ఒక విశేషమైతే కాశినాయన మొట్టమొదట ప్రారంభించిన అన్నదాన సత్రం అహోబిలంలోనిది కావడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం నుంచి మూడు కిలో మీటర్లు అడవిలోపలికి వెళితే యోగానంద నృసింహస్వామి క్షేత్రం వస్తుంది. ఒకప్పుడు ప్రజలు ఏమాత్రం సంచరించేందుకు వీలులేని ప్రాంతమది. అలాంటి ప్రదేశానికి నేడు ఆటోలు, ప్రత్యేక వాహనాలు, మోటర్‌ సైకిళ్లు భారీగా వెళ్తున్నాయి. ఈ పెను మార్పుకు ముఖ్య కారణం అక్కడ వెలసిన కాశినాయన నిత్యాన్నదాన సత్రమే.  

ఎలా ఏర్పాటయిందంటే 
ఆత్మజ్ఞానాన్ని పొందిన కాశినాయన 1979– 80 ప్రాంతంలో యోగానంద క్షేత్రం చేరుకున్నారు. శిథిలావస్థకు చేరిన దేవాలయాన్ని ఒకే రోజు నిర్మించి అక్కడ బాలయోగానంద స్వామిని పునః ప్రతిష్టించారు. మొదట అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారని ఆయన శిష్యులు చెబుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ నిత్యాన్నదాన ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి.  

ఉద్యమంలా అన్నదానం  
కాశినాయన చేతులమీదుగా సుమారు 50 సంవత్సరాల క్రితం చిన్న గుడిసెలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. మొదట్లో జొన్న సంగటి, రొట్టెలు, కొర్ర అన్నం, మజ్జిగ వడ్డించే వారు.  భక్తుల వితరణతో నేడు ఆధునిక పద్ధతిలో వంటలు తయారు చేస్తున్నారు.  రోజూ 500 మంది వరకు భోజనానికి వస్తుండగా శని, ఆదివారాల్లో వీరి సంఖ్య వెయ్యికి పెరుగుతోంది. దేశంలోని నలుమూలలనుంచి వచ్చే భక్తులకు నల్లమల అడవిలో ఇక్కడ తప్ప మరెక్కడా భోజనవసతి ఉండదు.  ఏ సమయంలో పోయినా కడుపునిండా అన్నం దొరికే ప్రదేశం కాశినాయన ఆశ్రమమని చెప్పుకుంటారు. సాధారణ భక్తులు, యాత్రికులతో పాటు ఈ ప్రాంతంలోని అనేక మంది పేద వర్గాలు తమ వివాహ, ఇతర శుభకార్యాలు సైతం ఇక్కడ చేసుకుని ఉచితంగా విందు భోజనం చేసి వెళ్తుంటారు. ఏడాదికి కనీసం 15 వివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి.

ఏమీ లేకపోయినా నిత్యాన్నదానం చేస్తున్నాం 
ఆశ్రమం ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడి దారిలేదు. కొండలో చెట్లలో వచ్చి చిన్న పందిరి వేశాం. అప్పుడే కాశి నాయన చెప్పినాడు ఇక్కడికి వేలల్లో భక్తులు వస్తారు.. వచ్చిన అందరికి ఆకలి తీర్చాలని. ఏమీ లేక పోయినా మనం 10 మంది ఆకలి తీరిస్తే 100 మంది ఆకలి తీర్చడానికి సరిపడా సాయం దేవుడు చేస్తాడని చెప్పేవాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. మా దగ్గర ఏమీ లేక పోయినా నిత్యం అన్నదానం కొనసాగిస్తూనే ఉన్నాం.   
–రామదాసు, ఆశ్రమ నిర్వాహకుడు    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top