నిలిచిన పేరు ప్రతిష్ట

Kakinada Name In Best Liveable City East Godavari - Sakshi

 సౌకర్యవంత నివాసయోగ్య నగరంగా కాకినాడ

దేశవ్యాప్త పోటీలో పరుగుపెట్టిన జిల్లా కేంద్రం

కాకినాడ...ఈ పేరు వెనుక ఎంతో చరిత్ర ఉంది. పెన్షనర్స్‌ పేరడైజ్‌గా, ప్లాన్డ్‌ సిటీగా,  ఆంధ్రా ప్యారిస్‌గా ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. రెండు శతాబ్దాల నుంచి ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, సంగీత, సాహిత్య ఉద్యమ రంగాల్లో ఎంతో విశిష్టత సాధించింది. ఇక్కడ నుంచి ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొంది ‘కాకినాడ’ పేరును దిశ దిశలా వ్యాపింపజేశారు. తాజాగా కేంద్రం ప్రకటించిన సౌకర్యవంత నివాసయోగ్య ప్రాంతాల జాబితాలో కాకినాడ పేరు చోటుచేసుకోవడం నగర వాసులకే కాదు... జిల్లా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది.

కాకినాడ: ఆధ్యాత్మికంగా, చారిత్రక, సంగీత, సాహిత్య రంగాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కాకినాడ సౌకర్యవంత నగరాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సోమవారం విడుదల చేసిన ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌’లో ప్రకటించిన జాబితాలో తిరుపతికి 4వ స్థానం, విజయవాడకు 9వ స్థానం దక్కగా విశాఖపట్నం, కాకినాడలకుస్థానం దక్కడంతో నగరవాసుల్లో ఆనందం పెల్లుబుకుతోంది. ప్రధానంగా రెండు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన డచ్‌ పాలకులు ప్రణాళికా బద్ధంగా చేసిన రహదారుల నిర్మాణాలు వల్ల ప్లాన్డ్‌ సిటీగా పేరొచ్చిందని పెద్దల ఉవాచ. సినిమా రోడ్డు, మెయిన్‌ రోడ్డు, దేవాలయం వీధిలను సమాంతరంగా నిర్మించడం, వీటికి మధ్యలో అనుసంధానంగా రహదారులు ఏర్పాటు చేసి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా చేరుకునేలా నిర్మాణాలు చేయడం వల్ల ఈ పేరొచ్చిందని చెబుతుంటారు. ఈ తరహా నిర్మాణాలు ప్యారిస్‌లోను, మద్రాస్‌లో కూడా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో కాకినాడను ఆంధ్రా ప్యారిస్‌గాను, రెండో మద్రాస్‌గా కూడా పిలిచేవారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తీరప్రాంతం, విశాలమైన రహదారులు, ప్రణాళిక బద్దమైన నిర్మాణాలతో ఉండే ఈ ప్రాంతానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపడంతో ఈ ప్రాంతాన్ని ‘పెన్షనర్స్‌ ప్యారడైజ్‌’గా పిలిచేవారు.

ఆధ్యాత్మిక, కళా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు...
ప్లాన్డ్‌సిటీగా పేరున్న ఈ ప్రాంతానికి పూర్వకాలం నుంచి సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, ఉద్యమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రావు గోపాలరావు, ఎస్వీ రంగారావు, రేలంగి, అంజలీదేవి, సూర్యకాంతం, సి.పుల్లయ్య వంటి ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి నుంచే నటులుగా ఎదిగారు. ప్రఖ్యాత గాయకుడు పీబీ శ్రీనివాస్, సాహితీవేత్తలుగా ఓ వెలుగు వెలిగిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, రజనీకాంతరావు, వేదుల వంటివారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. ప్రఖ్యాత వీణా విద్వాంసులు చిట్టిబాబు, ఈమని వంటివారు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నత స్థాయికి ఎదగడంతో ‘కాకినాడ’ పేరు దశదిశలా వ్యాపించింది. ఇక పిఠాపురం మహారాజా దాతృత్వంతో వేలాది ఎకరాలను ఉచితంగా ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ, వైద్య కళాశాలలు, సేవా సంస్థలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పురాతన గ్రంథాలు, శిలాశాసనాలు ఉండే ఆంధ్ర సాహిత్య పరిషత్‌ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ జరిగే అవధానాలకు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

కో కెనడా నుంచి  కాకినాడ...
డచ్‌ పాలకుల హయాం నుంచి ఈ ప్రాంతాన్ని ‘కో కెనడా’ అని పిలిచేవారు. ఆ తరువాత చాణక్యుల పాలనలో కాకనందివాడగా పేరొచ్చింది. ఆ తరువాత ఎర్రకలువలతో ఉండే ప్రస్తుత బోట్‌క్లబ్, బాలాజీ చెరువు, పిండాల చెరువు, సంత చెరువు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని కోకనాధపురంగా పిలిచేవారని, ఆ తరువాత కాలక్రమేణా కాకినాడగా ఈ ప్రాంతం విశిష్టతను పొందింది. ఇక దేశ స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ ప్రాంతం ఎంతో విశిష్టత సాధించిన కాకినాడ అన్ని రంగాల్లోను విశిష్టతను నిలుపుకుని ఇప్పుడు ఉత్తమ నగరాల్లో తన పేరును నిలబెట్టుకోగలిగింది. నాటి చారిత్రక అంశాలతోపాటు ఈ ప్రాంతంలో కొసరి,కొసరి వడ్డించే సుబ్బయ్య హోటల్‌ పేరు ప్రస్తావించగానే ఆకలి గుర్తుకు రావల్సిందే. గొట్టం కాజాగా పిలిచే కాకినాడ కోటయ్య కాజా మధుమేహులనైనా తినేటట్టు చేస్తుంది.

అన్నింటికీ కాకినాడ స్ఫూర్తి...
దేశభక్తికి, జీవన కళలకు కాకినాడ వేదిక. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, విజ్ఞానపరంగా ఎంతో పేరు సాధించిన కాకినాడను సౌకర్యవంత నివాసయోగ్య నగరంగా గుర్తించడం ఎంతో సంతోషదాయకం.  
– డాక్టర్‌ వేదుల శ్రీరామ శర్మ (శిరీష), సాహితీవేత్త, సంఘసేవకులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top