‘హోదా’తోనే ఏపీకి నూరు శాతం న్యాయం

Janasena President Pawan Kalyan comments on Ap special status - Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు నూరు శాతం న్యాయం జరుగుతుందనే అభిప్రాయానికి సంయుక్త నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ) వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. జేఎఫ్‌సీ నివేదికపై తుది కసరత్తు చేసిన అనంతరం శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోవడం వల్లే జనసేన పుట్టిందని అన్నారు.  11 అంశాలను కమిటీ పరిశీలించిందన్నారు. తనను బీజేపీ, టీడీపీ భాగస్వామిగా భావించాయని అన్నారు. ప్రజలకు నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వచ్చిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకు? 
పాచిపోయిన లడ్డూలాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా సరిగ్గా ఇవ్వలేదని, ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా పరిస్థితి తయారైందని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అయోమయ పరిస్థితి వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయడం లేదన్నారు.

ఎంతో పరిపాలన అనుభవం ఉన్న నాయకులే అయోమయానికి గురైతే అశ్రద్ధకు దారి తీసిందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలే అధికారంలో ఉన్నప్పటికీ ఈ అయోమయం ఎందుకని పేర్కొన్నారు. జేఎఫ్‌సీ సభ్యుడు జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ... తమ దగ్గరున్న సమాచారం ప్రకారం రూ.74,542 కోట్ల నిధులు మన హక్కుగా రాష్ట్రానికి రావాలన్నారు. మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు  పద్మనాభయ్య, ఐవైఆర్‌ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, తోట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top