జననేతకు అభిమానంతో..

Jagan Fans Gifted Goat In Praja sankalpa yatra - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గొర్రెల కాపరులు అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా సంకల్పయాత్రగా తమ గ్రామానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు రత్నపల్లిలో రామచంద్రుడు ఆధ్వర్యంలో పదిమంది గొర్రెల కాపర్లు కలిసి గొర్రెపిల్లను బహూకరించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో గొర్రెలకు బీమా వసతి కల్పించడంతో తాము ఎంతో లాభపడుతున్నామని తెలిపారు. ‘మీరు అధికారంలోకి రాగానే గొర్రెల కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరగా అందుకు వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.

సంపాదనంతా చలానాలకే సరిపోతోందన్నా..
కోవెలకుంట్ల: ఆటోల రోడ్‌ ట్యాక్స్, ఎఫ్‌సీ చలానాలను విపరీతంగా పెంచడంతో తమ సంపాదనంతా వాటికే సరిపోతోందని ఆటోడ్రైవర్‌ కిషోర్‌ ఇతర ఆటోడ్రైవర్లతో కలిసి వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఆటోలకు ఎఫ్‌సీ గడువు దాటితే రోజుకు రూ.50 జరిమానా విధిస్తున్నారని, రిజిస్ట్రేషన్‌ తదితర అన్ని చలానాల రేట్లను పెంచడంతో తాము ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

పంటలకు గిట్టుబాటు ధర లేదన్నా..  
కోవెలకుంట్ల: మూడేళ్ల నుంచి పత్తి, కంది పంటల సాగుతో నష్టాలు చవి చూస్తున్నామని రైతులు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. గురువారం వెల్దుర్తి మండలంలో పాదయాత్ర సాగుతుండగా ఎల్‌.బండ గ్రామానికి చెందిన రమణారెడ్డి, వెంకటరెడ్డితో పాటు మరికొందరు రైతులు వైఎస్‌ జగన్‌ను కలసి తమ గోడు విన్నవించుకున్నారు. కంది సాగులో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పెట్టుబడి కోసం వెచ్చిస్తుండగా, నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదన్నారు. మార్కెట్‌లో క్వింటా శనగలు రూ.2,600 నుంచి రూ.3,200లోపే ధర పలుకుతున్నాయని, ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా రావని వారు జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది అధిక వర్షం కురిసి పత్తికి నష్టం వాటిల్లిందని వాపోయారు. ఒక్క ఏడాది ఆగితే రైతులకు మంచిరోజులు వస్తాయని జగన్‌ వారికి భరోసానిచ్చారు.

వాల్మీకులను మోసం చేస్తున్నారు..
కోవెలకుంట్ల: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ హామీని తుంగలో తొక్కారని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన బోయనపల్లి క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్య విన్నవించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని, పరిశీలించి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top