జీజీహెచ్‌లో ఐసోలేషన్‌ వార్డు

Isolation ward in Guntur GGH - Sakshi

రోగుల కోసం 80 పడకలు సిద్ధం

అవగాహనే మందు.. ఆందోళన వద్దు   

రోగుల సహాయకులు పరిమితంగా రావాలి

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

గుంటూరు మెడికల్‌/గుంటూరు వెస్ట్‌: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాధి సోకదని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించుకుని, జాగ్రత్తలు పాటించడమే సరైన మందని, ఆందోళన అవసరంలేదని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌)లో కరోనా అనుమానితుల కోసం 80 పడకలతో వార్డు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆయన శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో జనరల్‌ మెడిసిన్‌ వార్డు, నెఫ్రాలజీ వార్డు, బీక్లాస్‌ గదులు, నూతనంగా నిర్మించిన ఐసీయూ విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులందరిని కలిపి కరోనాను ఎదుర్కొనేందుకు ఐఎంఏ వైద్యుల సహకారంతో ప్యానల్‌ డాక్టర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఏదైనా కరోనాఅనుమానిత కేసు వస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అందరూ కలిసి వైద్యం చేస్తారన్నారు. రోగుల సహాయకులు ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రాకుండా కట్టడి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  అనుమానితులు చికిత్స కోసం వస్తే వారి ద్వారా ఇతరులకు సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

బాధితులు మీడియాతో మాట్లాడకూడదు
జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ బాధితులు, అనుమానితులతో మీడియా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. గోరంట్ల జ్వరాల ఆసుపత్రిలో రోగి కేస్‌ షీట్‌ను ఫొటోలు తీసి వాట్సాప్‌ ద్వారా బహిర్గం చేశారని, చట్టరీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరించారు.

కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్‌కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంనుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశం నుంచి కలెక్టర్‌ స్పందిస్తూ గ్రామ స్థాయి నుంచి ప్రధాన నగరాల వరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్‌ 14న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేటు భూములు 3,318 ఎకరాలు అవసరమని, 500 ఎకరాలు మినహా సేకరించామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకరరావు, అర్బన్, రూరల్‌ ఎస్పీలు పి.హెచ్‌.డి.రామకృష్ణ, సి.హెచ్‌.విజయారావు, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్, జేసీ–2 శ్రీధర్‌ రెడ్డి, డీఆర్వో ఎన్‌.వి.వి.సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జె.యాస్మిన్, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ బాబూలాల్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ బత్తుల వెంకటసతీష్‌కుమార్, డెప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అప్రమత్తంగా ఉన్నామని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామని రూరల్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు శుక్రవారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top