త్వరితగతిన విచారణ పూర్తిచేయాలి

Investigation Speedup In Alchohol Death Case West Godavari - Sakshi

దోషులపై కఠిన చర్యలకు సిద్ధం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఐజీ వెంకటేశ్వరరావు

తణుకు:  ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఐజీ కె.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. సత్యవాడ గ్రామంలో మద్యం తాగిన యువకుల్లో మడిచర్ల శివవర్మ ప్రాణాలతో బయటపడి తణుకులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మంగళవారం ఆయన పరామర్శించి జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సత్యవాడ గ్రామంలో యువకులు మందుపార్టీ చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించి పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న మద్యం, బీరు బాటిళ్లను ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపించినట్లు చెప్పారు. త్వరితగతిన పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గానీ యువకుల మృతికి కారణాలు వెల్లడికావన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివవర్మను పరామర్శించిన ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎన్ఫోర్స్‌మెంట్‌ సీఐ సీహెచ్‌ అజయ్‌కుమార్‌సింగ్, తణుకు సీఐ కె.ఎ.స్వామి, ఎక్సెజ్‌ సీఐ యు.సుబ్బారావు, ఉండ్రాజవరం ఎస్సె కె.గంగాధరరావు, ఇతర ఎక్సెజ్, పోలీసు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top