అధిష్టానం వద్ద చెల్లని అశోక్‌ మాట..!

అధిష్టానం వద్ద చెల్లని అశోక్‌ మాట..!


 మహంతి చిన్నంనాయుడికే టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి

 ⇔  పతివాడకు చెక్‌ చెప్పేందుకేనా?

 ⇔  నిరాశలో కేంద్రమంత్రి అశోక్‌ వర్గం..!
విజయనగరం కంటోన్మెంట్‌: ఎవరేమనుకున్నా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు చెప్పిందే వేదం. ఆయన మాటకు అధిష్టానం తూచ్‌ అనే ప్రశ్నే లేదు.. ఇదీ నిన్న మొన్నటి వరకూ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై టీడీపీ వర్గాల అభిప్రాయం. ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అశోక్‌ సూచించిన, అతని అనుంగు శిష్యుడిగా పేరొందిన ద్వారపురెడ్డి జగదీష్‌ను అశోక్‌ ప్రతిపాదించారనేది ఎవరూ కాదనలేని సత్యం. ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో మహంతి చిన్నంనాయుడి పేరు ఖరారయింది. దీంతో అధిష్టానం వద్ద అశోక్‌ ప్రాభవం తగ్గిందని, జిల్లా తెలుగు దేశం పార్టీలో ఇక పెద్ద మార్పులే చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా పార్టీ పదవులకు సంబంధించి అశోక్‌ గజపతిరాజు మాటకు అధిష్టానం ఎదురుచెప్పలేదు. అలా అని ఆయన అన్ని విషయాల్లోనూ కలుగజేసుకోలేదన్నది కూడా నిర్వివాదాంశం. అధికారంలో ఉన్నా లేకున్నా అశోక్‌కు ఆమాత్రం విలువను కట్టబెట్టిన అధిష్టానం ఇప్పుడు రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసిం దనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పక్క జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు  ఎప్పుడయితే ఇన్‌చార్జి మంత్రిగా జిల్లాలో అడుగుపెట్టారో అప్పటినుంచి ఈ వాదనకు మరింత బల చేకూరింది. కేవలం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక అంశంతోనే అశోక్‌ ప్రాభవంపై చర్చ జోరందుకుంది.

 

పతివాడకు చెక్‌! గంటాకు చోటు కోసమేనా?

జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో చాలా వరకూ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. ఇందులో నెల్లిమర్ల ముందుంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పతివాడ నారాయణ స్వామినాయుడు వృద్ధాప్యం కారణంగా ఆయనను తప్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఆయన కుమారులకు టిక్కెట్‌ ఇచ్చే ఉద్దేశం కూడా లేనట్టు బోగట్టా. విశాఖ జిల్లాలో వెలుగుచూసిన భూ కుంభకోణం భవిష్యత్‌లో పార్టీకి తీరని నష్టం చూకూర్చుతుందని భావించిన అధిష్టానం.. గంటా శ్రీనివాసరావుకు నెల్లిమర్ల టిక్కెట్టు ఇచ్చేందుకు పావులుకదుపుతున్న సమాచారం. ఒకవేళ గంటా ప్రాతినిధ్యానికి నెల్లిమర్లలో వ్యతిరేకత వస్తే మహంతి చిన్నం నాయుడినే కొనసాగించుకోవచ్చనే నిర్ణయంతో అధిష్టానం పావులు కదిపినట్టు భోగట్టా! మహంతి చిన్నంనాయుడి ఎంపిక నేపథ్యమిదేనని పార్టీ సీనియర్లు అంటున్నారు.అవాక్కయిన టీడీపీ నేతలు..

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మహంతి చిన్నం నాయుడి పేరును ప్రకటించిన వెంటనే టీడీపీ జిల్లా నేతలు అవాక్కయ్యారు. మొదటి నుంచీ మాజీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌నే మళ్లీ ఎన్నుకుందామని అశోక్‌ అంటూ వస్తున్నారు. గంటా శ్రీనివాసరావు వచ్చి వెళ్లిన తరువాత ఐవీఆర్‌ఎస్‌ ప్రకటనలు జోరందుకోవడం, అందులో ద్వారపురెడ్డి జగదీష్‌ పేరు లేకపోవడంతో అ«ధ్యక్షుడిగా జగదీష్‌ పేరు చర్చల్లోకి రాలేదు. గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, అతని సోదరుడు కొండలరావు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడుల పేర్లు ఐవీఆర్‌ఎస్‌లో వచ్చాయి. చాలా మంది అశోక్‌ చెప్పిన వారికే పదవి వస్తుందని ప్రచారం చేశారు.కానీ, కె.ఎ.నాయుడు, కొండలరావుల పేర్లు దాదాపు ఖరారయినట్టేనని జిల్లాలో ఊహాగానాలు అందుకున్నాయి. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత పేరు తెరపైకి వచ్చి పెద్ద ప్రచారమే జరిగింది. జిల్లాలో అంతో ఇంతో పేరున్న  వీరందరి పేర్లూ తెరమీదికి వచ్చినా ఓ మండల స్థాయి నాయకుడిగా చిరకాలం అక్కడే ఉండిపోయిన మహంతి చిన్నం నాయుడి పేరు రావడంతో పలువురు జీర్ణించుకోలేకపోతున్నారన్నది సత్యం. ఆయన జిల్లా స్థాయిలో ఎప్పుడూ వేలు పెట్టలేదని, ఆయన మండల కేంద్రానికే ఏళ్ల తరబడి పరిమితమయ్యారని, ఆయనకెలా ఇచ్చారబ్బా? ఇదేం ఎన్నిక అంటూ జిల్లా నేతలు అవాక్కవుతున్నారు.

 

Back to Top