ఇంటర్‌లో అద్వితీయం

Intermediate Results Special Story - Sakshi

సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు రెండో స్థానం

మొదటి సంవత్సరంలో ఆరో స్థానం

రెండింటినూ రాయలసీమలో మొదటి స్థానం

బాలికలే ముందంజ

తిరుపతి ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లాలోని 133 పరీక్ష కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్‌లో  పరీక్షలను పారదర్శకంగా, పకడ్భందీగా ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్వహించారు. అనంతరం 24 రోజుల్లోనే మూల్యాంకనం(స్పాట్‌ వాల్యుయేషన్‌) పూర్తి చేశారు. ఒకేరోజు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు. 

రాష్ట్రంలో జిల్లాకు ద్వితీయస్థానం..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించింది. 2017–18ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానం దక్కించుకోగా, ఈ ఏడాది కొంత మెరుగుపరుచుకుని రాష్ట్రంలో రెండోస్థానం, రాయలసీమ జిల్లాలో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలకు సంబంధించిన ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో రెండవ స్థానం,   ఎయిడెడ్‌ కళాశాలలకు సంబంధించి 75 శాతం ఉత్తీర్ణతతో జిల్లాకు మొదటి స్థానం లభించింది.

ఫస్టియర్‌లో ఆరోస్థానం..
ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో 58 శాతం ఉత్తీర్ణత సాధించి చిత్తూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది 64 శాతం ఉత్తీర్ణత సాధించి 5వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 6 శాతం ఉత్తీర్ణత కోల్పోయి ఒకస్థానం దిగజారింది.

ఇంటర్లో బాలికలే హవా..
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను జనరల్, ఒకేషనల్‌లో కలిపి మొత్తం 1,07,717 మంది విద్యార్థులు రాశారు. ఈ ఫలితాల్లో ఎప్పటిలానే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించి  హవా కొనసాగించారు. సీనియర్‌ ఇంటర్లో బాలురు 71 శాతం, బాలికలు 80 శాతం, జూనియర్‌ ఇంటర్లో బాలురు 53 శాతం, బాలికలు 64శాతం ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు.

ప్రభుత్వ కళాశాలల హవా..
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో మన జిల్లా 70 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఎయిడెడ్‌లో 75 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి సంవత్సర ఫలితాల్లోనూ మెరుగైన ఫలితాలను సాధించింది. ద్వితీయ సంవత్సరంలో మహల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 97.92 శాతంతో మొదటి స్థానం, తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 95.59 శాతంతో ద్వితీయ, చవటగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 95 శాతంతో తృతీయ స్థానం సాధించింది. అలాగే ప్రథమ సంవత్సర ఫలితాల్లో తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 98.28 శాతంతో మొదటి స్థానం, మహల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 95.83 శాతంతో ద్వితీయ, చవటగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 86.76 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానం దక్కించుకుంది.

మే 14నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
మే 14వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఏప్రిల్‌ 24వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మార్కుల రీకౌంటింగ్‌కు ఏప్రిల్‌ 22వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు..
గత ఏడాది సీనియర్‌ ఇంటర్‌ ఫలితాలను మార్కులతోనూ, జూనియర్‌ ఇంటర్‌ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలోనూ ప్రకటిం చారు. కానీ ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటినీ గ్రేడింగ్‌ విధానంలోనే పేర్కొన్నారు. ఇందులో అత్యధిక శాతం మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ మార్కులు సాధించి సత్తాచాటారు.

సమష్టి కృషితోనే ద్వితీయ స్థానం
విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితోనే ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు ద్వితీయ స్థానం వచ్చినట్లు ఇంటర్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ) ఎం.కృష్ణయ్య తెలిపారు. ఇంటర్‌ క్యాంప్‌ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ పరీక్షలను అవకతవకలు, ఆరోపణలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. గత ఏడాది నాలుగో స్థానం సాధించగా, ఈ ఏడాది రెండో స్థానంలో నిలవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.రవి, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ స్వర్ణలత, ఇంటర్‌ కార్యాలయ ఏఓ అభయ్, సూపరింటెండెంట్‌ సురేఖ, సిబ్బంది రాజారెడ్డి, అరుణ్, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top