చేబ్రోలు సంఘటనపై పూర్తి స్థాయి విచారణ

Inquiry On Chebrolu Accident Case East Godavari - Sakshi

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల   సంఖ్య పది శాతం తగ్గింది

రాష్ట్ర జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ప్రసాదరావు

తూర్పుగోదావరి, గొల్లప్రోలు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే పదిశాతం తగ్గాయని రాష్ట్ర జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎస్‌ఏవీ ప్రసాదరావు తెలిపారు. మండలంలోని చేబ్రోలు 216జాతీయరహదారి బైపాస్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎస్‌ వెంకటేశ్వరరావుతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు.  ప్రమాదం జరిగిన తీరుపై స్థానిక రవాణాశాఖాధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు, రాకపోకలు, రోడ్డు  డైవర్షన్‌ వివరాలు తెలుసుకున్నారు. రోడ్డుపై లారీ, టాటా మేజిక్‌ వాహనాలు ఢీకొన్న తీరును పరిశీలించారు. వాహనాలు ఫిట్‌నెస్, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికసంఖ్యలో టాటామేజిక్‌ వాహనంలో ప్రయాణికులు ప్రయాణించడం వల్ల అధికంగా మృత్యువాత పడ్డారన్నారు. వాస్తవానికి వాహనంలో ఎనిమిది మంది ప్రయాణించాల్సి ఉండగా, 16మంది ప్రయాణించారన్నారు. రోడ్డు డైవర్షన్, రాంగ్‌ రూట్‌లో వాహనాలు ప్రయాణించడం వల్ల భారీ ప్రమాదం జరిగిందన్నారు. ఇరు వాహనాలు రికార్డులు అన్ని సక్రమంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. రోడ్డు అండర్‌ కనస్ట్రక్షన్స్‌లో ఉండడం వల్ల రాకపోకలకు సరైన మార్గం చూపకపోవడం ప్రమాదం జరగడానికి ఒక కారణమన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 216జాతీయరహదారిని రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ చేస్తామన్నారు.

రాష్ట్రంలో పదిశాతం తగ్గిన ప్రమాదాలు
రాష్ట్రవ్యాప్యంగా గతేడాదితే పోలిస్తే ప్రమాదాల సంఖ్య పదిశాతం తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 2017లో 6236 మంది చనిపోతే ఈ ఏడాది 5638 మంది మాత్రమే చనిపోయారన్నారు. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య బాగా తగ్గిందన్నారు. ఆటో ప్రమాదాలు 20శాతం తగ్గాయని తెలిపారు. జిల్లాలో 5శాతం మాత్రమే ప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రమాదాల్లో జిల్లా టాప్‌–3లో ఉందన్నారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 20వేల కిలోమీటర్లు రోడ్డును ఆడిట్‌ చేయాల్సి ఉండగా సిబ్బంది కొరత వల్ల కేవలం 1500 కిలోమీటర్లు మాత్రమే  ఆడిట్‌ చేశామన్నారు. ప్రైవేటు ఏజన్సీతో రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 16వ నెంబర్‌ జాతీయరహదారిని ఆడిట్‌ చేసి ప్రమాదాల నివారణకు గల కారణాలు అధ్యయనం చేశామన్నారు. ఆయన వెంట ఆర్‌టీఓ సిరిఆనంద్, కాకినాడ, కత్తిపూడి అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు నరసింహరావు, రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కళాజ్యోతి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top