స్వాతంత్ర్య సంగ్రామంలో కందనవోలు

Independent Movement And Leaders In Kurnool - Sakshi

స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా నాయకులది కీలక పాత్ర 

సిపాయిల తిరుగుబాటుకు ముందే జిల్లాలో రగిలిన ఉద్యమ జ్వాల

స్వాతంత్య్ర సమరస్ఫూర్తి  నింపిన జిల్లా సమరయోధులు  

రాయలసీమ ముఖ ద్వారంగా పేరొందిన కందనవోలు.. తొలి స్వాతంత్య్రోద్యమ ఖిల్లాగా చరిత్రకెక్కింది. స్వాతంత్య్రోద్యమానికి నాందిగా భావిస్తున్న సిపాయిల తిరుగుబాటుకు ముందే కర్నూలు జిల్లాలో తెల్లదొరలపై ఉద్యమానికి బీజం పడింది. 1801లోనే తిరుగుబాటు ప్రారంభమైంది. తెల్లదొరల దాస్య శృంఖలాల నుంచి మాతృభూమిని విడిపించేందుకు సమర యోధులు అవిశ్రాంత పోరాటం చేశారు. జైలు శిక్షలకు వెరవక ఉద్యమమే ఊపిరిగా సాగారు. వందేమాతరం అంటూ ఉప్పెనై కదిలి బ్రిటీష్‌ పాలకులను గజగజ వణికించారు. తుపాకీ తూటాలను సైతం లెక్క చేయక స్వాతంత్య్రమే లక్ష్యంగా కదం తొక్కారు. ఈ పోరాటంలో కందనవోలు ప్రజలు చురుకైన పాత్ర పోషించారు. వారిలో కొద్దిమంది గాథలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. వారి స్వాతంత్య్ర స్ఫూర్తి నలు దిశలా వ్యాపించింది.

తెల్లదొరల పాలిట  ‘సింహ’ స్వప్నం 
తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు రేనాటి సూర్యుడు, విప్లవ వీరుడు ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు ఈయన. అప్పట్లో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్‌ పాలన కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వచ్చింది. బ్రిటీష్‌ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి 1842వ సంవత్సరంలోనే వారిపై తిరుగు బాటు బావుటా ఎగురవేశాడు. తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికి చంపడమే కాక బ్రిటీష్‌ వారి ఖజానాను అంతా కొల్లగొట్టారు. ఈయన విప్లవ మార్గానికి వణికిపోయిన బ్రిటీష్‌వారు ఆయనను పట్టించిన వారికి 10 వేల దినారాలు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. 1847లో  సంజామల మండలం జగన్నాథ గుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేశారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీన కోవెలకుంట్ల సమీపంలో గల జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు పరిచారు.  

పోరుగల్లు.. తెర్నేకల్‌  
జిల్లాలో 1801లోనే బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు తెర్నేకల్‌ వాసులు. ఈ గ్రా మం ప్రథమ స్వాతంత్య్ర పోరుగల్లుగా నిలిచింది. ఈ పోరాటాన్ని నేటికీ జానపదులు గానం చేస్తూ స్మరించుకుంటారు. 1801లో కరువు కాటకాలకు గురైన తెర్నేకల్‌ రైతుల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బ్రిటీష్‌ దొర థాకరే రైతులపై పన్ను  విధించారు. గ్రామ నాయకుడు ముత్తుకూరు గౌడప్ప మరికొందరి రైతులను కూడగట్టుకుని పన్ను  కట్టేది లేదని వారిని ఎదురించాడు. థాకరే భారీ సైన్యం మందుగుండు సామగ్రితో తెర్నేకల్‌పై దాడి చేశాడు. గౌడప్పకు తోడుగా అదే గ్రామానికి చెందిన అప్పటి నాయకురాలు రెడ్డెక్కమ్మ కూడా బ్రిటీష్‌ సైన్యంతో పోరాటం  సాగించింది. గౌడప్పతో పాటు ఆ గ్రామ రైతులు బలయ్యారు. భర్తలను కోల్పోయిన కొంతమంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిటీష్‌ సైన్యం మృతదేహాలను గ్రామంలో ఉన్న కుక్కల బావిలో కుప్పలుగా పోశారు. 

తెల్ల దొరలను తుదముట్టించిన గులాం రసూల్‌ ఖాన్‌.. 
కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ బ్రిటీష్‌ దొరల పెత్తనంపై పెనుతుపానై ఎగిశాడు. అప్పటి నవాబులందరూ తెల్లదొరలకు జీ హుజూర్‌ అంటూ గులాములైన నేపథ్యంలో గులాం రసూల్‌ ఖాన్‌ ఉద్యమానికి లాల్‌ సలామ్‌ చేశాడు. తన అనుచరులందరినీ వెంటబెట్టుకొని వెళ్లి కర్నూలు సమీపంలోని జొహరాపురం కేంద్రంగా ఉద్యమం ప్రారంభించారు. 1839లో వహబీ ఉద్యమ నేతలతో సంబంధాలు పెట్టుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికీ కర్నూలు కిడ్స్‌ వరల్డ్‌లో కనిపిస్తున్న ఫిరంగి గులాం రసూల్‌ ఖాన్‌ కాలం నాటిదే. హంద్రీ నదీ తీరంలో గులాం రసూల్‌ ఖాన్‌ మర ఫిరంగులను పేలుస్తూ వేలాది బ్రిటీష్‌ దొరలను హతమార్చారు. బ్రిటీష్‌ సైన్యం గులాం రసూల్‌ ఖాన్‌ను బంధించి తిరుచునాపల్లి జైలుకు తరలించింది. ఆయనపై విష ప్రయోగం చేసి నిర్దాక్షిణ్యంగా హతమార్చింది.

ఆంధ్రా తిలక్‌.. గాడిచర్ల..  
ఆంధ్రా తిలక్‌గా పేరొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు ప్రాంతానికి చెందిన వారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య ప్రతికను స్థాపించి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తిలేస్వరంలో బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల ఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపి తలకు మురికి టోపీ పెట్టి కాళ్లకు చేతులకు గొలుసులు వేసి మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడుతూ కొడుతూ హింసించినా ఆయన ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని తిరస్కరించిన బియాబానీ.. 
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భయమే ఎరుగని వీరునిగా సయ్యద్‌షా మొహియుద్దీన్‌ ఖాద్రి బియాబానీ నిలిచారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న కంభంలో ఈయన జన్మించారు. అలీఘర్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ఆయనకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇవ్వజూపింది. అయితే వారి వద్ద బానిసగా పనిచేసేందుకు తనకు ఇష్టం లేదంటూ ఆ ఉద్యోగాన్ని తోసిపుచ్చారు. కర్నూలులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సదస్సులో పొల్గొని చురుకైన పాత్ర పోషించి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1923లో అఖిల భారత జాతీయ పతాక సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను భుజాన వేసుకొని ఆయన పల్లెపల్లె తిరిగారు. ఆ సయమంలో బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను రహస్యంగా కలుసుకున్నందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను జైలులో ఉంచింది. బ్రిటీష్‌ వారికి భయపడకుండా ఆయన 14 భాషలు నేర్చుకొని ఆయా రాష్ట్రాల్లో ప్రసంగించి అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను బంధించి గయలోని జైలులో ఉంచి హింసించింది. అయినా ఆయన వెన్ను చూపలేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పొలొంటూనే కర్నూలు నగరంలో పలు విద్యా సంస్థల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. తన 500 ఎకరాల భూమిని పేదలకు విరాళమిచ్చారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాల భూమిని సైతం ఉచితంగా పేదలకు పంచి పెట్టారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, తొలి రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు ఆయన ప్రియశిష్యుడు. 

రహస్య దళాల నాయకుడు నివర్తి  
పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య.. నంద్యాలకు వలస వచ్చారు. తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్య్రోద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న నివర్తిని, 140 మంది సహచరులను అక్టోబర్‌ 14, 1940లో ప్రభుత్వం అరెస్ట్‌ చేసి 8 నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో కాంగ్రెస్‌ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్దేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యులర్‌ను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషే«ధించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్య్రం వచ్చాక 1968 నుంచి 78 వరకు ఈయన శాసనమండలి అధ్యక్షునిగా పనిచేశారు.  

ఆదర్శ వనిత పద్మావతమ్మ 
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాకుండా పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శంగా నిలిచారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు బ్రిటీష్‌ ప్రభుత్వంలో పోలీస్‌గా పనిచేసిన శ్యాముల్‌ బెనెటిక్ట్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. నంద్యాలకు ప్రాంతానికిచెందిన దేశాయి కప్పురావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, ఎర్రబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్‌లు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.  

మహాత్ముడి నడయాడిన నేల.. 
స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత గాంధీజి ప్రసంగం ఆదోని ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. 1926లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించింది. ఇందుకు నిరసనగా గాంధీజీ పాదయాత్ర చేపట్టి దేశ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు యత్నించారు. ఇందులో భాగంగానే ఆయన 1930 సెప్టెంబర్‌ 30న కర్ణాటకలోని సండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం రైలులో ఆదోనికి చేరుకున్నారు. స్థానిక మున్సిపల్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభలో జాతిపిత ఉద్వేగంగా హిందీలో ప్రసంగించారు. ఆదోని పట్టణానికి చెందిన చున్నీలాల్‌ జయచంద్‌ సోనో ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించారు. గాంధీజీ ఉద్వేగ పూరితంగా చేసిన ప్రసంగం స్థానికంగా ప్రజల్లో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని నింపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top