స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ


సాక్షి, గుంటూరు: జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి పెద్ద పీట వేసి నిధులు కేటాయిస్తున్నట్లు ఆ శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిధులు మంజూరులో మన జిల్లాకు ప్రాధాన్యతనిచ్చి  రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన హామీనిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పంట రుణాల కింద రూ. 3,115 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరులోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 67వ స్వాతంత్య్ర దిన వేడుకలకు మంత్రి కన్నా ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

 

 అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్య్ర సంగ్రామంలో గుంటూ రు జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. అనంతరం జిల్లాలో సాధించిన అభివృద్ధిని మంత్రి వివరించారు. ఇప్పటికే పంట రుణాలుగా రూ. 1,575 కోట్లు పంపిణీ చేశామన్నారు. కౌలురైతులకు రూ. 1.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్‌ను త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఆధునికీకరణకు రూ. 835 కోట్లతో పనులు చేపట్టగా, డ్రైనేజీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. కొండవీటి వాగు సర్వే పనులను ముమ్మరం చేశామన్నారు. 

 

 కూలీలకు ఉపాధి హామీ...: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు 6,20,541 మందికి జాబ్ కార్డులు మం జూరు చేసి ఉపాధి చూపుతున్నామని మంత్రి కన్నా వివరించారు. రాజీవ్ యువశక్తి పథకం కింద 580 మందికి రూ. 45 కోట్లు అందించామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కంకరగుంట ఆర్‌యూబీని వచ్చే నెలాఖరులోగా వినియోగంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం విజయవంతంగా పనిచేస్తుందని మంత్రి కన్నా కితాబు ఇచ్చారు. 

 

 ఆదర్శ పాఠశాలలకు నిధులు...: విద్యాశాఖ ద్వారా ఆర్‌ఎంఎస్‌ఏ పథకం కింద 84 ఉన్నత పాఠశాలలకు అదనపు తరగతుల కోసం రూ.26.30 కోట్లు ఖర్చుచేసినట్టు మంత్రి కన్నా వెల్లడించారు. మరో 13 ఆదర్శ పాఠశాలలకు రూ. 39 కోట్లు మంజూరయ్యాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం, రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర ప్రభుత్వ పథకాల అమలును మంత్రి కన్నా  విశ్లేషించారు. 

 

 సాంస్కృతిక ప్రదర్శనలు...: వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు,సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్, శకటాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకల్లో జిల్లా జడ్జి జె.సత్యనారాయణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఉడా బోర్డు చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, మాజీ మేయర్ కన్నా నాగరాజు, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, అర్బన్, రూరల్ ఎస్పీలు బీవీ రమణకుమార్, జె. సత్యనారాయణ, డీఆర్వో నాగబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top