జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్‌ జగన్‌

Housing plots for journalists if YSRCP comes to power, says YS Jagan - Sakshi

సాక్షి, కర్నూలు : ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, టీడీపీకి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించామని, అలాగే ఆయా జిల్లాల వారిగా...జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.

సుమారు గంటపాటు చిట్‌చాట్‌ చేసిన వైఎస్‌ జగన్‌...‘ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. హోదాతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది. హోదా వస్తుందని చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేశాడు. హామీలిచ‍్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. హోదా వస్తే పరిశ్రమలతో పాటు రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా సాధిస్తే..రాష్ట్రం పదేళ్లలోనే అభివృద్ధి సాధించవచ్చు. లేకుంటే 60ఏళ్లు అయినా హైదరాబాద్‌లా అభివృద్ధి చెందటం అసాధ్యం. ఇక హైదరాబాద్‌లో ఏపీవారికి ఆరోగ్యశ్రీ తీసేస్తూ ఏపీ సర్కార్‌ జీవో జారీ చేయడం అమానవీయం. ఇక కర్నూలులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది. హామీలు ఇవ్వడమే కాదు...వాటిని అమలు కూడా చేయాలి.

రాజకీయ నాయకులకు నిజాయితీ ఉండాలి. ప్రజలను మోసం చేసే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తాం. ప్రజాసంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుంది. ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు చెప్తున్నారు. ఎవరు ఏ సమస్య చెప్పినా.. వినడానికి నేను సిద్ధం. ప్రజల సమస్యలు అన్నింటిని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు మరింత చేరువగా తెలుసుకునే అవకాశం కలిగింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. అంటే వారి సమస్యలను తీరుస్తానని...వారికి నాపై నమ్మకం ఉన్నట్లే కదా.’ అని అన్నారు.

కాగా  పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండల కేంద్రానికి ఇవాళ మధ్యాహ్నం చేరుకుంది. ఉదయం నియోజకవర్గంలోని గొర్లగుట్ట గ్రామం నుంచి ప్రారంభమైన జననేత ప్రజా సంకల్ప యాత్ర షేక్‌షావలి దర్గా మీదుగా బేతంచెర్లకు చేరుకుంది. భోజన విరామం అనంతరం పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌స్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌ను... దివ్యాంగులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమకు పింఛన్లు రావడం లేదని జననేత వద్ద దివ్యాంగులు వాపోయారు. ‘మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలని వారు.. వైఎస్‌ జగన్‌ను కోరారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top