వివాదాల కేంద్రాస్పత్రి!

Hospital Staff Negligence in Vizianagaram - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో రోగి మృతి

వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ

రోగి బంధువులు దాడిచేశారని వైద్యసిబ్బంది నిరసన

వరుస వివాదాలతో ఆస్పత్రిలో గందరగోళం

మొన్నటికి మొన్న ఓ గర్భిణికి చికిత్స అందించడంలో జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు చూపించిన నిర్లక్ష్యం కారణంగా ఆమెకు గర్భస్రావం జరిగిందన్న అంశంపై చోటు చేసుకున్న వివాదం ఇంకా మరచిపోక మునుపే మరో సంఘటన తాజాగా జరిగింది. ఓ రోగి చికిత్స పొందుతూ మరణించడానికి కూడా వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తుండగా... రోగి బంధువులు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద వరుస జగడాలతో ఆస్పత్రి ప్రతిష్ట దిగజారుతోంది.

విజయనగరం ఫోర్ట్‌: కేంద్రాస్పత్రిలో మరో వివాదం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందిందని బంధువులు వాగ్వాదానికి దిగగా, రోగి బంధువులే తమపై దాడిచేశారని వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుర్ల మండలం మన్యపురిపేటకు చెందిన కళ్లూరి అమ్మాజమ్మ (60) అనే మహిళ కడుపునొప్పి వస్తోందని 4వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఉదయం ఆమెను తనిఖీ చేసిన వైద్యులు స్కానింగ్, వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు బాగానే ఉన్నాయంటూ వైద్యులు రోగికి తెలిపారు. అయితే కడుపులో ఉన్న ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు అమ్మాజమ్మకు రైల్‌ చ్యూబ్‌ వేశారు.

ఆ ట్యూబ్‌ ఊడిపోవడంతో బంధువులు వెళ్లి స్టాప్‌నర్సుకు చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు వేశాననీ, తరచూ వేయడానికి తాను ఖాళీగా లేననీ, ఒక్కదాన్నే ఉన్నాననీ ట్యూబ్‌ సరిగా ఉంచుకోవడం తెలియదా అంటూ సమాధానం చెప్పింది. ‘మాకు తెలియకే కదా మీదగ్గరకు వచ్చింది’ అంటూ బంధువులు స్టాప్‌ నర్సుకు బదులిచ్చారు. ఇలా ఇరువురి మధ్యా వాదనలు నడుస్తున్న సమయంలో అమ్మాజమ్మ శ్వాస ఆడక ఇబ్బంది పడుతోందని బంధువు ఒకరు చెప్పడంతో నర్సు వైద్యులకు సమాచారం అందించారు.  వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయిందని ధ్రువీకరించారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ట్యూబ్‌ వేయమని వేడుకున్నా స్టాఫ్‌ నర్సు వేయలేదనీ, ఆమె నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందిందని బంధువులు స్టాప్‌నర్సు, వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై వాదనకు దిగారు. ఇరువర్గాల వాదనలు, అరుపులతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువురి మధ్య ఒక దశలో తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ లోగా ఆస్పత్రి సిబ్బంది వన్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఫకృద్దీన్‌ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. రోగి బంధువుల నుంచి, వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనం ద్వారా రోగి స్వగ్రామానికి తరలించారు.

స్టాప్‌నర్సు నిర్లక్ష్యంగా మాట్లాడింది
ట్యూబ్‌ ఊడిపోయింది, వేయమని వేడుకున్నా స్టాప్‌నర్సు పట్టించుకోలేదు. ఎన్ని సార్లు వేయాలి. మాకు అదే పనా , ట్యూబ్‌ సరిగా ఉంచుకోవడం తెలియదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా అమ్మ చనిపోయింది. మేము ఎవరిపైనా దాడి చేయలేదు. కె.సత్యనారాయణ, మృతురాలి కొడుకు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top