వారి సంగతేంటో తేల్చండి..

High Court Gave Orders To Rajamahedravaram Central Jail In East Godavari - Sakshi

జైలులో హెచ్‌ఐవీ రోగులపై హై కోర్టు ఆరా

ఓ ఖైదీ వినతిపై స్పందించిన హై కోర్టు

తదుపరి విచారణ ఆగస్టు 2 కు వాయిదా

సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 27 మందికి ఎయిడ్స్‌ ఉందో! లేదో! జైలు అధికారులు నిర్ధారించాలని బుధవారం హై కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్‌ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడైన ఏడు కొండలు అనే ఖైదీ తనకు బెయిల్‌ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హై కోర్టుకు విన్నవించడంతో కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఎంత మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారు? వారికి ఆరోగ్యపరంగా ఇస్తున్న వైద్యం, పౌష్టికాహారం తదితర వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జైలు అధికారులు ఖైదీలకు ఇస్తున్న ఆహారం మందుల వివరాల నివేదికను అందజేశారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు గుడ్డు, 250 మిల్లీ గ్రాముల పాలు, వారంలో వంద గ్రాముల మాంసం, ప్రోటీన్స్, ఇతర ఏఆర్‌టీ మందులు ఇస్తామని హై కోర్టుకు తెలిపారు.

అలాగే ఇతర జైళ్ల నుంచి కూడా హెచ్‌ఐవీ రోగులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పంపుతున్నారన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండడంతో గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని హెచ్‌ఐవీ రోగులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ నాలుగు జిల్లాలు హైవే కు ఆనుకొని ఉండడంతో లారీ డ్రైవర్లు, కూలీలు, రోడ్డు ప్రమాదం చేసి, హత్యలు చేసి హెచ్‌ఐవీ రోగులుగా జైలుకు వస్తున్నారని జైలు అధికారులు హై కోర్టుకు వివరించారు. గత ఐదేళ్లలో హెచ్‌ఐవీ రోగులు 19 మంది బయట నుంచి వచ్చారని, అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్‌ఐవీ టెస్ట్‌లలో బయటపడ్డాయని కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఆగస్టు రెండో తేదీకి వాయిదా వేసింది. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top