కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Heavy Rains in PSR Nellore - Sakshi

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

సగటు వర్షపాతం 32.4 మి.మీ.

నగరంలో కుండపోత వాన

8 సెం.మీ. వర్షపాతం నమోదు  

రామలింగపురం అండర్‌ బ్రిడ్జిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌

జలమయమైన లోతుట్టు ప్రాంతాలు

నెల్లూరు(పొగతోట): బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా వీస్తున్న ఈదురుగాలుల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.  జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయానికి సగటున 32.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఉదయం నుంచి ఎడతేరిపి లేకుండా భారీవర్షాలు కురిశాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములు ఉరిమాయి. ఆకాశానికి చిల్లు పడినట్లు భారీ వర్షం కురిసింది. నగరంలో 8 సెం.మీ. (82.4 మి.మీ.) వర్షపాతం నమోదైంది. పొదలకూరు మండలంలో 13 సెం.మీ. (136.0 మి.మీ.) వర్షపాతం నమోదైంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, విజయమహాల్‌గేట్‌ సెంటర్, రామలింగాపురం అండర్‌ బ్రిడ్జిలు వర్షపు నీటితో నిండిపోయాయి. రామలింగాపురం అండర్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు అధికంగా చేరడంతో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ప్రయాణికులు కూడా బస్సులో ఉండడంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు.

అండర్‌ బ్రిడ్జిల వద్ద వర్షపు నీటికి వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌జామ్‌ కావడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వీఆర్‌సి సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ల నుంచి ఆత్మకూరు బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మాగుంట లే అవుట్‌ నుంచి మినీబైపాస్‌కు చేరుకుని అక్కడ నుంచి ఆత్మకూరు బస్టాండ్, బాలాజీనగర్, స్టోన్‌హౌస్‌పేట తదితర ప్రాంతాలకు చేరుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి నగరంలోకి రావాల్సిన వాహనాలు మాగుంట లే అవుట్‌ కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు నుంచి నగరంలోకి చేరుకున్నాయి. అండర్‌ బ్రిడ్జిల వద్ద నీరు అధికంగా చేరడంతో అనేక ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని రోడ్లు కాలువలను తలపించాయి. రోడ్లపై రెండు అడుగుల మేర నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోన్ని జలమయామయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు, వాహనచోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహనాలు వర్షానికి తడిసి స్టార్ట్‌ కాకా నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఉన్న వేపచెట్టు కొమ్మ విరిగిపడింది. వర్షానికి ఏసీ కూరగాయల మార్కెట్‌ రొచ్చురొచ్చుగా మారింది. వర్షాల వలన రైతులకు ప్రయోజనం. ఎండిపోయే దశలో ఉన్న వరినారుమళ్లుకు ప్రాణం పోసినట్లు ఉంది. గంటల తరబడి వర్షం కురవడంతో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. వాగులు, చిన్న చిన్న కాలువల్లో నీరు ప్రవహించింది. చెరువుల్లోకి వర్షపు నీరు చెరుతుంది. వర్షాలకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు ముమ్మరం చేశారు.

జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు
పొదలకూరు మండలంలో అత్యధికంగా 136.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేజర్ల 95.4 మి.మీ., విడవలూరు 88.6, నెల్లూరు 82.4, కొడవలూరు 72.4, అనంతసాగరం 71.6, చిల్లకూరు 60.6, గూడూరు 58.8, టీపీగూడూరు 57.4, చిట్టమూరు 53.8, మర్రిపాడు 51.8, ముత్తుకూరు 46.2, కోవూరు 45.8, బోగోలు 44.8, జలదంకి 42.6, నాయుడుపేట 40.2, వెంకటగిరి 37.8, అల్లూరు 36.0, ఇందుకూరుపేట 32.4, దగదర్తి 30.6, కలువాయి 26.8, వాకాడు 26.8, బుచ్చిరెడ్డిపాళెం 26.4, బాలాయపల్లి 25.2, వెంకటాచలం 20.4, కలిగిరి 19.2, ఓజిలి 17.2, ఉదయగిరి 16.8, మనుబోలు 16.4, కావలి 14.4, ఆత్మకూరు 14.4, సైదాపురం 11.4, వింజమూరు 10.4, కోట 8.8, రాపూరు 8.2, ఎస్‌ఆర్‌పురం 7.4, దుత్తలూరు 5.8, వరికుంటపాడు 5.6, పెళ్లకూరు 2.6, సూళ్లూరుపేట 2.2, డీవీసత్రం 2.0, సంఘం 1.2, తడ మండలంలో 0.6 మి.మీ.  వర్షపాతం నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top