తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం


తిరుమల : తిరుమలలో శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం ఆగకుండా ఆదివారం ఉదయం వరకూ కురుస్తూనే ఉంది. ఆలయం ముందు భాగంతోపాటు, పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు రెండో ఘాట్‌రోడ్డులో కొండచరియలు కూలుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యలకు విఘాతం కలిగింది.



అలాగే భారీ వర్షానికి తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆటోనగర్, నవోదయకాలనీ, పూలవానికుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, యశోదనగర్, ఎస్వీనగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. శనివారం కాస్త తెరిపించింది అని ఊపిరిపీల్చుకునేలోపే... సాయంత్రం నుంచి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఆదివారం ఉదయం కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇంట్లోని వస్తువులన్నీ నీటిలో మనిగిపోయిన పరిస్థితి చూసి ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ స్కూళ్లు, ఫంక్షన్ హాల్స్, కల్యాణ మండపాలు తదితర చోట్ల పునరావాసానికి కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. వెయ్యి మంది వరకూ తరలించారు. అయితే ఇంకా ఐదు వేల మంది ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇళ్లు వదిలి వచ్చేందుకు వారు సంసిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top