ఉత్తరాంధ్రను ముంచెత్తిన భారీ వర్షాలు

Heavy Rains In Andhra Pradesh District - Sakshi

ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు

నేల కూలిన ఇళ్లు, నీట మునిగిన పంటలు

విశాఖ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి వృద్ధుడి మృతి

రహదారులు దెబ్బతినడంతో రవాణాకు అంతరాయం

కాలనీలు, ఇళ్లలోకి నీరుచేరడంతో ఇబ్బందిపడ్డ ప్రజలు

జనజీవనం అస్తవ్యస్తం

గుంటూరు జిల్లాలో పోటెత్తిన కృష్ణానది

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం కూడా వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలగా.. పంటలు నేలవాలాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 133.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 2,450 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 10 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. ఇక పట్టణంలో అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వర్షం నీరు చేరింది.

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో లైదాం–సిరిపురం మధ్య రోడ్డుమీద నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న రెల్లుగడ్డ

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌కు వరదపోటెత్తింది. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం వట్టిగెడ్డ వరద పోటుకు మోసూరు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన తాగునీటి పథకాలకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభం నెల్లిమర్ల వద్ద కూలిపోయింది. దీంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గర్భాం గరివిడి ప్రధాన రహధారిలో చినబంటుపల్లి జంక్షన్‌ సమీపంలో రహదారికి అడ్డంగా చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాటిపూడి రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. రాత్రికి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశముంది.

కేకే రైల్వే లైన్‌లో జారిపడిన కొండచరియలు
విశాఖ జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురిశాయి. కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో పెంకుటిల్లు పైకప్పు రాత్రివేళ పెంకులు కూలి చిట్టిపాడు ఆదియ్య (67) అనే వ్యక్తి నిద్రలోనే మృతిచెందాడు. కొత్తవలస–కిరండూల్‌ రైల్వేలైన్‌లో కొండచరియలు జారిపడ్డాయి. బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు రైల్వే విద్యుత్‌ లైన్‌పై పడటంతో మంటలు రేగాయి. అధికారులు యుద్ధప్రాతిపదిక పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పాడేరు–పెదబయలు మండలాల సరిహద్దులోని పరదానిపుట్టు వద్ద మత్స్యగెడ్డ పొంగడంతో కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో 30 గిరిజన గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చోడవరం మండలంలో లక్ష్మీపురం చెరువుకు భారీ గండిపడింది. శారదా నది ఉదృతికి గవరవరం వద్ద అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. కాగా, విశాఖ జిల్లాలో 4,899 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.

అనంతగిరి మండలం గుమ్మకోట–భీమవారం రోడ్డులో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు వరద ఉధృతికి చిక్కుకుంది. స్థానికులు, ప్రయాణికుల సాయంతో బస్సును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  ఇక శ్రీకాకుళం జిల్లాలోనూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊరు ఏరు ఒక్కటైంది. నాగావళి, వంశధారలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. జిల్లాలోని 14 మండలాల్లో 5,089 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మడ్డువలస ప్రాజెక్టులో ఏడు గేట్లు ఎత్తివేసి నీరు వదులుతున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్, వాల్తేరు మండల సరిహద్దు మార్గంలో భారీ వర్షాల కారణంగా రైలు మార్గం నీట మునగడంతో పలు పాసింజర్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దుచేశారు.

విశాఖ జిల్లాలోని కేకే లైన్‌లో జారిపడ్డ కొండ చరియలు

జలదిగ్బంధంలో మత్స్యకారుల కాలనీ
ఇక కృష్ణానదిలో వరద ఉధృతి కారణంగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో నది ఒడ్డున ఉన్న మత్స్యకారుల కాలనీ గురువారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ట్రాక్టర్లతో సహకరించి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. బాధితులకు ఆహారం అందించారు. రెండు నెలల వ్యవధిలో నాలుగుసార్లు ఇలా మత్స్యకారులు భారీగా నష్టపోయారు. అదే విధంగా పొందుగల గ్రామం వద్ద కూడా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటపొలాలపై నుంచి వరద నీరు ఐదు అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. పత్తి, మిరప పంటలకు అపార నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కశింకోట మండలం ఏనుగుతునిలో పైకప్పు కూలి మృతి చెందిన ఆదియ్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top