సీమ అస్తవ్యస్తం

heavy rain in rayalaseema - Sakshi

నాలుగు జిల్లాల్లో కుండపోత

పొంగిపొర్లిన చెరువులు, వాగులు, నదులు

నీట మునిగిన పంటలు: భారీ నష్టం

కల్లూరు–పామిడి మధ్య నీట మునిగిన రైల్వే ట్రాక్‌..పలు రైళ్ల దారి మళ్లింపు

గుంటూరులో మూడు వంతెనల కూడలి జలమయం  

సాక్షి నెట్‌వర్క్‌: గడిచిన 24 గంటల్లో కురిసిన కుండపోత వర్షాలతో చెరువులు, వాగులు, నదులు పొంగిపొర్లాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయి జన జీవనం స్తంభించింది. వేలాది హెక్టార్లలో వేరుశనగ, పత్తి, వరి, పసుపు, జొన్న పంటలు ముంపునకు గురికావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో  20.8 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. గుత్తిలో ఏకంగా 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. గుంతకల్లు, గుత్తి, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఏళ్ల తరబడి ఒట్టిపోయిన పెన్నా పామిడి వద్ద పరవళ్లు తొక్కుతోంది.

హంద్రీ వరద నీటిలో చిక్కుకున్న బస్సు
కర్నూలు జిల్లాలో 21.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పత్తికొండలో ఏకంగా 130.2 మి.మీ. వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చిన్నహుల్తి దగ్గర బ్రిడ్జిపై హంద్రీ వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకోగా అందులోని 30 మంది ప్రయాణికులను అధికారులు గజ ఈతగాళ్లను పంపి కాపాడారు. అలాగే దేవనకొండ మండలం అలారుదిన్నె వంకలో చిక్కుకున్న 16 మందిని స్థానికులు కాపాడారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్క రోజే దాదాపు 200 ఇళ్లు దెబ్బతిన్నాయి.

పొంగిన గార్గేయనది  
చిత్తూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న గార్గేయ, బహుదా నదుల పరిధిలో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గాజులపల్లె–తొడతర మధ్యలో ఉన్న రోడ్డు కల్వర్టు కొట్టుకుపోయింది. దుర్గం కొండల నుంచి వచ్చిన వర్షపునీరుతో కణికలమ్మ చెరువు, మీనాక్షమ్మ చెరువులు పొంగి తెగిపోయాయి.

భారీ వర్షాలతో పలు రైళ్లు దారి మళ్లింపు
అనంతపురం జిల్లా కల్లూరు–పామిడి మార్గంలో 244 కి.మీ వద్ద రైల్వే ట్రాక్‌పైకి నీరు రావడంతో ట్రాక్‌ దెబ్బతినింది. దీంతో 18 రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రద్దు చేసినట్లు గుంతకల్లు రైల్వే వర్గాలు తెలిపాయి. కల్లూరు రైల్వే క్యాబిన్‌ సమీపంలో పెన్నాది బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌ కట్ట కోతకు గురైంది. ఈ కారణంగా హిందుపూర్, గుంతకల్లు ప్యాసింజర్, యశ్వంతపూర్‌–విజయవాడ ప్యాసింజర్‌ రైలును రద్దు చేశారు.

గుంటూరులోనూ భారీ వర్షం  
గుంటూరు నగరంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 1.30 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి నగరంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.   నగరంలోని మూడు వంతెనల కూడలి జలమయం కావడంతో పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. ఉదయం విధులకు బయలుదేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్షంతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

బస్సు వెళుతుండగా కూలిన కాజ్‌వే
వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లె మండలం బెస్తపల్లె వద్ద బస్సు వెళుతుండగా ఉన్నఫలంగా కాజ్‌వే కూలిపోయింది. బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చారు. ప్రొద్దుటూరు–ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో వాగు పోటెత్తడంతో సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయచోటి పరిధిలో పింఛా, బహుదా నదులు పోటెత్తడంతో చుట్టుపక్కల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట ప్రాజెక్టుకు కూడా ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. కుందూకు వరద నీరు పోటెత్తడంతో పరీవాహక ప్రాంతమంతా మునకకు గురవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top