జంతువుల్లోనూ గుండెపోటు!

Heart attack also to the Animals  - Sakshi

నడివయసులోనే మూగజీవాల మృత్యువాత

విశాఖ జూ వైద్యుల అధ్యయనంలో వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: గుండెపోటు మనుషులనే కాదు జంతువులనూ కబళిస్తోంది. మూగ జీవాల ఆయుష్షును మధ్యలోనే ముగిస్తోంది. ఇటీవల విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో ‘చీకో’ అనే చింపాంజీ, ‘శివ’ అనే అడవిదున్న ఉన్నట్టుండి మృతి చెందాయి. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకుండానే ఇవి ఆకస్మికంగా మృత్యువాతపడ్డాయి. వీటికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా... గుండెపోటుతో మృతిచెందినట్లు తేలింది. ఆహారం మానకుండా... వయసు మీరకుండా ఉన్నపళంగా జంతువులు మరణిస్తుండడంపై పశువైద్యులు పరిశోధన సాగించారు. కేవలం మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా గుండెపోటుకు బలైపోతున్నాయని గుర్తించారు. పలు జంతు ప్రదర్శన శాలల్లో ఇటీవల కొన్ని జంతువులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు.

మనుషులకు గుండెపోటు వస్తే, వాటి లక్షణాలు, వివిధ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. అయితే జంతువుల్లో గుండెపోటును గుర్తించడం అంత సులభం కాదని వైద్యులు చెబుతున్నారు. గుండెకు రక్త ప్రసరణ జరగకపోవడం, రక్తనాళాల్లో కొవ్వు చేరి పూడుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్‌ అటాక్‌కు కారణమవుతోందని వివరించారు. జంతువులకు చికిత్స అందించడం కూడా కష్టతరమని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, ఆర్నెళ్ల పాటు వాటికి పెట్టే ఆహారంలో మాత్రలను ఉంచి గుండె జబ్బులను నివారించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యం సందర్శకుల తాకిడి, ఒకే చోట బందీలుగా ఉండడం వంటివి వాటిని ఒత్తిడికి గురి చేస్తాయని, అందువల్ల కూడా జంతువులు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇళ్లలో పెంపుడు జంతువులు అకస్మాత్తుగా ఆయాసంగా కనిపించడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటుగా భావించవచ్చని తెలిపారు.

మరింత విస్తృత పరిశోధనలు
జంతువులూ గుండెపోటుతో చనిపోతున్నాయి. దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించాలనుకుంటున్నాం. ఇందుకు ఇతర జంతు ప్రదర్శనశాలల వైద్యులు, పశు సంవర్థకశాఖ అధికారులతో హెల్త్‌ కమిటీ వేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. జంతు సంపదను కాపాడుకోవడమూ ముఖ్యమే.
– డా. వి.శ్రీనివాస్, జూ సీనియర్‌ వెటనేరియన్, ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్, విశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top