రాజధాని నిర్మాణాల్లో వేగం పెంచాలి

Have to Increase speed in capital structure says chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను, చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్ని నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేయకుంటే సమస్యలొస్తాయన్నారు. గురువారం సచివాలయంలో ఆయన సీఆర్‌డీఏ ప్రాజెక్టులు, రాజధానిలో స్థలాలు పొందిన యూనివర్సిటీలు, వైద్య, ఆరోగ్య సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి వారితో మాట్లాడారు. ఆనంద నగరాల సదస్సు నిర్వహణ తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూముల కేటాయింపు తాజా స్థితి, టెండర్ల షెడ్యూళ్లు, ప్రాజెక్టుల పురోగతి, వాటర్‌ ఫ్రంట్‌ ఇంజనీరింగ్, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ సహకారం తదితర అంశాలపై చర్చించారు.

భూముల కేటాయింపులు పొంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించని సంస్థల ఉదాసీనతపై సీఎం మాట్లాడుతూ ఆలస్యం చేస్తే తిరిగి సమీక్ష చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇండో–యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ.. చాలా ఆలస్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, ఎన్జీవోల నివాస గృహాల పథకాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వాటర్‌ ఫ్రంట్‌ ఇంజనీరింగ్‌ పనుల్ని సమీక్షిస్తూ పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నిర్మాణాలు అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు.

రాజధాని అమరావతిని వరద నుంచి కాపాడే రైట్‌ ఫ్లడ్‌ బ్యాంక్‌ రీఅలైన్‌మెంట్‌ పనుల పురోగతిని అధికారులు వివరిస్తున్నప్పుడు సీఎం స్పందిస్తూ.. 12.36 కి.మీ. పొడవైన ఈ నిర్మాణం అత్యంత కీలకమైందన్నారు. అన్న క్యాంటీన్లపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో 148 అన్న క్యాంటీన్లు మంజూరు చేశామని, వీటిలో ఇప్పటిదాకా 100 క్యాంటీన్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో ఐటీ పార్క్‌ టవర్‌ నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ గ్రూప్‌ ప్రజంటేషన్‌ను సీఎం వీక్షించి సూచనలు చేశారు. తాము ఉత్తమశ్రేణి రాజధాని నిర్మిస్తున్నామని, పర్యావరణహితమైన హరిత రాజధానిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారమందించాలని కోరారు. 

సీఎంను కలసిన గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌
గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, ఎండీ రాజన్‌ ఆనందన్‌ సీఎంను కలిశారు. ఈస్టోనియా ప్రభుత్వ అధికారులూ ఈ భేటీలో పాల్గొన్నారు. తమ పాలనలో, భద్రతా చర్యల్లో వినియోగిస్తున్న సాంకేతికతను సీఎం వారికి వివరించారు. నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతకు ఏపీని ప్రయోగశాలగా ఎంచుకోవాలని గూగుల్‌ ఇండియాకు సూచించారు. అత్యవసర సేవలు వేగవంతంగా అందించేందుకు తాము ప్లస్‌ కోడ్‌ అనే విధానాన్ని అభివృద్ధి చేశామని, ఏపీలో ప్రయోగాత్మకంగా అమలు చేయడంపై పరిశీలించాలని ఆనందన్‌ కోరారు. ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై త్వరలో రాష్ట్రప్రభుత్వం, గూగుల్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుందని సీఎం చెప్పారు.

ఇక నేరుగా లబ్ధిదారులకే సీఎం సహాయనిధి చెక్కులు
వైద్య, ఆరోగ్య చికిత్సలకు భరోసాగా సీఎం సహాయనిధి నుంచి మంజూరైన సాయాన్ని చెక్కుల రూపంలో చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెక్కులను ఆన్‌లైన్‌లో కాకుండా ప్రజాప్రతినిధులు సంబంధిత లబ్ధిదార్లకు స్వయంగా వారి ఇళ్లకెళ్లి అందజేయాలన్నారు. చెల్లని చెక్కులనే మాట ఇక వినపడకూడదన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు సాయం అందజేయడానికి బ్యాంకులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లు విడుదల చేసిందన్నారు. కాగా, సీఎం సహాయనిధి చెక్కులను ఇకనుంచీ 24 గంటల్లోగా ఆమోదించి సొమ్ము చెల్లించాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top