ఠంచనుగా పింఛన్‌

Gvmc Preparation Pensions Distribution In Visakhapatnam - Sakshi

తొలి రెండు వారాల్లోనే  పూర్తి చేసిన జీవీఎంసీ

ఇకపై వార్డు వలంటీర్ల చేతుల మీదుగా అందజేత

లబ్ధిదారుల్లో వెల్లివిరిసిన ఆనందం

గతంలో పింఛన్ల పంపిణీ మూడో వారానికి కూడా అయ్యేది కాదు. లబ్ధిదారులు కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. పింఛన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురురు చూడాల్సిన పరిస్థితి ఉండేది.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఠంచనుగా పెన్షన్‌ అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో.. పంపిణీ వ్యవస్థను జిల్లా అధికారులు వేగవంతం చేశారు. దాదాపు శతశాతం పంపిణీని జీవీఎంసీ అధికారులు పూర్తి చేశారు. ఇకపై నేరుగా పింఛనుదారుల ఇంటికే వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: నెల ప్రారంభమయ్యేసరికి పింఛను డబ్బులు ఎప్పుడు వస్తాయి.. వాటిని అందుకొని ఆస్పత్రికి వెళ్లి మందులు కొనుక్కోవాలని ఎదురుచూసే వాళ్లు కోకొల్లలు. కానీ.. టీడీపీ హయాంలో ఆ పింఛను ఓ ప్రహసనంలా మారిపోయింది. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తే తప్ప  చేతికి అందేది కాదు. పైగా రోజుల తరబడి వేచి చూస్తే బయోమెట్రిక్‌ పడలేదంటూ తిరస్కరించిన దాఖ లాలూ ఉ న్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,  డయాలసిస్‌ పేషెంట్లు ఎన్నో ప్రయాసలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి రెండు వారాల్లోనే అందరి చేతిలోకి పింఛను డబ్బులు ఉండాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. తక్కువ వ్యవధిలోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేసేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో వివిధ లబ్ధి దారులకు శతశాతం పంపిణీ చేసేశారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 1,03,595 మంది లబ్ధిదారులుండగా రూ.25,76,83,000 పంపిణీ చేశారు.

ఇక నుంచి ఇంటి వద్దకే...
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన పింఛనుదారులకు భరోసా ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందించాలన్న సీఎం ఆలోచన వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురానుంది. అన్నీ పూర్తయితే వచ్చే నెల పింఛను వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఇకపై వృద్ధులు వ్యయ ప్రయాసలకోర్చి పింఛన్‌ కోసం తిరగాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. వలంటీర్లకు వారి పరిధిలో ఉన్న పింఛనుదారుల వివరాల్ని ఇప్పటికే అధికారులు అందజేశారు. ఆయా ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల్ని వలంటీర్లు పరిచయం చేసుకోనున్నారు. నిధులు మంజూరైన మరుక్షణమే. పింఛన్లు పంపిణీ మొదలు పెట్టనున్నారు.

వలంటీర్ల పరిధి 50 ఇళ్ల వరకు మాత్రమే ఉండటంతో మొదటి వారంలోనే పింఛన్ల పంపిణీ పూర్తికానుంది. అదే విధంగా కదలలేనివారు, మంచానికి పరిమితమైనవారు, వృద్ధులు, డయాలసిస్‌ పేషెంట్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ డబ్బులు పెరగడమే కాకుండా... కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండానే చేతికి పెన్షను అందనుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వృద్ధులకు, వితంతువులకు దశలవారీగా రూ.3 వేలు వరకు పింఛను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే వారి పింఛనుని రూ.2 వేల నుంచి రూ.2,250కి పెంచింది. డయాలసిస్‌ పేషెంట్లకు టీడీపీ హయాంలో రూ.3 వేలు మాత్రమే అందించేది. దాన్ని ఏకంగా మూడున్నర రెట్ల వరకూ పెంచి రూ.10 వేలు అందిస్తోంది. కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు మొదలైన వారికి గతంలో రూ.2 వేలు మాత్రమే అందేది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక వీరికి రూ.3 వేలు పింఛను అందిస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top