విస్తరిస్తున్న కరోనా!

Guntur Officials Sanitizing Corona Positive Areas - Sakshi

గుంటూరు నగరంలో  తాజాగా రెండు కొత్త కేసులు  

జిల్లాలో 32కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

రెడ్‌జోన్‌లోని హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తోంది. సోమవారం తాజాగా రెండు కొత్త కరోనా కేసులు నమోదవడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 32కు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులు గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీ, ఆనందపేట ప్రాంతాల్లో నమోదయ్యాయి. దీంతో నగరంలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 17కు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమై గుంటూరు నగరంలో కంటైన్మెంట్‌ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్, సంగడిగుంట, ఆనందపేట, బుచ్చయ్యతోట, కుమ్మరిబజార్, ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్, శ్రీనివాసరావుతోట ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. సోమవారం గుంటూరు నగరంలోకి వాహనాల రాకపోకలకు నిలిపివేశారు. రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో 28 రోజులపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు.  

ర్యాండమ్‌ పరీక్షలు..
జిల్లాలో రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లివచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్‌లకు దాదాపు కరోనా పరీక్షలు పూర్తి కావస్తున్నాయి. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తూ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే మొబైల్‌ టీమ్‌ల ద్వారా శాంపిళ్లను తీసి ల్యాబ్‌లకు పంపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ర్యాండమ్‌గా పరీక్షలు చేయనున్నారు.  

క్వారంటైన్‌ సెంటర్లపై ప్రత్యేక దృష్టి  
జిల్లాలో ప్రైమరీ, సెంకడరీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వీలైనన్ని క్వారంటైన్‌ సెంటర్లను పెంచే దిశగా అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. కాటూరి మెడికల్‌ కాలేజీలో ఏర్పా టు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో కరోనా అనుమానితులను ఉంచుతున్నారు. అక్కడ  కరోనా పాజిటీవ్‌ అని తేలితే వారిని వైద్య పరీక్షల కోసం ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తున్నారు. మిట్టపల్లి ఇంజినీరింగ్‌ కాలేజీ, కేఎల్‌యూ, భాష్యం, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

క్లస్టర్‌ కంటైన్మెంట్‌ జోన్‌లో కఠిన ఆంక్షలు
గుంటూరు వెస్ట్‌: జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను క్లస్టర్‌ కంటైన్మెంట్‌ జోన్‌లుగా విభజించినట్టు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ చెప్పారు. సోమవారం రాత్రి గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లస్టర్‌ కంటైన్మెంట్‌ జోన్‌లలో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా సిబ్బంది నిరంతరంపర్యవేక్షణ చేయాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top