ఏటి గట్లు చూస్తే వణుకే..

ఏటి గట్లు చూస్తే వణుకే..


► పలుచోట్ల కుంగిన గట్లు

► పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం

► ఇసుకాసురుల పాపమూ శాపమే!

► పెరుగుతున్న గోదారి ప్రవాహం

► మేల్కొనకపోతే ముప్పు తప్పదు




ఏయేటికాయేడు వణుకు తప్పడం లేదు. గోదారమ్మ ఏటిగట్లు బలోపేతానికి నోచుకోవడం లేదు.  ఇసుకాసురుల ధనదాహానికి మరింత చిక్కిశల్యమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో నదీ తీర గ్రామాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. భారీ వరదొస్తే ముప్పు తప్పదని బెంబేలెత్తుతున్నాయి. ‘గట్టు’ మేలు తలపెట్టే నాథుడి కోసం నిరీక్షిస్తున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం లేదు.



సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదారి గట్టును అక్రమార్కులు గుటుక్కుమనిపించారు.  అధికారపార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండతో ఎక్కడికక్కడే తవ్వేసి ర్యాంపులు ఏర్పాటు చేశారు. నదీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు. భారీ వాహనాలు గట్లపై నుంచి రాకపోకలు సాగించడంతో  ఎక్కడికక్కడే కుంగిపోయాయి. ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం వానా కాలం సమీపించడంతో  గోదావరికి వరదల సీజన్‌ వచ్చింది. ఇప్పటికే నదిలో వరదనీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారీ వరదొస్తే పెనువిపత్తు సంభవించే ప్రమాదముందని తీరప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఆ ఘటన పునరావృతమైతే..!

1986లో వచ్చిన వరద  గోదావరి జిల్లా వాసులను కకావికలం చేసింది. అప్పటి బీభత్సం ఇప్పటికీ  కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ పెనువిపత్తుకు జిల్లాలో రూ.1,500 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లింది. అటువంటి వరద మళ్లీ వస్తే.. ఇప్పుడున్న గట్లు కొట్టుకుపోవడం ఖాయమనే వాదన వినబడుతోంది.



ముందస్తు చర్యలేవీ..  ఏటిగట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్‌ సమీపించినా అధికారులు చర్యలకు ఉపక్రమించలేదు. కనీసం గట్ల మరమ్మతులు చేపట్టలేదు. ముందుజాగ్రత్తగా తీసుకోవాల్సిన కనీస చర్యలూ చేపట్టలేదు. జిల్లాలో ఉన్న ఫ్లడ్‌ స్టోర్స్‌ అన్నీ మూలనపడ్డాయి. జిల్లాలో పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు అఖండ గోదావరి 40.20 కిలో మీటర్లు, విజ్జేశ్వరం (ధవళేశ్వరం ఆనకట్ట) నుంచి బియ్యపు తిప్ప వరకు 90.20 కిలో మీటర్లు పొడవునా వశిష్ట గోదావరి తీరం విస్తరించి ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో సుమారు 162 కిలో మీటర్లకుపైగా దూరం గోదావరి  తీరం విస్తరించి ఉంది. వరదొస్తే ఈ ప్రాంతంమంతా ముంపునకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లేవు. కనీసం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సమాచారం చేరవేయడానికీ నీటిపారుదల శాఖలో అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరు.



మొక్కుబడిగా ఫ్లడ్‌ స్టోరేజ్‌లు

జిల్లాలో వరదల సమయంలో నివారణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్లడ్‌స్టోరేజ్‌ కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. ఏ ఒక్క స్టోర్‌లోనూ అవసరమైన సామగ్రిలేదు.సెంట్రల్‌ ఫ్లడ్‌స్టోర్‌లుగా చెప్పే కొవ్వూరు, కాకరపర్రు, సిద్ధాంతం, నరసాపురంలలో ఇసుక నిల్వలూ పూర్తి స్థాయిలో లేవు. పర్మినెంట్‌ ఫ్లడ్‌స్టోర్‌లుగా ఉన్న కొవ్వూరు, అబ్బిరాజుపాలెంలోనూ అదే దుస్థితి. పోలవరం, దొడ్డిపట్ల, కోడేరులోని అడిషనల్‌ ఫ్లడ్‌స్టోర్‌లలోనూ ముందస్తు ఏర్పాట్లు లేవు.  సిద్దాతం సెంట్రల్‌ స్టోరేజ్‌లో అరకొర ఇసుక గుట్టలు, పాడైన కలప మాత్రమే దర్శన మిస్తున్నాయి. ఫలితంగా గోదావరికి ఆకస్మికంగా వరదలు సంభవిస్తే అధికారులు చేతులెత్తేయక తప్పని దుస్థితి నెలకొందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  



స్థూలంగా గట్ల దుస్థితి ఇదీ..

కానూరు అగ్రహారం నుంచి మల్లేశ్వరం వరకు సుమారు 13 కిలోమీటర్ల దూరం ఏటిగట్టు పలు చోట్ల కుంగిపోయింది. ఆచంట మండలం దొంగరావిపాలెం వద్ద కూడా ఇదే దుస్థితి నెలకొంది. పెరవలి మండలం ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, లంకమాలపల్లి తదితర గ్రామాల్లో గట్లను అక్రమార్కులు తవ్వేశారు. దీంతో గట్టు పటిష్టత దెబ్బతింది. యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రోయిన్స్‌ దెబ్బతిన్నాయి. ఏటిగట్టు అండ జారిపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఏటిగట్టు ఆధునికీకరణ పనులు ఆయన మరణానంతరం అటకెక్కాయి.



నిడదవోలు మండలంలో పందలపర్రు, రావివారిగూడెం, పెండ్యాల వద్ద గట్టు బలహీనంగా ఉంది. ఇసుక అక్రమార్కులు ఇక్కడ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. పోలవరం మండలంలో గోదావరి గట్టు రెండు ప్రదేశాల్లో బలహీనంగా ఉంది.  గూటాల గ్రామంలోని వడ్డీలపేట వద్ద , గూటాల ఎత్తిపోతల పథకం వద్ద బలహీనంగా మారింది. గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి  ఏజీఆర్‌బీ శాఖ అధికారులు  ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కావటం లేదు. దీంతో ప్రమాదం పొంచి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top