కొలువుల సచివాలయం

Gramasachivalayam Notification Will Be Issued On July 22 - Sakshi

జిల్లాలో నిరుద్యోగులకు కొత్త ఉత్సాహం

ప్రతి 4 వేల జనాభాకు ఓ వార్డు సచివాలయం

302 సచివాలయాల్లో 3,020 ఉద్యోగాలు

ప్రభుత్వం నుంచి రేపు నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, చిత్తూరు అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగాలంటే జిల్లా స్థాయిలో పోలీస్‌.. టీచర్‌ తప్ప మరే మాట వినిపించని పరిస్థితి. అది కూడా ఏ మూడేళ్లకోసారో.. అయిదేళ్లకోమారో నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి. కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం వార్డు సచివాలయాలను తీసుకొస్తోంది. ఈ నెల 22వ తేదీ విడుదలకానున్న నోటిఫికేషన్‌లో జిల్లాలోని 300కు పైగా సచివాలయాల్లో 3 వేలకు పైగా కొలువులకు సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి.

జీవో విడుదల
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో వార్డు సచివాలయాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వార్డు సచివాలయాల్లో కల్పించనున్న ప్రభుత్వ ఉద్యోగాలు, విధి విధానాలు, ఏయే పోస్టులు అనే వివరాలను సూత్రప్రాయంగా తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ–201ను విడుదల చేసింది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలను పక్కాగా నెరవేర్చడంతో పాటు పరిపాలనను ప్రజల ముందే కొనసాగించడానికి వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా జిల్లాలోని నిరుద్యోగుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 

4 వేల జనాభాకు ఓ సచివాలయం
పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 4 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఓ వార్డు సచివాలయంగా పరిగణిస్తారు. ఇలా జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి 4 వేల జనాభాకూ ఒకటి ఏర్పడుతుంది. ఈలెక్కన జిల్లాలో 300లకు పైగా వార్డు సచివాలయాలు ఏర్పా టుకానున్నాయి. ప్రతి సచివాలయానికీ పది ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో మూడువేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి.

డిగ్రీ అర్హతతో..
వార్డు సచివాలయాల్లో దాదాపు అన్ని పోస్టులకు డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించారు. వార్డు పరిపాలన కార్యదర్శి (డిగ్రీ), మౌలిక వసతుల కార్యదర్శి (పాటిటెక్నిక్, సివిల్‌ ఇంజినీరింగ్‌), పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి (డిగ్రీతో సైన్స్‌/ఇంజినీరింగ్‌), విద్యా కార్యదర్శి (డిగ్రీ), ప్రణాళిక కార్యదర్శి (డిప్లొమో అర్బన్‌ ప్లానింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌), సంక్షేమ కార్యదర్శి (డిగ్రీతో సామాజిక సేవ/సోషియాలజీ/ఆంత్రోపాలజీ), ఇంధన కార్యదర్శి (ఎలక్ట్రికల్స్‌లో డిప్లొమో), ఆరోగ్య కార్యదర్శి (నర్సింగ్‌/ఫార్మా–డీ), రెవెన్యూ కార్యదర్శి (డిగ్రీ), మహిళా కార్యదర్శి (డిగ్రీ) పోస్టులను మంజూరు చేస్తూ వాటికి ఉండాల్సిన విద్యార్హతలను సైతం జీవోలో పేర్కొన్నారు.

పోస్టుల భర్తీ షెడ్యూల్‌
ఈనెల 22వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాత పరీక్షలను ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబరు 20వ తేదీకి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేసి, అదేనెల 23వ తేదీ నుంచి 28 వరకు శిక్షణ ఇచ్చి, 30వ తేదీ విధులను కేటాయిస్తారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top