సంక్షేమ జల్లు

Govt Comes To Rescue Of Handloom Weavers - Sakshi

మంత్రివర్గ భేటీలో పలు వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌ వరాలు

చేనేతలకు ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’తో ఏటా రూ.24 వేల సాయం

యువ న్యాయవాదులకు రూ.5 వేల స్టైఫండ్‌

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.3,000కి పెంపు

హోంగార్డులకు అలవెన్స్‌ పెంపుతో ఊరట

చిరుధాన్యాలు,అపరాల బోర్డులకు ముసాయిదా బిల్లులు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

రైతులకు ఉచిత బోర్ల కోసం 200 బోరు డ్రిల్లింగ్‌ మిషన్ల కొనుగోలు

వాటర్‌గ్రిడ్‌తో 4.84 కోట్ల మందికి రక్షిత తాగునీరు

డిస్కంలను ఆదుకునేందుకు రూ.4,741 కోట్ల బాండ్ల జారీ

సాక్షి, అమరావతి: నిర్ణయాలపై నాన్చుడు ధోరణి, సాగదీత లేకుండా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను శరవేగంగా నెరవేర్చడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు పథకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. మిగిలిన 20 శాతం హామీలను కూడా అమలు చేయడమే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన మంత్రివర్గ భేటీలో చేనేత, మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థిక సాయం సహా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని 4.84 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరాకు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్, రైతులకు ఉచితంగా బోర్ల కోసం 200 బోరు డ్రిల్లింగ్‌ మిషన్లు కొనుగోలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అనంతరం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ భేటీలో ముఖ్యాంశాలు ఇవీ...

4.84 కోట్ల మందికి రక్షిత తాగునీరు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రక్షిత తాగునీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామానికి, ఆవాసానికి  రక్షిత తాగునీరు సరఫరా చేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, విదేశీ ఆర్థిక సహాయ సంస్ధలు, పీపీపీ, హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌లో నిధుల సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వాటర్‌ గ్రిడ్‌ చేపట్టి 4.84 కోట్ల మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందించనున్నారు.

చేనేతలకు ఏటా 24 వేల ఆర్థిక సాయం
చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పేరుతో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందించనున్నారు. అక్టోబర్‌ నెలాఖరు కల్లా రీ వెరిఫికేషన్‌ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. డిసెంబర్‌ 21వ తేదీ నుంచి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తారు.

డిస్కంలకు ఊరట... రూ.4,741 కోట్ల బాండ్లు జారీ
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కంలకు ఊరటనిచ్చేందుకు రూ.4,741 కోట్ల విలువైన బాండ్ల జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీల నియామకానికి కూడా ఆమోదం లభించింది.

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.3 వేలకు పెంపు
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల 89,296 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. పెంపుతో రూ.211.91 కోట్ల వ్యయం కానుంది.

హోంగార్డుల అలవెన్స్‌ పెంపు..
హోంగార్డుల రోజువారీ అలవెన్స్‌ రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మత్స్యకారులకు మూడు వరాలు వేట నిషేధ కాలంలో రూ.10 వేలు
చేపల వేటపై నిషేధం అమలులో ఉన్న సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెకనైజ్డ్, మోటారైజ్డ్, నాన్‌ మోటారైజ్డ్‌ బోట్లు ఉన్న కుటుంబాలన్నిటికీ దీన్ని వర్తింపచేస్తారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లే వారికి కూడా తొలిసారిగా ఈ పథకాన్ని  వర్తింప చేస్తారు. చేపల వేటపై ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు నిషేధం ఉంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21వ తేదీన వైఎస్సార్‌ మత్య్సకారుల వేట నిషేధ సహకారం కింద రూ.పది వేల చొప్పున ఇవ్వనున్నారు.

డీజిల్‌ సబ్సిడీ 50 శాతం పెంపు
మత్స్యకారులకు ఇచ్చే డీజిల్‌ సబ్సిడీని 50 శాతం మేర పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. తొమ్మిది జిల్లాల్లో 81 బంకుల్లో ఈ సదుపాయం కల్పించారు. బంకుల్లో డీజిల్‌ తెచ్చుకుంటున్న సమయంలోనే సబ్సిడీ అమలు చేస్తారు. ఇందుకోసం ఏడాదికి రూ.96.06 కోట్లు వ్యయం కానుంది. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21 నుంచి పథకాన్ని అమలు చేయనున్నారు.

ఉపాధి కోల్పోయిన వారికి రూ.80 కోట్లు
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ) తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన 16,654 మంది మత్స్యకారులకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ.80 కోట్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ డబ్బులు ఇచ్చేందుకు ఓఎన్‌జీసీ ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే నవంబర్‌ 21న చెల్లించాలని నిర్ణయం.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కార్పొరేషన్‌
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే కార్పొ రేషన్‌ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి. మధ్య వర్తులు, దళారీల దోపిడీకి చెక్‌ పడనుంది.

ఉచిత బోర్ల కోసం 200 బోర్‌ డ్రిల్లింగ్‌ మెషిన్లు
రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి, లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 డ్రిల్లింగ్‌ మెషిన్లు కొనుగోలు చేయనున్నారు.  

వైఎస్సార్‌ ఆదర్శం.. యువతకు చేయూత
ఇసుక, పౌర సరఫరాలు సహా రవాణా కోసం ప్రభుత్వం వినియోగించే ప్రతిచోట యువతకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ యువతకు వకాశం కల్పిస్తారు. వైఎస్సార్‌ ఆదర్శ పథకం కింద ట్రక్కుల కొనుగోళ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లిస్తే ట్రక్కు ఇచ్చేలా పథకాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. ఐదేళ్ల తరువాత వారికి వాహనాలు సొంతం కానున్నాయి.

పలాస కిడ్నీ ఆస్పత్రికి పోస్టుల మంజూరు
పలాసలో రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రిలో ఐదు రెగ్యులర్‌ పోస్టులు, 100 కాంట్రాక్టు పోస్టులు, 60 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల మంజూరుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఆర్టీసీ అవసరాలకు రూ.1,000 కోట్ల రుణం
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు, ఇతర అవసరాల కోసం రూ.1,000 కోట్ల  టర్మ్‌ రుణం తీసుకుంటారు.

చిరుధాన్యాలు, అపరాలకు వేర్వేరు బోర్డులు
రాష్ట్రంలో చిరుధాన్యాలు, అపరాల సాగును ప్రోత్సహిం చేందుకు వేర్వేరు బోర్డుల ఏర్పాటు ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పంటల ప్రణాళిక, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై కూడా ఈ బోర్డులు దృష్టి సారిస్తాయి.

గన్నవరంలో ఎస్టీఆర్‌ఎఫ్‌కు భూమి
గన్నవరం మండలం కొండపావులూరులో ఎస్టీఆర్‌ఎఫ్‌కు 39.23 ఎకరాల భూమి కేటాయింపు, నడికుడి–శ్రీకాళహస్తి బ్రాడ్‌ గేజ్‌ నిర్మాణానికి 350 ఎకరాలు, రేణిగుంట విమానాశ్రయం విస్తరణ కోసం 17 ఎకరాలు కేటాయిస్తారు.

బలహీన వర్గాల ఇళ్లకు ఆ భూములు
విశాఖ పరదేశిపాలెంలో ఆమోదా పబ్లికేషన్‌కు గత ప్రభుత్వం కేటాయించిన 1.5 ఎకరాలను రద్దు చేసి దీన్ని బలహీన వర్గాల ఇళ్లకు కేటాయించాలని నిర్ణయం.

అడ్వర్టైజ్‌మెంట్‌ టారిఫ్‌ పెంపు
దినపత్రికల అడ్వర్టైజ్‌మెంట్‌ టారిఫ్‌ పెంచుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలోకి ఇంటర్‌ విద్యను తెస్తూ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ బోర్డుల్లో ఉన్నత విద్య కౌన్సిల్‌ సభ్యులను నియమించేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ జారీని ఆమోదించింది.

మత్స్యకారుల కోసం
►చేపల వేట నిషేధ సమయంలో రూ.10 వేలు.. నవంబర్‌ 21న పంపిణీ
►డీజిల్‌పై సబ్సిడీ 50 శాతం పెంపు.. బంకుల్లో డీజిల్‌ తెచ్చుకుంటున్న సమయంలోనే సబ్సిడీ అమలు  
►ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.80 కోట్లు

నేతన్నల కోసం
పథకం            :   వైఎస్సార్‌ నేతన్న నేస్తం
లబ్ధిదారులు     :   చేనేత కుటుంబం
ఇచ్చే మొత్తం   :   ఏటా రూ.24 వేలు
అందజేసేతేదీ   :   ఏటా డిసెంబర్‌ 21న

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top