చంద్రన్న బీమా.. ఓ దగా 

Gorlagutta villagers agitation with YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌తో గోర్లగుట్ట గ్రామస్తుల ఆవేదన   

ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రన్న బీమా ఓ దగా.. అని గోర్లగుట్ట నాపరాయి క్వారీ కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాదవశాత్తు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నాపరాయి పరిశ్రమలు ఎక్కువగా ఉండే గోర్లగుట్ట గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్తులు, క్వారీ కార్మికులు తమ సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు.  

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..: నాపరాయి క్వారీలో పనిచేసేవారు ప్రమాదవశాత్తు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చంద్రన్న బీమా కింద ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కార్మికుడు వెంకటకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. క్వారీలో పనిచేసే వాళ్లంతా పేదలేనని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బావురుమన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.  

రాయల్టీ పేరుతో విజిలెన్స్‌ దాడులు చేస్తున్నారు: వైఎస్సార్‌ హయాంలో నాపరాయి పరిశ్రమకు విద్యుత్‌ బిల్లు యూనిట్‌ రూ.3.70 ఉండగా.. చంద్రబాబు వచ్చాక అది రూ.8.70కు చేరిందని క్వారీ రంగానికి చెందిన చంద్రమోహన్, పిచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమను మూసివేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. రాయల్టీ పేరుతో విజిలెన్స్‌ దాడులు చేస్తున్నారని వాపోయారు.  ‘అన్నా.. నా కుమారుడికి క్యాన్సర్‌.. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ప్రయోజనం లేదు.. మూడు లక్షల రూపాయలు ఖర్చయింది. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు.. ఇంతవరకూ రూపాయి కూడా రాలేదు. పొదుపు సంఘం నుంచి తప్పుకోవాలనుకుంటున్నా.. ’ అంటూ మునెమ్మ కన్నీటి పర్యంతమైంది.  

బాబుపై నమ్మకం పోయింది: ‘చంద్రబాబుపై మాకు పూర్తిగా నమ్మకం పోయింది.. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గుంత తవ్వుకున్నాం.. పైసా కూడా ఇవ్వలేదు.. పైగా మరుగుదొడ్డి మొత్తం కట్టుకున్నాకే డబ్బులిస్తామంటున్నారు.. ఇదెక్కడి న్యాయం’అంటూ సువార్తమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. 

టీడీపీ వాళ్లు పొలం లాక్కున్నారు.. 
తెలుగుదేశం పార్టీ వాళ్లు తన పొలాన్ని లాక్కున్నారని, మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని పలుకూరు గ్రామానికి చెందిన సుబ్బరాజు చెప్పారు. స్పందించిన జగన్‌ పక్కనే ఉన్న డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని పిలిచి బాధితుడిని కలెక్టర్‌ దగ్గర కు తీసుకెళ్లాలని చెప్పారు.  రేషన్‌కార్డు కోసం 15 సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడంలేదని నాగశేషు ఆవేదన వ్యక్తం చేశారు.  

క్వారీ పరిశ్రమను ఆదుకుంటాం 
గోర్లగుట్ట గ్రామస్తుల సమస్యలు విన్న జగన్‌.. మరో ఏడాది ఓపిక పట్టాలని, అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్‌ చార్జీలు, రాయల్టీ పెంపు వల్ల మూతపడ్డ క్వారీ పరిశ్రమను ఆదుకుంటామని, వీధిన పడ్డ కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top