రైతు ఇంట.. సిరుల పంట!

Good Days For Farmers in Anantapur - Sakshi

వ్యవసాయం ఇక పండగే..

రైతు సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట

అక్టోబర్‌ నుంచి రూ.12,500 చొప్పున         పెట్టుబడి భరోసా

విత్తన చట్టంతో నాణ్యమైన విత్తనాలు, ఎరువు

ప్రకృతి విపత్తుల నిధి, ధరల స్థిరీకరణతో మేలు

బీమా ప్రీమియం, ఉచిత బోర్లు, పాలకు రూ.4 బోనస్‌

ఏటా రూ.1,500 కోట్ల వరకు రైతులకు సాయం

అస్తవ్యస్తమైన అన్నదాత సుఖీభవ రద్దు

నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజుల వ్యవధిలోనే పాలనలో తనదైన ముద్ర కనపరుస్తున్నారు. ఒక్కో హామీని నెరవేరుస్తూ.. అందరి ముఖాల్లో ఆనందం నింపుతున్నారు. ఆశా వర్కర్లకు వేతన పెంపు.. బెల్టు షాపుల రద్దు.. తాజాగా అన్నదాత ఇంట సిరుల పంట పండించారు. వ్యవసాయాన్ని పండగ చేస్తూ సీఎం కల్పించిన రైతు భరోసా కొత్త ఆశలకు ఊపిరి పోస్తోంది.

అనంతపురం అగ్రికల్చర్‌:  రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పది రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నిర్ణయించుకుంది. గురువారం వ్యవసాయ శాఖ అధికారులు సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రైతులను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఆర్థిక భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది మే నెలలో మొదలు పెట్టిల్సిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ఆరు నెలల ముందుగానే అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించడం రైతుల్లో ఆనందం నింపుతోంది. వ్యవసాయ పథకాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలతో ఏటా జిల్లా రైతులకు రూ.1,500 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు అంచనా. విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అక్టోబర్‌ నుంచి పెట్టుబడి సాయం:  అధికారంలోకి వస్తే 2020 నుంచి ఏటా ఖరీఫ్‌ పెట్టుబడులకు మే నెలలోనే ప్రతి రైతుకూ రూ.12,500 చొప్పున సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. అయితే వచ్చే సంవత్సరం వరకు ఆగకుండా ఈ ఏడాదే అమలుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అక్టోబర్‌ 15 నుంచి పెట్టుబడి భరోసా అందజేస్తామని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా రైతులకు రూ.750 కోట్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మే నెలలో రెండో దఫా కింద పెట్టుబడి భరోసా ఇవ్వనున్నారు. దీనివల్ల రైతులు సకాలంలో పంటలు వేసుకునేందుకు వెసులుబాటు కలుగనుంది.

ప్రీమియం భారం ప్రభుత్వానిదే..
కాగా వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద ఏటా జిల్లాలో ఖరీఫ్, రబీలో వేరుశనగ, పప్పుశెనగ, కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర 10 పంటలకు బీమా పథకాలు వర్తింపజేస్తున్నారు. పంట రుణాల రెన్యూవల్‌ సమయంలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (పంట రుణపరిమితి)ను బట్టి రైతులు తమ వాటా కింద ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లిస్తున్నారు. ఖరీఫ్‌లో 5.50 లక్షల మంది, రబీలో లక్ష మంది వరకు రైతులు బీమా కంపెనీలకు రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇక నుంచి రైతులు నయాపైసా కట్టాల్సిన పనిలేదని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా పంటల బీమా పథకాలు పారదర్శకంగా అమలు చేసి పరిహారం మంజూరులో రైతుకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

ధరల స్థిరీకరణ నిధితోగిట్టుబాటు
పండిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు లభించేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులకు ఊరట లభించనుంది. పంట పండించడం ఒక ఎత్తయితే, వాటిని అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారిన నేపథ్యంలో ధరల స్థిరీకరణ నిధి భరోసా ఇవ్వనుంది. పండిన పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) లేని సమయంలో ధరల స్థిరీకరణ నిధి సాయంతో ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర లభించేలా చూస్తామని ప్రకటించారు. ఇక ఏటా అకాల వర్షాలు, అధిక వర్షాలు, మండే ఎండలు, తుఫాన్లు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతింటే.. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని ఘనంగా ప్రకటించారు. ఇది కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం కింద జిల్లా రైతులకు ఎంతలేదన్నా ఏడాదికి రూ.500 కోట్ల వరకు లబ్ధిచేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఉచితంగా బోర్లు వేయించడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అన్నదాత సుఖీభవ రద్దు
కాగా రైతుల ఓట్లు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు నెల ముందుగా అమలులోకి తెచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హడావుడిగా అమలులోకి తెచ్చిన ఈ పథకంలో భాగంగా 6 లక్షల మందికి తొలివిడతగా రూ.1,000, రెండో విడత కింద రూ.3 వేలు జమ చేస్తామని ప్రకటించినా.. జాబితాలు ఆస్తవ్యస్తం కారణంగా 4.75 లక్షల మందికి మాత్రమే సొమ్ము జమ అయింది. ఇంకా 1.25 లక్షల మంది రైతులు సుఖీభవ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. దీంతో ఈ పథకాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న వేరుశనగ, కంది, ఇతర విత్తనాలు కూడా ఇటీవల కాలంలో నాసిరకమైనవి అంటగడుతున్న విషయం తెలిసిందే. ఇక బహిరంగ మార్కెట్‌లో నాసిరకం విత్తనాలు, ఎరువులు హల్‌చల్‌ చేయడం, వాటి కారణంగా పంటలు దెబ్బతిన్న ఘటనలు కోకొల్లలు. వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండంతో రైతులకు భారీ నష్టాలు తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో విత్తనచట్టం అమలులోకి తెచ్చి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. నాసిరకం, కల్తీ అమ్మకం దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

రైతులకుముఖ్యమంత్రి వరాలు
♦ రూ.12,500 చొప్పున పెట్టుబడి భరోసా
♦ విత్తన చట్టంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
♦ ధరల స్థిరీకరణ నిధితో గిట్టుబాటు ధర
♦ బీమా ప్రీమియం చెల్లింపు
♦ ప్రకృతి విపత్తుల నిధి
♦ ఉచిత బోర్లు
♦ వ్యవసాయ మిషన్‌
♦ గ్రామ సచివాలయాల్లోనే రైతులకు అన్నిరకాల సేవలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top