ఏపీ నాలుగేళ్ల ప్రయాణం : అభద్రతా భావంలో చంద్రబాబు

Four Years Of TDP Rule In Andhra Pradesh Has Been Marked By Controversies - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల టీడీపీ పాలన వివాదాలు, రాజకీయ దుందుడుకు ధోరణులతో సాగుతూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను సాధించింది ఇది అని చెప్పుకునేందుకు నిర్దిష్టంగా ఏ ఒక్కటీ లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నిర్మాణానికి చంద్రబాబు నాయుడి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉపకరిస్తుందని ఆయనకు ఓటేసిన ప్రజలు నిండా మోసపోయారు. 

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 600కుపైగా హామీల్లో చాలా వరకూ అమలుకు నోచుకోలేదు. కొద్ది హామీలను చేపట్టినా చిత్తశుద్ధి కొరవడటంతో అవీ అరకొర అమలుకు నోచుకున్నాయి. ఎన్నికల హామీల్లో ప్రధానమైన వ్యవసాయ రుణాల మాఫీ విషయానికి వస్తే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ హామీకి దూరంగా ఉన్నారు. రైతు రుణాల మాఫీని నిజాయితీగా అమలు చేయాలంటే అవసరమైన ఆర్థిక వనరులను భరించే శక్తి ప్రభుత్వానికి ఉండదనే కారణంతో రుణ మాఫీ హామీని ఇవ్వలేదు.

మరోవైపు చంద్రబాబు మాత్రం రుణ మాఫీ హామీ ఇవ్వడమే కాకుండా, రుణ బకాయిలను చెల్లించవద్దని రైతులను కోరారు. రుణాలను తామే చెల్లిస్తామని, బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న రైతుల బంగారాన్ని తన ప్రభుత్వం విడిపిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా చంద్రబాబు నాయుడు ఈ హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. రైతు రుణాల మాఫీపైనే తాను తొలిసంతకం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం రుణ మాఫీపైన చేయనే లేదు.

మాఫీకి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోటయ్య కమిటీని నియమించారు. ఇక డ్వాక్రా మహిళలు తీసుకున్న రూ 14,205 కోట్ల రుణాలనూ రద్దు చేస్తానని చంద్రబాబు చేసిన వాగ్దానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతి మహిళకూ పెట్టుబడిగా రూ 10,000 ఇస్తానన్న హామీని కూడా అటకెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా రైతు రుణాలు రూ 1,21,933 కోట్లకు చేరుకోగా, డ్వాక్రా సంఘాల రుణాలు రూ 20,666 కోట్లకు పెరిగాయి. 

పొత్తుల ఎత్తులు..
రాజకీయపరంగా టీడీపీ అధినేత తనకు సొంతమైన విన్యాసాలన్నింటినీ ప్రదర్శించారు. 2014లో బీజేపీతో, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు, అవగాహనలతో ముందుకెళ్లారు. ఇక అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత వారిద్దరితోనూ చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నారు. తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావోద్వేగాలను రగిలించి ఎన్నికల్లో వాటి ఆధారంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. తన అవసరాలకు అనుగుణంగా స్నేహితులను ఎంచుకోవడం, వదిలించుకోవడం ​చంద్రబాబుకు అలవాటే.

1994లో కమ్యూనిస్టు పార్టీల సహకారం తీసుకున్న టీడీపీ..ఎన్టీఆర్‌ను గద్దెదింపి చంద్రబాబు అధికార పగ్గాలు అందుకోగానే కమ్యూనిజం కంటే టూరిజమే ప్రధానమని చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత లెఫ్టిస్టులుగా పేరొందిన కామ్రేడ్లను విడిచి బీజేపీతో అంటకాగారు. 2004లో బీజేపీతో కలిసివెళ్లిన చంద్రబాబుకు ఓటమి ఎదురవడంతో 2009లో మళ్లీ పాత మిత్రుల పంచన చేరారు. ఈసారి కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన టీఆర్‌ఎస్‌తోనూ మహాకూటమి పేరుతో జతకట్టారు.

తెలుగువారంతా ఒక్కటిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్‌ స్ధాపించిన టీడీపీ మూలసూత్రాన్ని సైతం విస్మరిస్తూ చంద్రబాబు ఇష్టానుసారం పొత్తులతో ముందుకెళ్లారు. ఇక 2014లో యువనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నించినా, కమలనాధులతో, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయకుండా ఒంటరి పోరుకే  వైఎస్సార్‌సీపీ మొగ్గుచూపడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో జట్టు కట్టింది. మోదీ గాలితో పాటు సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ తోడవడంతో టీడీపీ అతితక్కువ వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగింది. అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా టీడీపీలోకి రప్పించేందుకు అన్ని రకాల ప్రలోభాలకూ తెరలేపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన లేఖలపై స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఏళ్ల తరబడి నిర్ణయాన్ని నాన్చుతున్నారు. 

పెచ్చుమీరిన అవినీతి..
ఇక సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిరోజు నుంచే అవినీతి విశృంఖలమైంది. భూమి, ఇసుక, గనులు, మద్యం అవినీతి వనరులుగా మారాయి. నీటిపారుదల అవినీతి ప్రవాహానికి మరో ప్రధాన వనరైంది. గ్రామపంచాయితీలు, స్ధానిక సంస్థల అధికారాలను జన్మభూమి కమిటీలు అనుభవిస్తున్నాయి. ఎవరికి ఫించన్లు ఇవ్వాలి..గృహాలు మంజూరు చేయాలన్నది జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. దీంతో నిధుల దారిమళ్లింపు యధేచ్చగా సాగుతూ స్ధానిక సంస్ధలకు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కట్టబెట్టిన అధికారాలు ప్రభుత్వ నిర్వాకంతో నిర్వీర్యమయ్యాయి. అధికారులు ఏం చేయాలో ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు నిర్ధేశిస్తాయి. గతంలో చంద్రబాబు బ్యూరోక్రాట్లకు వంతపాడితే ఇప్పుడు రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలపై అధికారులు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అభద్రతాభావంలో చంద్రబాబు
విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈ ఆందోళనలో తనపై తాను నియంత్రణ కోల్పోతున్నట్టు చంద్రబాబు హావభావాలు చెబుతున్నాయి. తనను వెంటాడుతున్న అభద్రతాభావం కప్పిపుచ్చుకునేందుకు ఆయన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని చూస్తుండటం స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరు ఎక్కడ విజయం సాధించినా అది తన ఘనతేనని చాటుకుంటుండటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దేశంలో తానే అత్యంత సీనియర్‌నని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని పదేపదే తన గురించి చెప్పుకోవడం హాస్యాస్పదం.

నవ్యాంధ్ర కలల రాజధాని నగరం అమరావతిలో నాలుగేళ్లయినా ఇంతవరకూ ఒక్క ఇటుకా పడలేదు. చంద్రబాబు మాత్రం రాజధానికి అద్భుత డిజైన్ల కోసం, విదేశీ పెట్టుబడుల కోసం అంటూ ప్రైవేట్‌ విమానంలో ప్రపంచ దేశాలను చుట్టివస్తున్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించేందుకు ముందుకువచ్చినా నిర్వహణ లోపాలతో ప్రాజెక్టు భవితవ్యం కొట్టుమిట్టాడుతోంది. చివరికి మూడేళ్ల కిందట పనులు ప్రారంభించిన విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్‌ సైతం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా ఏపీకి మేలుచేసే ఎలాంటి పనులూ ముందుకు సాగకుండా వృధాగా గడిచాయి. సీఎం చంద్రబాబు పనితీరు తెలిసిన వారెవరూ మిగిలిన ఈ ఒక్క ఏడాదిలో అద్భుతాలు జరుగుతాయని ఆశించలేరు.


కె. రామచంద్రమూర్తి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top