ఎన్నికల ముందు సర్కారు క్లియరెన్స్‌ సేల్‌

Four Cabinet meetings in just a month - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడి నిర్ణయాలు

అక్రమాలకు కేబినెట్‌లో ఆమోద ముద్ర

కేవలం నెల వ్యవధిలోనే నాలుగుసార్లు మంత్రివర్గ సమావేశాలు 

బడా పారిశ్రామికవేత్తలకు భారీగా భూములు, రాయితీలు 

ప్రైవేట్‌ సంస్థలకు కారుచౌకగా విలువైన భూముల కేటాయింపు 

ఆలయాల భూములు ఆక్రమించుకున్న వారి పేరిటే క్రమబద్ధీకరణ 

‘గోదావరిృపెన్నా అనుసంధానం’లో రూ.491.56 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు 

‘వైకుంఠపురం బ్యారేజీ’లో 13.19 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ ఖరారు  

‘పోలవరం’లో రూ.3,650 కోట్ల విలువైన పనులు నవయుగకు.. కేబినెట్‌ ఆమోదం 

విశాఖ జిల్లాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు నిబంధనలకు విరుద్ధంగా రాయితీలు  

కీలక పోస్టుల్లో ఉన్న అస్మదీయుల పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు 

మంత్రివర్గంలో హడావుడిగా నిర్ణయాలు.. ఆగమేఘాలపై జీవోలు 

ఉన్నతాధికారుల అభ్యంతరాలను సైతం లెక్కచేయని ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు మెగా క్లియరెన్స్‌ మేళా పెట్టేశారు. ఎక్కడికక్కడ అంతా సర్దేసుకుంటున్నారు. గతంలో తాను తీసుకున్న అక్రమ నిర్ణయాలను మంత్రివర్గం(కేబినెట్‌)లో పెట్టి సక్రమం చేసుకుంటున్నారు. మంత్రివర్గమే ఆమోదిస్తే ఇక తనను అడిగేవారే ఉండరని భావిస్తున్నారు. అత్యంత విలువైన భూములను తనకు కావాల్సిన సంస్థలకు, వ్యక్తులకు కారుచౌకగా సంతర్పణ చేస్తూ, దానిపై కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారుల అభ్యంతరాలను సైతం ముఖ్యమంత్రి లెక్కచేయడం లేదు. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పటిదాకా ఏకంగా నాలుగు సార్లు కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారు. బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా భారీగా రాయితీలు ఇచ్చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. పలు కంపెనీలకు తక్కువ ధరలకే భూములు కేటాయించారు. తన అస్మదీయులను కీలక పోస్టుల్లో నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఎన్నికల ముందు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, జీవోలు జారీ చేయడం గమనార్హం. ఆ మేరకు వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?)

హడావుడిగా అర్ధరాత్రి జీవోలు 
ముఖ్యమంత్రి నేతృత్వంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సహక మండలిలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను సైతం కేబినెట్‌లో పెట్టి మరీ ఆమోదం పొందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు గుర్తుచేస్తున్నారు. అక్రమంగా నామినేషన్లపై అప్పగించిన పనులను ఇప్పుడు కేబినెట్‌లో పెట్టి ఆమోదింపజేస్తున్నారని చెబుతున్నారు. కేబినెట్‌ ఆమోదించినంత మాత్రాన అక్రమ పనులు సక్రమం అవుతాయా? అధికార యంత్రాంగం ప్రశ్నిస్తోంది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు వెంటనే జీవోలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దాంతో అర్ధరాత్రి వరకు ఉండి జీవోలు జారీ చేయాల్సి వస్తోందని అంటున్నారు. పైరవీలు, కమీషన్లకు సంబంధించిన వందలాది అంశాలను కేబినెట్‌లో టేబుల్‌ ఐటమ్‌లుగా పెట్టి, ఆగమేఘాలపై క్లియర్‌ చేస్తున్నారని తప్పుపడుతున్నారు. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌!)

గత నాలుగు మంత్రివర్గ సమావేశాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలివీ... 
- దేవాలయాలకు చెందిన ఈనాం భూముల చట్టానికి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం సవరణలు చేసింది. ఏకంగా 24 వేల ఎకరాలకు పైగా ఈనాం భూములను తమ అనుయాయులకు కట్టబెట్టేశారు. దీనిపై కేబినెట్‌లో హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు, ఆర్డినెన్స్‌ జారీ చేశారు. (బాబు బినామీకి రూ.460 కోట్లు!)
వైఎస్సార్‌ జిల్లాలోని పుష్పగిరి మఠానికి గుంటూరు జిల్లాలో ఉన్న 2,000 ఎకరాల భూములను అక్రమించుకున్న వారి పేరిటే క్రమబద్ధీకరిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు, జీవో జారీ చేశారు. 
విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 547 ఎకరాలను ఆక్రమించుకున్న వారి పేరిట క్రమబద్ధీకరించారు. ఇటీవల కేబినెట్‌లో దీనికి హడావిడిగా ఆమోదం తెలిపారు. జీవో కూడా ఇచ్చేశారు. 
చిత్తూరు జిల్లాలో గాలిగోపురం మఠానికి చెందిన భూములను కూడా ఆక్రమణదారుల పేరిట క్రమబద్ధీకరించారు. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం, జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. 
గోదావరిృపెన్నా అనుసంధానం పేరుతో హడావిడిగా టెండర్లను ఖరారు చేసి, అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు రూ.491.56 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
వైకుంఠపురం బ్యారేజీ పనుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ ఖరారు చేశారు. కాంట్రాక్టు సంస్థకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా రూ.165.39 కోట్లు ఇచ్చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, ఛానల్‌లో రూ.3,650 కోట్ల విలువైన పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర వేశారు. పోలవరం ఎడమ కాలువలో ఆరో ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.76 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.213 కోట్లకు పెంచేశారు. వీటిని నామినేషన్‌ కింద అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. దీనికి కేబినెట్‌లో ఆమోదం పొందారు. 
రాజధాని అమరావతిలో సాన్‌ట్రాన్సిక్‌ ఐటీ కంపెనీకి అత్యంత విలువైన భూములను కట్టబెట్టడంతోపాటు ఏకంగా రూ.250 కోట్ల విలువైన రాయితీలు ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం, జీవో జారీ చేయడం జరిగిపోయాయి. రాజధానిలో వేలం పాట ద్వారానే ప్రైవేట్‌ కంపెనీలకు భూములు కేటాయించాలన్న సీఆర్‌డీఏ సూచనను ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కచేయలేదు. 
విశాఖ జిల్లాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఏర్పాటు చేసే 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి, నిల్వ డేటా కేంద్రానికి నిబంధనలకు విరుద్ధంగా భారీగా రాయితీలు ఇచ్చేశారు. దీనిపై ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. మంత్రివర్గ భేటీలో పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు. 
రాజధాని అమరావతిలో ఉద్యోగులు, పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ముసుగులో భూముల కేటాయింపు విధానంలో మార్పులు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రియల్‌ ఎస్టేట్, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలకు మరింత సులువుగా భూములు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వ విధానంలో మార్పులు చేశారు. 
ఐటీ కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌లు) ఏర్పాటు పేరుతో పలు సంస్థలకు వేలాది ఎకరాల విలువైన భూములను పందేరం చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవడం, జీవోలు జారీ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆస్టిమ్, దీక్షన్‌ ఐటీ కంపెనీలకు భూమి ధరలోనూ, పెట్టుబడి వ్యయంలోనూ భారీగా రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవోలు జారీ చేశారు. 

పదవీ కాలం ఏడాదిపాటు పొడిగింపు 
అస్మదీయుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఆగమేఘాలపై జీవోలు జారీ చేసింది. నిజానికి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమే. 
ముఖ్యమంత్రి సలహాదారుగా కొనసాగుతున్న జె.ఎ.చౌదరి పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవీ కాలాన్ని 2020 డిసెంబర్‌ 28 వరకూ పొడిగిస్తూ గత నెల 18న ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. 
ఏపీ టెక్నాలజీ సర్వీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఎం.రవీంద్రను నియమిస్తూ గత నెల 13వ తేదీన జీవో జారీ చేశారు. ఆ పదవిలో ఆయన ఏడాదిపాటు కొనసాగుతారని జీవోలో స్పష్టం చేశారు. 
20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్‌గా సాయిబాబాను నియమిస్తూ గత నెల 28వ తేదీన జీవో జారీ చేశారు. ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని జీవోలో పేర్కొన్నారు. 
చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల వ్యవసాయ మార్కెట్‌ కమీటీలకు చైర్మన్లను, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం హడావిడిగా జీవోలు జారీ చేసింది. వారి పదవీ కాలం ఏడాది పాటు ఉంటుందని ఆ జీవోల్లో తేల్చిచెప్పింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top