రాష్ట్రంలో 25 జిల్లాల దిశగా తొలి అడుగులు

first steps towards 25 districts in the state - Sakshi

జగన్‌ హామీకి అనుగుణంగా 25 మంది వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం.. 16 నగరాలకు అధ్యక్షులు,  9 మంది ప్రాంతీయ కోఆర్డినేటర్ల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా తొలి అడుగులు పడ్డాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే ఆ తొలి అడుగులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతమున్న 13 జిల్లాల స్థానంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా పరిగణిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థాగత నియామకాలు చేశారు.

ఈ 25 జిల్లాలకు 25 మంది అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర చేయడానికి ముందుగా తిరుమలేశుని దర్శనానికి వెళ్లిన జగన్‌.. తిరుమల నుంచే జిల్లా అధ్యక్షుల జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేస్తానని జగన్‌ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 జిల్లాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా గత నెల 26న పార్టీ రాష్ట్ర స్థాయి అసెంబ్లీ సమన్వయకర్తల విస్తృత సమావేశంలో కూడా జగన్‌.. త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయబోతున్నానని ప్రకటించారు. ఈ హామీకి అనుగుణంగానే తాజాగా 25 మంది జిల్లా అధ్యక్షులను నియమించారు. ప్రస్తుతమున్న జిల్లా పరిధులు పెద్దగా ఉన్నాయని, ఒక్క నేత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యవేక్షించడం సాధ్యం కాదని చెప్పారు.

అందుకే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడుకున్న లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తే పార్టీ అధ్యక్షుల పని సులభతరమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రకారం 25 లోక్‌సభ స్థానాలకు పార్టీ అధ్యక్షులను, రాష్ట్రంలోని 16 నగరాలకు పార్టీ అధ్యక్షులను, పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు 9 మంది ప్రాంతీయ కో ఆర్డినేటర్లను నియమించారు. జగన్‌ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top