గూడు చెదిరింది.. గుండె పగిలింది

Fire Accident In East Godavari - Sakshi

అగ్నిప్రమాదంతో సర్వం బుగ్గిపాలు

కొంతమూరు జంగాలకాలనీలో 33 ఇళ్లు దగ్ధం

రూ.25 లక్షల ఆస్తినష్టం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం

బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించాలి : ఆకులవీర్రాజు

బాధితులను ఆదుకుంటాం :ఉపముఖ్యమంత్రి చినరాజప్ప

‘‘సుమారు రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో మిగిలాం.పాలకులు వచ్చారు. పక్కాగృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చినా అదిగోకట్టేస్తున్నాం.. ఇదిగో కట్టేస్తాం’’ అంటూ నమ్మబలికారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా అదే సమాధానం. చివరకు ‘‘పట్టాలు హౌసింగ్‌ అధికారులకు ఇచ్చాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం’’ అని పాలకులు హామీలు గుప్పించారు. పక్కా ఇళ్లువస్తాయని ఆశిస్తున్న సమయంలో విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌మమ్మల్ని కట్టుబట్టలతో నిరాశ్రయులను చేసింది.’’ అంటూ జంగాల కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.33 కుటుంబాల వారు అగ్నిప్రమాదంతో నిరాశ్రయులయ్యారు.

తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్‌: 2016 నవంబరులో  ఇదే స్థలంలో అగ్నిప్రమాదం...అప్పట్లో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘పక్కా ఇళ్లు నిర్మిస్తామని’ ఇచ్చిన హామీ రెండేళ్లు పూర్తవుతున్నా ఆచరణకు నోచుకోలేదు. మళ్లీ ప్రమాదం.. ఆ నేతలే వచ్చి అవే హామీలు ఇవ్వడంతో బాధితులు మండిపడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు గ్రామంలోని జంగాలకాలనీలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. 33 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సయ్యద్‌మౌరాన్‌ ఇంటి నుంచి మంటలు వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారితో పాటు, పక్కపక్కనే ఉన్న వారు సైతం వెంటనే మేల్కొని ప్రమాద బారి నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకాధికారి బి.శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుజేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం చోటు చేసుకుందని, సుమారు రూ.25లక్షలకు పైగా ఆస్తినష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారి తెలిపారు.

సర్వంబుగ్గిపాలు..
పిల్ల పెళ్లి చేద్దామని తెచ్చిన రూ.40వేలు అగ్నికి ఆహూతయ్యాయని ఒకరు.. చీటీ పాడడంతో పాటు, సోమవారం పద్దు ఆయన వద్ద డబ్బులు మొత్తం రూ.53వేలు బూడిదయ్యాయని లక్ష్మి అనే వృద్ధురాలు, ఇలా ఒక్కొక్కరు తమ బాధను వ్యక్తం చేస్తూ బోరున విలపించారు. గతంలో జరిగిన అగ్నిప్రమాద సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులతో పాటు, ఇంటిలో సమకూర్చుకున్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా కట్టుబట్టలే మిగిలాయని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పక్కా ఇళ్లు నిర్మించు ఉంటే తమకు ఇంత అన్యాయం జరిగేది కాదని విలపిస్తున్నారు. సంఘటన స్థలంలో స్వల్ప గాయాలైన బాధితులకు ప్రాథమిక వైద్యుడు ఎంఎం అలీ వైద్యసేవలు అందించారు. అగ్నిప్రమాద విషయం తెలియగానే సంఘటన స్థలానికి రూరల్‌ తహసీల్దార్‌ కె.పోసిబాబు, తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు రాజానగరం ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌కుమార్‌ చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే అర్బన్‌ జిల్లాఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ చేరుకుని తక్షణమే బాధితులకు కావాల్సిన చర్యలు చేపట్టాలని పోలీసుసిబ్బంది ఆదేశించారు.

‘పక్కా ఇళ్లు నిర్మించకపోవడం వల్లే..’
2016 నవంబర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమయంలో పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గోరంట్ల ఇప్పటి వరకు అమలు చేయపోవడం వల్లే మరలా అగ్నిప్రమాదం జరిగి బాధితులు రోడ్డున పడ్డారని వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకులవీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పార్టీనాయకులు ఎంఎం ఆలీ, యామన రామకృష్ణ, షేక్‌చానా, షేక్‌బాజీలతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో బాధితులతో కలిసి ఆందోళన చేపట్టినప్పుడు ఎమ్మెల్యే గోరంట్ల మార్చినెలలో శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. దీనికి పూర్తిబాధ్యత గోరంట్ల తీసుకుని వెంటనే బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

బాధితులను ఆదుకుంటాం:  చినరాజప్ప
బాధితులను ఆదుకుంటామని మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరితో కలిసి బాధితులను పరామర్శించారు. బాధితులకు టిడ్కోలో జీప్లస్‌ 2నిర్మాణం చేపట్టాలని చూశారని, అది కాలేదని, ప్రస్తుతం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో 148 మందికి పక్కా ఇళ్లు ఏజెన్సీ ద్వారా నిర్మిస్తామని చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.ఎనిమిదివేలు నగదు, పదికేజీలు బియ్యం అందిస్తున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top