నేడే పంచాయతీ తుది సమరం


పంచాయతీ ఎన్నికల మూడో, తుది సమరం బుధవారం జరగనుంది. వరదల కారణంగా వాయిదాపడిన 304 పంచాయతీలతో కలిపి మూడో విడతలో 5,939 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ మంగళవారం విలేకరులకు చెప్పారు. తుది విడతలో మొత్తం 6,890 పంచాయతీలు ఉంటే.. అందులో 1,220 ఏకగ్రీవమయ్యాయని ఆయన వివరించారు. గుంటూరు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేని కారణంగా నరసారావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లలో ఆరు పంచాయతీల ఎన్నికలు వచ్చే నెల 8కి వాయిదా వేసినట్లు చెప్పారు. మూడు దశల ఎన్నికల్లో మొత్తం 18,721 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, మరో 2,642 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, 78 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని చెప్పారు. మూడో దశలో సర్పంచ్ స్థానాల కోసం మొత్తం 22,064 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి పంచాయతీలు, నరసారావుపేట మండలం ఇక్కురు, నాదెండ్ల మండలంలోని తుబడు పంచాయతీకి, గుజరాల డివిజన్ వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు, కండ్లకుంట పంచాయతీల పరిధిలో ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితి విషమించే అవకాశం ఉందంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికలను వాయిదా వేశామని మిట్టల్ తెలిపారు. ఇవి కాకుండా వరంగల్, పశ్చిమగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కోవార్డుకు ఎన్నికలు వాయిదాపడ్డాయని, వీటికి ఈనెల 31 నుంచి ఆగస్టు 2 వరకు నామినేషన్లు దాఖ లు చేయవచ్చని, 13న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

 రూ.20.05 కోట్లు సీజ్: పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 20.05 కోట్ల నగదు సీజ్ చేసినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. మొత్తం 1.41 లక్షల మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఇక 1,007 క్రిమినల్ కేసుల్లో 615 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక మూడో దశ కోసం 1,733 గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, అలాగే 3,684 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని, 2,467 గ్రామాల్లో వీడియో రికార్డింగ్ చేస్తామని చెప్పారు. కాగా, పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు సంబంధించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముది మంగళవారం వెల్లడించారు.  

 ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు: నిర్మల్ (24), అనంతపురం (388), మదనపల్లి (499), నరసరావుపేట (355), అమలాపురం (272), కరీంనగర్ (399), కొత్తగూడెం (147), పాల్వంచ (117), మచిలీపట్నం (233), గుడివాడ (219), ఆదోని (297), నాగర్‌కర్నూలు (223), వనపర్తి (162), సంగారెడ్డి (367), మిర్యాలగూడ (225), దేవరకొండ (151), కామారెడ్డి (191), మార్కాపురం (199), వికారాబాద్ (236), గూడూరు (210), నాయుడుపేట (127), టెక్కలి (364), అనకాపల్లి (322), వరంగల్ (220), జనగాం (200), నర్సాపూర్ (250), జమ్మలమడుగు (275).

 

 రెండు కార్పొరేషన్లలో 15 పంచాయతీల విలీనం

 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్‌లో పది పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలను, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌లో ఐదు పంచాయతీలను విలీనం చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 15  పంచాయతీలను డీ నోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీలతోపాటు కె.నాగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం, తడి, సాలెపువానిపాలెం, రాజుపాలెం, వల్లూరు, కొప్పాక పంచాయతీలను గ్రేటర్ విశాఖలో విలీనం చేశారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌లో అల్లూరు, సర్వేరెడ్డిపాలెం, మందువారిపాలెం, మల్లేశ్వరపురం, మంగమూరు పంచాయతీలు విలీనం అయ్యాయి. తాజాగా పంచాయతీలు, మునిసిపాలిటీలు విలీనం అయిన కార్పొరేషన్లకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top