హోదాయే బ్రహ్మాస్త్రం

హోదాయే బ్రహ్మాస్త్రం - Sakshi


గుంటూరు ‘యువభేరి’లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

హోదా కోసం పోరాడితే కేసులు, వేధింపులా?

తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీ పాదాల వద్ద బాబు తాకట్టు

భాగస్వామ్య సదస్సు ఎంవోయూలన్నీ బోగస్‌

హోదా వస్తేనే నిధులు, ఉద్యోగాలు

ప్రత్యేక హోదా కోసం జూన్‌ తర్వాత ఎంపీల రాజీనామాలు..

సుస్థిర అభివృద్ధి సాధనకు హోదానే మేలైన మార్గం



సాక్షి, అమరావతి బ్యూరో ప్రతినిధి ‘‘రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రత్యేకహోదాయే బ్రహ్మాస్త్రం వంటిది. హోదా సాధన కు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజల, లక్షలాది మంది నిరుద్యోగుల ప్రత్యేక హోదా ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  హోదా సాధనే లక్ష్యంగా గుంటూరులో గురువారం నిర్వహించిన ‘యువభేరి’  సదస్సులో జగన్‌ మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్ర బాబు ప్రత్యేక హోదాను కత్తితో పొడిచేస్తున్నారని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వారి వద్ద తాకట్టు పెట్టేశారని విరుచుకుపడ్డారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరినట్లుగా  సీఎం చెబుతున్న  పెట్టుబడుల ఎంవోయూలన్నీ  బోగస్‌ అని సోదా హరణంగా వివరించారు. ప్రత్యేకహోదా కోసం జూన్‌ వరకు ఎదురుచూ స్తామని, ఆ తర్వాత తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్‌ స్పష్టం చేశారు. యువభేరి సదస్సులో జగన్‌ ప్రసంగం సాగిందిలా..



తల్లిదండ్రులకు సెల్యూట్‌

‘‘దేశమైనా, కుటుంబమైనా సరే ఇప్పటికి సాధించిన అభివృద్ధిని కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటాం. 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. తాత కంటే తండ్రి, తండ్రి కంటే కుమారుడు మరింతగా బాగుండాలని కోరుకుంటారు. అమ్మమ్మ కంటే అమ్మ, అమ్మ కంటే కుమార్తె బాగుండాలనుకుంటారు. ఆర్థిక పరిస్థితి, నివసించే ఇల్లు, మొత్తం జీవితం నాణ్యత మెరుగుప డాలి. దీన్నే సుస్థిర అభివృద్ధి అంటాం. అలాంటి అభివృద్ధి కోసం తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి అనేక త్యాగాలు చేసి పిల్లలను చదివిస్తుం టారు. అలాంటి తల్లిదండ్రులకు అందరికీ ఈ యువభేరి వేదిక మీద నుంచి సెల్యూట్‌ చేస్తున్నా.  



సుస్థిర అభివృద్ధికి ‘హోదా’నే బ్రహ్మాస్త్రం

రాష్ట్ర సుస్థిర అభివృద్ధిలో ప్రభుత్వం తగిన పాత్ర పోషించాలి.  హైదరాబాద్‌ నగరాన్నే ఉదాహరణగా తీసుకుంటే బీడీఎల్, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఎంటీ, హెచ్‌ఐఎల్, మిధాని, సీసీఎంబీ, ఐఐసీటీ, ఈసీఐఎల్,  ఇక్రిశాట్, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్‌ వంటి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంత చేయవచ్చో చెప్పడానికి  ఈ సంస్థలే ఉదాహరణ.ఇవన్నీ ప్రభుత్వ చొరవ, ప్రయత్నాల వల్లే ఏర్పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై తదితర నగరాలు కూడా అలాగే అభివృద్ధి చెందాయి. మరి ఆ నగరాలతో మనం పోటీపడగలమా? తగిన మౌలిక వసతులు లేకుండా, ప్రభుత్వ సహకారం లేకుండా ఆ నగరాలతో మనం పోటీపడలేం. అందుకే సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే బ్రహ్మాస్త్రం అని చెబుతున్నా.



మన ప్రాంతంలోనే మన పిల్లలకు ఉద్యోగాలు

ప్రస్తుతం మన పిల్లలకు మన ప్రాంతంలో, మన జిల్లాలో మంచి జీతాలతో ఉద్యోగాలు రావడం లేదు. మన పిల్లలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యేక హోదా సాధిస్తే మన పిల్లలకు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన పట్టణాలలో మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి.



‘హోదా’ను చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారు

ప్రత్యేక హోదా’ను చంద్రబాబు కత్తితో పొడిచేస్తున్నా రు. ముఖ్యమంత్రిగా హోదా కోసం ఆయన ముందుం డి పోరాడాలి. కానీ పోరాడడం లేదు సరి కదా... పోరాడుతున్న వాళ్లను అణచి వేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్‌ చేస్తుంటే దానిని నీరుగార్చేం దుకు దగ్గరుండి మరీ ఆర్టీసీ బస్సు లను తిప్పుతు న్నారు. ధర్నా చేస్తుంటే కేసులు బనాయిస్తున్నారు. పిల్లలు అనీ  చూడకుండా పీడీ యాక్టు పెడుతున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26న శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తామంటే అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతను ఎయిర్‌పోర్టు రన్‌వే మీదే ఆపేయడం మీరు చూశారు. బస్‌రోకోలు, రైల్‌రోకోలుంటాయి. కానీ చంద్రబాబు హయాంలో ఏకంగా విమానాల రోకో కూడా మనం చూశాం. జూలియస్‌ సీజర్‌ నాటకంలో రోమన్‌ చక్రవర్తి  సీజర్‌ను ఆయన స్నేహితుడు బ్రూటస్‌ కత్తితో వెన్నులో పొడుస్తాడు. అప్పుడు  సీజర్‌ ‘యూ టూ బ్రూటస్‌’ అని అంటాడు. హోదా తీసుకురాకుండా చంద్రబాబు బ్రూటస్‌లా వెన్నుపోటు పొడుస్తున్నా డు. అందుకే ఇవాళ యావత్‌ తెలుగుజాతి ‘నువ్వు కూడానా చంద్రబాబూ’అని ప్రశ్నిస్తోంది.



తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు

ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ వారితో పోరాడారు. కానీ చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేశారు. ఈ దుస్థితి చూసి ఎన్టీ రామారావు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హయాంలో తెలుగు ద్రోహుల పార్టీగా మార్చేశారు.



హోదా వస్తేనే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు

ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవని వంటిదని చంద్రబాబు, వెంకయ్యనాయుడు అన్నారు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు  ఇవ్వాలని వెంకయ్యనాయుడు అడిగారు.  కాదు కాదు పదిహేనేళ్లు అని చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక హోదా వల్ల ఏం వస్తుంది? అని చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్లేటు ఫిరాయించారు. (ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్‌లో వెంకయ్య నాయుడు మాట్లాడిన వీడియో, తిరుపతి సభలో మోదీ, బాబు, వెంకయ్య ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శిం చారు.) దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఆ రాష్ట్రాలను చూస్తే తెలుస్తుంది ఏం వస్తుందో. ప్రత్యేక హోదాతో కేంద్రం నిధులు వెల్లువెత్తుతాయి. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఆ రాష్ట్రాల్లో 7.50 కోట్ల జనాభా ఉంది. అంటే  దేశ జనాభాలో 6.5 శాతం ఆ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. 11 రాష్ట్రాలకు 2012–13 ఆర్థిక సంవత్సరంలో రూ.76,980 కోట్లు కేంద్ర నిధులు ఇచ్చారు. మిగిలిన 93.5శాతం జనాభా ఉన్న రాష్ట్రాలు అన్నింటికీ కలిపి రూ.1,86,826కోట్లు ఇచ్చారు. అంటే  6.5 శాతం జనాభా ఉన్న 11 రాష్ట్రాలకు 30 శాతానికి పైగా కేంద్రం నిధులు అందాయి. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అందులో సగం నిధులు కూడా రాలేదు. హోదా వల్ల ఇదీ ప్రయోజనం. ఆంధ్రప్రదేశ్‌లో 5.50 కోట్ల జనాభా ఉంది. ప్రత్యేక హోదా  వస్తే మనకు ఎన్ని నిధులు వస్తాయో కదా. ఈ వాస్తవాలు ఏవీ చంద్రబాబుకు కనిపించడం లేదా?



హోదాతో ఎన్నో ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్‌కి ఈ మధ్య కేంద్రం పప్పుబెల్లాలలా పారిశ్రామిక రాయితీలిచ్చింది.అవి యాక్సిలరేటెడ్‌ డిప్రీసియేషన్, ఎన్‌హాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అలవెన్స్‌. ఈ రెండూ చూసి ఏ పారిశ్రామిక వేత్తా ముందుకు రావడం లేదు. ఈ రాయితీలను చంద్రబాబు చాలా గొప్పవని చెబుతున్నారు.ఇవే రాయితీలు మన పక్కన ఉన్న తెలంగాణకు, పశ్చిమబెంగాల్, బీహార్‌లకూ ఇచ్చారు. మరి మనకు అదనంగా ఇచ్చింది ఏమిటి? ప్యాకేజీ ఇస్తున్నారు కదా అని చంద్రబాబు చెబుతున్నారు. అది కూడా వట్టి అబద్ధం. మనకు విభజన చట్టంలో రావాల్సిన దానికంటే ఎక్కువ  ఇస్తే ప్యాకేజీ అనాలి. కేంద్రం మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు. చంద్రబాబు విదేశాల్లో తిరిగితే ఆయన ముఖారవిందాన్ని చూసి పెట్టుబడులు పెట్టరు.  హోదా ద్వారా వచ్చే రాయితీలను చూసి పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి రాయితీ, రవాణా వ్యయం రీయింబర్స్‌మెంట్, వడ్డీ రాయితీ, ఆదాయపు పన్ను రాయితీ.. ఉంటే పెట్టుబడులు అవే వస్తాయి. ఫలితంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.



జూన్‌ తర్వాత ఎంపీల రాజీనామాలు..

సంజీవని వంటి హోదా కోసం చంద్రబాబు అడగాలి. కానీ ఆయన అడగడం లేదు. పైగా మాకు అంతా బాగుందని చెబుతున్నారు. హోదా అవసరం లేదని ఆయనే చెప్పేస్తున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు, పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టకుండా తమకు ఇచ్చేస్తే నిధులు కొల్లగొట్టొచ్చన్న ఉద్దేశంతో హోదా ఊసు ఎత్తడం లేదు. మేము కొత్తగా ఏమీ అడగడం  లేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నాం. అందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాటం సాగిస్తుంది. జూన్‌ 3కు రాష్ట్రం విడిపోయి మూడేళ్లు అవుతుంది. అప్పటికీ హోదా ప్రకటించకపోతే ఆ తరువాత వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామాలు  చేస్తారు. హోదా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. దేశం మొత్తం మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించేలా... హోదా వచ్చేలా పోరాటం చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top