ఆమే కీలకం!

ఆమే కీలకం!


- దండకారణ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళా మావోయిస్టులు

- ప్రచారస్థాయి నుంచి కమాండర్ల స్థాయికి ఎదుగుదల

- రెక్కీ నిర్వహించడంలో కీలకపాత్ర




చింతూరు (రంపచోడవరం):  మావోయిస్టు ఉద్యమంలో సానుభూతిపరులుగా ఉంటూ ‘చేతన నాట్య మండలి’ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు చేసే బాధ్యతలు నిర్వహించే మహిళలే నేడు మావోయిస్టుల కార్యకలాపాల్లో ఆరితేరిపోయారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బుర్కాపాల్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణని కూంబింగ్‌లో పాల్గొన్న జవాన్లు చెబుతున్నారు.



గతంలో బస్తర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనాయకులపై జరిగిన దాడిలోనూ వీరు అధికంగా పాల్గొన్నారు. ప్రస్తుతం దండకారణ్య పరిధిలోని ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో మహిళా కమాండర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ముగ్గురు మహిళా మావోయిస్టు కమాండర్లపై భారీ రివార్డులు కూడా ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి ఏరియా కమిటీకి సైతం మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారద అలియాస్‌ సమ్మక్క సారథ్యం వహిస్తున్నారు.



రెక్కీలో కీలకం...

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రేంజ్‌లోని ఏడు జిల్లాలతోపాటు తెలంగాణలోని భద్రాద్రి, ఆంధ్రాలోని తూర్పు గోదా వరి జిల్లాలను కలుపుకుని దండకారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం దండకారణ్య పరిధిలో భారీస్థాయిలో మహిళా మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ జరిగి నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. వీరికి రహస్య ప్రాంతాల్లో ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. గ్రామీణుల వేషధారణలో పోలీసు బలగాల క్యాంపుల అతి సమీపం వరకు వెళ్లి రెక్కీ నిర్వహించి బలగాల కదలికలను పసిగట్టే అవకాశముండడంతో వీరికే ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో చురుకుగా వ్యవహరిస్తున్న చర్ల, శబరి ఏరియా కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని దర్బా, భెజ్జీ, పర్శేగఢ్, కుట్రు, ఛోటేడోంగర్, ఝారాఘాటీ, ఆవపల్లి, ఆమాబేడా, ఓర్ఛా వంటి ఏరియా కమిటీల బాధ్యతను మహిళా కమాండర్లే నిర్వహిస్తున్నట్లు సమాచారం.



ప్రత్యేక శిక్షణ...

 ప్రతి ఇంటినుంచి ఓ మహిళ దళంలో చేరాలని ఇప్పటికే మావోయిస్టులు దండకారణ్య పరిధిలో హుకుం జారీ చేశారు. దళాల్లో చేరిన మహిళలకు యుద్ధ తంత్రంపై రహస్య ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. వీరిని భారీస్థాయిలో రిక్రూట్‌మెంట్‌ చేసి కీలక బాధ్యతలు అప్పగించి బలగాలపై దాడులు నిర్వహించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌కౌంటర్ల సమయంలో పోలీసులకు లభించిన డైరీల్లో ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు బస్తర్‌ రేంజ్‌ పరిధిలోని జైళ్లలో సుమారు 50 మంది మహిళా మావోయిస్టుల ఖైదీలుగా ఉన్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top