టిక్‌‘ట్రాప్‌’లో శక్తి టీమ్‌ 

Female Constables Who Spend Time With Tik Tok - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విధుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన శక్తి టీమ్‌ సభ్యులు టిక్‌టాక్‌లతో కాలం గడుపుతున్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో విధులను గాలికొదిలేసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ సస్పెన్షన్‌కు గురైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాడ్యం విశాఖకూ పాకింది. మహిళల భద్రతకు సంబంధించిన విధుల్లో ఉన్న శక్తిటీమ్‌లోని కొందరు సభ్యులు యూనిఫామ్‌తో వాహనాల్లోనే టిక్‌టాక్‌లు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం 35 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి శక్తి టీమ్స్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీరికి బైక్స్‌తోపాటు కార్లు ఏర్పాటు చేశారు. వీటితో నగరంలో కలియతిరుగుతూ విధులు నిర్వర్తించాలి.

అయితే ఈ విధి నిర్వహణలో ఉంటూ వెస్ట్‌ టీమ్‌కి చెందిన కొందరు మహిళా కానిస్టేబుళ్లు డ్యూటీ వాహనంలో వెళ్తూ సినిమాల్లోని డైలాగ్‌లకు, సంభాషణలకు తమ హావభావాలు జోడిస్తూ వీడియోలు చేశారు. వీటిని ఓ శక్తి టీమ్‌ కానిస్టేబుల్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవడంతో వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ టిక్‌టాక్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ వ్యవహారంపై పోలీస్‌ కమిషనర్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో ఈ తరహా అలసత్వం ప్రదర్శిస్తే వారి ప్రొహిబిషన్‌ పీరియడ్‌ పెంచుతామని హెచ్చరిస్తూ సదరు ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లకి మెమో జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ టిక్‌టాక్‌ల వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ఆ మహిళా కానిస్టేబుల్‌.. ఆ వీడియోలన్నింటినీ తన టిక్‌టాక్‌ అకౌంట్‌ నుంచి డిలీట్‌ చేసింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top