ఫరూక్‌ వర్సెస్‌ ఎస్పీవై!

Farooq Vs SPY in Kurnool - Sakshi

ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా కుట్టుమిషన్‌ కేంద్రం ఏర్పాటు

మిషన్ల పంపిణీపై మంత్రి గుస్సా

మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీపై బదిలీ వేటు

మండిపడుతున్న ఎస్పీవై వర్గం

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నంద్యాల నబీనగర్‌లో ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కుట్టుమిషన్‌ కేంద్రం ఏర్పాటు, కుట్టుమిషన్ల పంపిణీ విషయంలో మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవైరెడ్డి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ కేంద్రం ప్రారంభోత్సవంతో పాటు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధమయ్యింది. ఈ సమాచారం తనకు తెలియజేయలేదంటూ మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీని మంత్రి ఫరూక్‌ ఏకంగా బదిలీ చేశారు. సస్పెండ్‌ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా చేపట్టిన కార్యక్రమం కావడంతో మంత్రికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే, తన శాఖ ద్వారా మంజూరు చేసి..సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి ఆగ్రహించారు.

ఈ క్రమంలోనే మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ హేమచంద్రను హడావుడిగా బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గం మండిపడుతోంది. ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమాన్ని రచ్చ చేయడం ఎందుకని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో నేరుగా ఫరూక్‌పై విమర్శలు చేసేందుకు ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాలవ శ్రీనివాసులు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా ఈడీని సస్పెండ్‌ చేసేందుకు ఫైలు సిద్ధం చేయిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది.  

ఆది నుంచీ విభేదాలే..
మంత్రి ఫరూఖ్‌కు, ఎంపీ ఎస్పీవై రెడ్డికి మధ్య విభేదాలు మొదటి నుంచీ ఉన్నాయి. గతంలో ఇరుపక్షాల నుంచి వీరు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అప్పటి నుంచే కలహాలు కొనసాగుతున్నాయి. ఫరూక్‌ మంత్రి అయిన తర్వాత  భూమా అనుచరులపైనా రౌడీషీట్లు నమోదు చేయించారు. దీనిపై బాధిత నేతలు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కలిసి విన్నవించారు. అయితే.. ఆయన సరిగా పట్టించుకోలేదంటూ శ్రీధర్‌రెడ్డిని కూడా కలిశారు. ఈ విషయంపై ఇన్‌చార్జ్‌ మంత్రితో పాటు సీఎంతోనూ మాట్లాడతానని శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. సొంత పార్టీ నేతలనే వేధిస్తున్నారంటూ మంత్రి ఫరూక్‌పై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాలు కాస్తా ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా మైనార్టీ కార్పొరేషన్‌ అధికారులపై ప్రభావం చూపాయి. అయితే, ఈడీ బదిలీ రద్దు చేయాలంటూ ఎంపీ వర్గం పట్టుబడుతోంది. సమస్య పరిష్కారం కాకపోతే మీడియా సాక్షిగా మంత్రిపై విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top