బాబు పాలనలో.. చెట్టంత రైతు చెట్టు కొమ్మకేలాడే..

Farmers Suicides Have Become Regular in The District With Famine Droughts - Sakshi

 సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌) : ఉన్నట్టుండి కాలువలకు నీరు ఆగిపోతుంది.. పచ్చగా కళకళలాడే పైరు కళ్లముందే ఎండిపోతుంది.. రుణం కట్టాలని పిడుగులా బ్యాంకు నోటీసు వచ్చి పడుతుంది..  గౌరవంగా బతికిన రైతు గుండె అదే రోజు ఆగిపోతుంది..   కరువు కాటకాలతో జిల్లాలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. ఐదేళ్లలో ఏకంగా 281 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2014లో 40 మంది, 2015లో 71 మంది, 2016లో 38 మంది, 2017లో 69 మంది, 2018లో 63 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలు పండక, అప్పుల భాధలతోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. 2014 నుంచి 2018 వరకు వరుసగా కరువు ఏర్పడడంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

2017లో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో కరువు మండలాలను గుర్తించారు. 2014లో 20 మండలాలు, 2015లో 42, 2016లో 38, 2018 ఖరీప్‌లో 50, రబీలో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కర్నూలు జిల్లాలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, కంది, మినుము, శనగ, ఉల్లి, మిరప ప్రధాన పంటలు. ఒక్క సంవత్సరం కూడా రైతులకు గిట్టుబాటు ధరల లభించలేదు.

మద్దతు ధరల కంటే తక్కువకే పంటలను అమ్ముకొని నష్టపోయారు. రాష్ట్రంలోనే ఉల్లి సాగు అత్యధికంగా కర్నూలులో సాగు అవుతోంది. క్వింటాల్‌కు రూ.400 కూడా ధర లభించక పోతుండటం వల్ల రైతులు నష్టాలను మూట కట్టుకుంటున్నారు. ప్రతి ఏటా కరువు ఉత్పన్నం అవుతుండటంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. 

వినిపించని గలగలలు
కర్నూలు సిటీ: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఆర్‌ఎంసీ(శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ)ని బానకచర్ల కాంప్లెక్స్‌ వరకు చేపట్టాల్సి ఉంది. అయితే 16.5 కి.మీ కాలువ పూర్తి కాలేదు. గాలేరు–నగరిలో భాగంగా ఎస్‌ఆర్‌బీసీ పరిధిలో 25, 26వ ప్యాకేజీల కింద కాలువ విస్తరణ, బానకచర్ల కాంప్లెక్స్‌ దగ్గర నూతన రెగ్యులేటర్‌   పనులు పూర్తి కాలేదు. గాలేరు వరద కాలువ పనులు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి.

సాగు, తాగు నీరు అందించడం కోసం 1983 సంవత్సరంలో ప్రారంభమైన తెలుగుంగ ప్రాజెక్టు ఇంత వరకు అంపూర్తిగానే మిగిలిపోయింది. తుంగభద్ర దిగువ కాలువపై 16 మండలాల్లో 192 గ్రామాలు ఆ«ధారపడి ఉన్నాయి. సాగు, తాగు నీటి కోసం ఉద్దేశించిన ఈ కాలువ పరిధిలో 60 శాతం వర్షాధార పంటలపై ఆధారపడగా, 40 శాతం కాలువ నీటిపై ఆధారపడి ఉంది. కాల్వ ఆధునీకీకరణ పనులు పూర్తికాలేదు.

గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో బసలదొడ్డి, చిలకగడోణ, బసలదొడ్డి, మాధవరం స్కీమ్‌ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. పులికనుమ పనులు అడ్డగోలుగా చేయడంతో లీకేజీలు ఇస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అసంపూర్తిగానే ఉండిపోయింది. పులకుర్తి స్కీమ్‌ను పట్టించుకునే వారు కరువయ్యారు. 

వైద్య రంగం కుదేలు  
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగాలు కుదేలయ్యాయి.  ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టులు భర్తీ కాలేదు. ఇటీవల ఆరు నెలల నుంచి మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు కొడిగట్టాయి. జిల్లాలోని ఐదు వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేసినా పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఏటా ఇచ్చే మందుల బడ్జెట్‌లో మూడేళ్ల నుంచి భారీగా కోత విధించారు. ఏటా రూ.8 కోట్లకు పైగా నిధులు ఇవ్వాల్సి ఉండగా.. పావు శాతం కూడా విడుదల చేయడం లేదు.

ఫలితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకున్న రోగులు సైతం ప్రైవేటుగా మందులు కొనాల్సి వస్తోంది. ఎంఆర్‌ఐ, సిటిస్కాన్‌ సేవలు ఆలస్యమవుతున్నాయి. వైద్య పరికరాలు మరమ్మతులు చేయకున్నా.. చేసినట్లు చూపి ప్రైవేటు ఏజెన్సీ కోట్లాది రూపాయలు డ్రా చేసుకుంది. జిల్లాలో 108 అంబులెన్స్‌లు 34 ఉండగా.. ఇందులో 30 మాత్రమే నడుస్తున్నాయి.

వీటికి కూడా డీజిల్, వైద్యపరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాలకు వైద్యసిబ్బంది నెలకోసారి వెళ్లి బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇవ్వాల్సి ఉన్నా.. అరకొరగానే పంపిణీ చేస్తున్నారు. వైద్యపరీక్షలు చేయకపోవడంతో రోగులు నిట్టూరుస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో అరకొర వైద్యసేవలు అందుతున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యసేవలు అందించకపోవడం, టెలిమెడిసిన్‌ సైతం లేకపోవడం గమనార్హం. 

 పల్లెల్లో దాహం కేకలు.. 
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని దాదాపు 200కు పైగా గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. వర్షాలు అంతంత మాత్రం కురవడంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటాయి. వివిధ ప్రాంతాలకు ఆనుకొని ప్రవహిస్తున్న నదుల్లో నీరు ఇంకి పోయి.. తాగునీటి సమస్య జటిలంగా మారింది. పల్లెలతో పాటు నియోజకవర్గ కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లోని ప్రజలు సైతం తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 90 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని ఏడు గ్రామాలకు నీరు అందిస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top