అన్నదాత కన్నెర్ర


అద్దంకి: పది రోజులుగా అద్దంకి మేజరుకు నీరు రావడం లేదు. వేసిన వెయ్యి ఎకరాల భూముల్లో నాట్లు ఎండిపోయాక నీరిస్తారా అంటూ మండలంలోని శంఖవరప్పాడు రైతులు శుక్రవారం మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తొలుత అధికారులను నీళ్ల విషయమై అడిగేందుకు రైతులు వెళ్లారు. ‘మీరే వెళ్లి నీళ్లు తెచ్చుకోండి’ అని అధికారులు అనడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకోకు దిగారు. దాదాపు గంటన్నర పాటు మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై బైఠాయించి ప్రభుత్వ, అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. రాస్తారోకోనుద్దేశించి రైతు బీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాలువపై ఎన్‌ఎస్‌పీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. 18వ మైలు వద్ద 1500 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం 1500 క్యూసెక్కులు కూడా రావడం లేదన్నారు. అద్దంకి మేజరుకు 200 క్యూసెక్కులు రావాల్సి ఉండగా..50 క్యూసెక్కులు మాత్రమే వస్తోందని చెప్పారు. ఈ విషయమై అధికారులను అడిగితే రెండు నెలలుగా సమాధానం సరిగా చెప్పడం లేదన్నారు. ఇటీవల నాచు తొలగిస్తున్నాం..తరువాత  నీరు బాగా వస్తుందన్నారు.

 

 కానీ ఇప్పుడు అంతకు ముందుకన్నా తక్కువ నీరు రావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు గుంటూరు జిల్లా రైతులతో లాలూచీ పడి ఎక్కువ నీటిని వారు వాడుకునేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. నలభై ఏళ్లుగా కాలువపై లేని పవర్‌ప్లాంట్లు ఇప్పుడెందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ప్లాంట్ల వల్ల వచ్చే కాస్త నీరు కూడా తగ్గిపోతోందన్నారు. మేజరు పరిధిలో 3 వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండే దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరివ్వందే రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. డీఈ శ్రీనివాసరావుపై రైతులు మండిపడ్డారు. ఈ క్రమంలో ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. రాస్తారోకోలో సోము పరమేశ్వరరెడ్డి, బిజ్జం అంజిరెడ్డి, కైపు వెంకటేశ్వరరెడ్డి, కోండ్రు వెంకటేశ్వర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top