రైతుల రెక్కల కష్టానికి సర్కారు ఎసరు!

Farmers fires on government - Sakshi

71 ఎకరాల్లో సీఎం సభకు ఏర్పాట్లు

సమావేశానికి హాజరయ్యే జనాలతో మరో 40 ఎకరాలకు దెబ్బ

పూర్తిగా తుడిచిపెట్టుకోనున్న వేరుశనగ పంట

ఎకరాకు రూ. 30 వేలు నష్టం

రూ.7 వేల పరిహారం చెల్లిస్తామంటున్న మంత్రి, అధికారులు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు

కళ్యాణదుర్గం: అన్నదాతల రెక్కల కష్టానికి అధికార టీడీపీ నేతలు ఎసరుపెడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు సభ నిర్వహణ కోసం కళకళలాడుతున్న దాదాపు 71 ఎకరాల రైతుల పంట పొలాలపై వీరి కన్నుపడింది. ఇంకేముందు.. మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా అధికారులు అక్కడ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. చేతికొస్తున్న పంట కళ్లముందే సర్వనాశనం అవుతుండడంపై రైతులు గగ్గోలుపెడుతున్నారు. మొక్కుబడిగా నష్టపరిహారం ఇస్తుండడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. దిగుబడి కాసింత తగ్గినా.. పశువులకు మేత దొరుకుతుందని ఆశపడుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు పర్యటన రైతుల ఆశలపై నీళ్లు జల్లింది.

వివరాల్లోకి వెళ్తే..అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్ట్‌కు కృష్ణా జలాలను తరలించే కాలువ తవ్వకం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకుగాను కళ్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాంతంలో 10 ఎకరాలు తప్ప మిగిలిన భూముల్లో రైతులు వేరుశనగ సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ పొలాలన్నీ ఏపుగా పెరిగాయి. దిగుబడి కొంత తగ్గే అవకాశమున్నప్పటికీ ఈసారి పశుగ్రాసానికి ఢోకా ఉండదనే భావనతో రైతులున్నారు.  

నష్టపోనున్న 14 మంది రైతులు
ఇదిలా ఉంటే.. బీటీపీ, కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌ తవ్వకం పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం సభ నిర్వహణ కోసం 14 మంది రైతులకు చెందిన 70.38 ఎకరాల భూమిని మంత్రి కాలవ శ్రీనివాసులు, ఉన్నం హనుమంతరాయ చౌదరి, జిల్లా అధికారులు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో పచ్చని పంట పొలాలను సీఎం సభకు ఎంపిక చేయడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల రెక్కల కష్టానికి గండి కొట్టడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. 71 ఎకరాల్లో పంట నష్టంతో పాటు సభకు వచ్చే జనాలవల్ల మరో 40 ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదముందని రైతులు కంగారుపడుతున్నారు.

నామమాత్రపు పరిహారంపై ఆగ్రహం
ఇదిలా ఉంటే.. పంట నష్టపోనున్న రైతులకు ఎకరాకు రూ.7వేలను పరిహారం చెల్లిస్తామంటూ మంత్రి కాలవ శ్రీనివాసులు, అధికారులు ప్రకటించడంపై కూడా బాధిత రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఎకరా విస్తీర్ణంలో రూ.15వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద రైతులకు సుమారు రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి నష్టం ఉంటుంది. దిగుబడులు ఆశించిన మేర ఉంటే ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఆదాయం ఉంటుంది. కానీ.. మంత్రి, అధికారులు ఎకరాకు రూ.7 వేలు పరిహారం చెల్లిస్తామనడం రైతు పొట్ట కొట్టడమేనని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కనీస పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top