దగాపై ఆగ్రహం


ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్ :

 మార్కెట్‌లో పత్తి ధర తగ్గింపుపై రైతులు కన్నెర్రజేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించకుండా వ్యాపారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారని, తేమశాతం ఎక్కువగా ఉందనే నెపంతో తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం పత్తి క్వింటాలుకు జెండాపాట ధర రూ.4650గా నిర్ణయించారు. అనంతరం కొనుగోళ్లకు దిగిన వ్యాపారులు క్వింటాకు రూ.2500 నుంచి రూ3500 వరకు మాత్రమే చెల్లిస్తుండడంతో ఇదేం అన్యాయమని రైతులు ప్రశ్నించారు. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, అంతకుమించి ధర పెట్టలేమని చెప్పిన వ్యాపారులు కొందరి సరుకును అసలు కొనుగోలు చేయలేమని అన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారిపై తిరగబడ్డారు.

 

  ఈ ఏడాది ప్రభుత్వం పత్తికి రూ. 4000 మద్దతు ధర ప్రకటించిందని, ఇక్కడ కనీసం ఆ ధర కూడా చెల్లించడం లేదని, వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంతా ఏకమై సమాచార కేంద్రం గేటు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ విషయం పసిగట్టిన మార్కెట్ అధికారులు అప్పటికే గేటు లోపల, బయట తాళాలు వేయగా, ఆవేశంతో ఉన్న రైతులు గేటు బయట తాళాలను పగులగొట్టారు. మార్కెట్ అధికారులు ఈ సమాచారాన్ని త్రీటౌన్ పోలీసులకు అందించడంతో సీఐ గణేష్ నలుగురు ఎస్‌ఐలు, 50 మందికి పైగా కానిస్టేబుళ్లతో అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు తమ ఆవేదనను సీఐకి కూడా వినిపించారు. గరిష్ట ధరకు, వ్యాపారులు విక్రయించే ధరకు రూ.2000 తేడా ఉంటోందని, ఇదేం అన్యాయమని ప్రశ్నించారు. పైగా, శనివారం నుంచి ఐదురోజుల పాటు మార్కెట్‌కు సెలవులని, ఇప్పుడు సరుకు కొనుగోలు చేయకుంటే ఈ ఐదు రోజులు ఎలా ఉండాలని తమ ఇబ్బందులను వివరించారు.

 

  వ్యాపారులు కుమ్మక్కై కొందరి సరుకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఖరీదుదారులు అసలు అడ్రస్సే లేరని వాపోయారు. ఆ సమయంలోనే మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ అక్కడికి చేరుకుని రైతులు తీసుకొచ్చిన పత్తి మొత్తం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని కోరారు. అనంతరం వ్యాపారులతో సమావేశం నిర్వహించి తేమశాతం అధికంగా ఉందనే నెపంతో ధర తగ్గించడం సరైంది కాదని చెప్పారు. న్యాయమైన ధరకు సరుకును కొనుగోలు చేయాలని సూచించారు. అయితే ఆంధ్రలో సమ్మె, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేకపోవటంతో ధర పెట్టలేకపోతున్నామని, తేమశాతం అధికంగా ఉండడం వల్లే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెప్పగా, ఏదేమైనా సరే రైతులకు న్యాయమైన ధర చెల్లించాలని, శనివారం కూడా సరుకు కొనుగోలు చేయాలని చైర్మన్ కోరారు. దీనికి వ్యాపారులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది.

 

 పోటెత్తిన పత్తి...

  శనివారం నుంచి వరుసగా ఐదు రోజులు సెలవులు రావడం, ఆంధ్రా జిల్లాల్లో ఉద్యమం తదితర కారణాలతో శుక్రవారం ఖమ్మం మార్కెట్‌కు 35 నుంచి 40 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. పత్తి యార్డులోని షెడ్లు, యార్డు మొత్తం పత్తి బస్తాలతో నిండిపోయింది. సరుకు యార్డులో పట్టక పోవటంతో అనేక వాహనాలను మధ్యాహ్నం వరకు బయట రోడ్లమీదే నిలపాల్సి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top