రాజన్న మాట..సంక్షేమ బాట

Farmers And Workers Remembering YSR Ruling And Schemes - Sakshi

కూలీల బతుకుల్లో వెలుగు మహాయజ్ఞంలా భూపంపిణీ

319 మంది రైతులకు 474 ఎకరాల పంపిణీ

వ్యవసాయ సాగుకు ఎన్‌ఆర్‌ జీఎస్‌ కింద సాయం

2006ను గుర్తుకు తెచ్చుకుంటున్న పేదలు

ఒకప్పుడు వారంతా కూలీలు. భూస్వాముల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుం బాలను నెట్టుకొచ్చేవారు. పనులు లేకపోతే పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజన్న రాజ్యంలో రైతులుగా ఎంపికయ్యారు. భూపంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు సాగుచేసుకుంటూ తమకాళ్లపై తాము నిలబడగలిగారు. బాబు పాలనలో ఆ భూములకు దిక్కులేకుండాపోయింది. ఒక్క సంక్షేమ పథకమూ వర్తించడంలేదని లబ్ధిదారులు నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు. మహానేత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో రుణం తీర్చుకుం టామని ముక్తకంఠంతో చెబుతున్నారు.

చిత్తూరు, పుత్తూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కూలీల బతుకుల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. మహా యజ్ఞంలా ఆయన చేసిన భూ పంపిణీ కార్యక్రమం ఒక్క రోజులోనే వారిని రైతులను చేసింది. పుత్తూరు మండల పరిధిలోని తడుకు గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యవసాయ కూలీల జీవితాల్లో భూ పంపిణీ అనూహ్య మార్పును తీసుకొచ్చింది. 2006లో గ్రామంలోని 319 మంది కూలీలకు 474 ఎకరాల డీకేటీ భూమిని అదే పంచాయతీ పరిధిలోని వీఎస్‌ఎస్‌ పురం వద్ద పంపిణీ చేశారు. పట్టాదార్‌ పాసుపుస్తకాలు, వన్‌బీ, అడంగళ్, డీకేటీ పట్టాలతో భూమికి యజమానాలయ్యారు. అంతటితో వారిని వదిలేయలేదు. ఆ భూమిని చదును చేసుకోవడానికి, మామిడి మొక్కలు కొనుగోలు నుంచి వాటిని నాటే వరకు ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం కింద సహాయం చేశారు. ఉద్యానవనశాఖ ముందుకొచ్చి ఎరువులు, క్రిమి సంహారక మందులను ఉచితంగా పంపిణీ చేసింది. ఇందిరమ్మ జలసిరి పథకం కింద ఎంపిక చేసిన కొందరు రైతులకు బోర్లు వేసి విద్యుత్‌ కనెక్షన్‌ను ఇప్పించారు. బ్యాంకులు ముందుకు వచ్చి రుణాల మంజూరు చేశాయి. రైతులు మామిడిసాగు చేపట్టారు. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో ఆ రైతులు ఇక వెనుదిరిగి చూడలేదు.

ప్రతి కుటుంబానికీ చేయూత
తడుకు పంచాయతీలో మామిడి సాగు చేసిన రైతులు ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మామిడి సాగు, పశుపోషణ ద్వారా సమాజంలో తలెత్తుకుని జీవిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం వరకు పూట గడవడం కూడా కష్టంగా ఉన్న ఆ కూలీల కుటుంబాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం వారి జీవితాన్నే మార్చేసింది. పొలాల వద్దే ఆవాసాలు ఏర్పరుచుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.

బాబు వచ్చే.. సాయం రాదాయే
2015లో చెన్నై తీరాన్ని తాకిన నీలి తుపాను మామిడి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. పెనుగాలుల ధాటికి పంట మొత్తం నాశనమయ్యింది. నష్టపరిహారం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లిన వీఎస్‌ఎస్‌పురం రైతులకు దిగ్భ్రాంతి కలి గింది. సాగుచేసుకుంటున్న రైతులకు వన్‌బీ, అడంగళ్‌ ఇవ్వడానికి రెవెన్యూ యంత్రాంగం నిరాకరించింది. పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వరాపురం గ్రామానికి చెందిన భూములపై వివాదం ఉంది. సంబంధిత వ్యక్తులు కళ్యాణ వెంకటేశ్వరాపురం భూములతో పాటు వీఎస్‌ఎస్‌పురంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను కూడా జతచేసి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ వివాదం కొలిక్కి వచ్చే వరకు రైతులకు వన్‌బీ మంజూరు చేయలేమని రెవెన్యూ యంత్రాంగం తేల్చేసింది. అప్పటి నుంచి వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు మంజూరు కావడం లేదు.

పోరుబాట పట్టినా..
స్థానిక సర్పంచ్‌ సుశీలమ్మ ఆధ్వర్యంలో రైతులు  అధికారులను నిలదీశారు. విషయం ఎమ్మెల్యే రోజా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె నాలుగుసార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించింది. 2018 జనవరిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ఆయనను కలిసి రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన జగన్‌ సమస్యను పరిష్కరించి పేద రైతులకు ఆదుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాశారు.

ఎన్నికల గాలం
ఎన్నికల గాలం వేసేందుకు టీడీపీ సమాయత్తమైంది. తమ పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కుప్పం నియోజకవర్గంలో ఈతంతు తారస్థాయికి చేరింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిని దగ్గర చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కొందరికి రెస్కో, ద్రావిడ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలిస్తామన్న హామీలు నెరవేరలేదు. క్రియాశీలకంగా పనిచేస్తున్న పార్టీ నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. నెల క్రితం రెస్కోలో 49 ఉద్యోగాలిస్తామని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆపై పార్టీలో విభేదాలు తలెత్తుతాయని వాటిని భర్తీచేయకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీనిపై కొందరు గుర్రుగా ఉంటున్నారు. వీరందర్నీ సంతృప్తిపరచాలని టీడీపీ భావిస్తోంది. చోటామోట నేతలను రంగంలోకి దింపుతోంది. అసంతృప్తుల ఇళ్లకెళ్లి బుజ్జగించేపనిలో నిమగ్నం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు సైతం ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. నాయకులు, కార్యకర్తల స్థాయిని బట్టి బంపర్‌ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే పట్టణంలోని ఓ నేతకు రూ.50 వేలకు పైగా నగదు ఇచ్చినట్లు తెలిసింది. ఆయన అందరితో కలిసి ప్రచారం చేయాలని సూచించినట్లు భోగట్టా. మరికొంత మందికి ఇలాగే ఆఫర్లతో బోల్తాకొట్టించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 

‘కోడ్‌’ కూసిన వేళ
ఎన్నికల కోడ్‌ ఇలా అమల్లోకి వచ్చిందో లేదో.. కొందరు అధికారులు వారి అధికారాలను ధైర్యంగా ఉపయోగిస్తున్నారు. చిత్తూరులో మేయర్‌ ఉపయోగిస్తున్న వాహనంపై ‘చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌’ అని ఉన్న బోర్డును తీసేయాలని కమిషనర్‌ ఓబులేసు ఆదేశించారు. అలాగే డెప్యూటీ మేయర్‌ ఉపయోగిస్తున్న వాహనానికి సైతం ఆ పేరును తీసేయాలన్నారు. పైగా నేతల వద్ద పనిచేస్తున్న తమ డ్రైవర్లను, సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిపించుకున్నారు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు వారి వాహనాలపై ఎక్కడా పదవులను చూపుతూ బోర్డులు పెట్టుకోకూడదని.. ప్రభుత్వ అధికారులను వెంటనే ఆయా శాఖలకు సరెండర్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఎంతైనా ఎన్నికల కోడ్‌ వచ్చేసిందికగా.. ఆ కిక్కే వేరబ్బా!– చిత్తూరు అర్బన్‌

ఆర్పీని తీసేయ్‌ మా..!
‘ఏమ్మా ఎన్నిసార్లు మీకు చెప్పేది. ఈ ఆర్పీ (రిసోర్సు పర్సన్‌) వల్ల మా కాలనీలో లేనిపోని ఇబ్బందులు వస్తావుండాయి. వచ్చే నాలుగు ఓట్లు కూడా పడనీకుండా చేస్తావుండాదీమె. ఎంటనే ఈమెను మార్చేసి.. నేను చెప్పిన వాళ్ల పేరు రాసుకోమా..’ అంటూ చిత్తూరు నగరానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్‌ పట్టణ దారిద్య్ర నిర్మూలన విభాగం (మెప్మా) అధికారిని ఆదేశించారు.  కంగారుపడిపోయిన ఆ అధికారి ‘సార్‌.. ఆర్పీని తీయాలంటే గ్రూపు సమావేశంలో తీర్మానం చేయాలి. ఆ మీటింగు ఏదో మీరే పెట్టించేయండి’ అంటూ సమాధానమిచ్చారు. ఈ విషయం ఆనోటా ఈనోట వెళ్లి ఉన్నతాధికారుల చెవినపడింది. ‘ఇక్కడ పొలిటికల్‌ ప్రొటోకాల్‌ అనేది ఉండదు.. ఎవర్ని ఉంచాలో, తీయాలో మనం చూసుకుంటాం. ముందు మీరు నాన్చుడు ధోరణితో కాకుండా నిక్కచ్చిగా వ్యవహరించండి. లేకుంటే ఇబ్బందుల్లో పడుతారు..’ అంటూ అధికారులు హెచ్చరించారు.         – చిత్తూరు అర్బన్‌

మహానేతను మరువలేం
ఈ రోజు కాస్తోకూస్తో నాలుగు వేళ్లు కడుపులోకి వెళుతున్నాయంటే ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఆయన అండదండ లతోనే వ్యవసాయ భూమిని పంపిణీ చేయించారు. అంతే కాకుండా సాగుకు అవసరమైన వనరులను వివిధ పథకాల ద్వారా అందించారు. ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. – హనుమంతయ్య, ఎస్టీ రైతు, తడుకు

ఈ ప్రభుత్వంలో దేనికీ దిక్కులేదు
ప్రభుత్వం మంజూరు చేసిన భూములకు కూడా ఈ ప్రభుత్వంలో దిక్కు లేకుం డా పోయింది. పేదలకు అన్యాయం జరుగుతోంది. వన్‌బీ, అడంగళ్‌ను రెవెన్యూ యంత్రాంగం ఇవ్వడం లేదు. దీనిపై ఎమ్మెల్యే రోజాతో పాటు సర్పంచ్‌ సుశీలమ్మ ఆధ్వర్యంలో పోరాటం చే శాం. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాం.– బాలాజీ, రైతు నాయకుడు, తడుకు

ఏ అధికారీ పట్టించుకోలేదు
వన్‌బీ, అడంగళ్‌ మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నాం. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. న్యాయస్థానం పరిధిలో ఉందని చెబుతూ తప్పించుకుంటున్నారు. మా సమస్యకు పరిష్కారం చూపే నాథుడే లేకుండాపోయారు.– వళ్లియమ్మ, ఎస్టీ రైతు, తడుకు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top