జోరువాక!

విత్తనాలు చల్లుతున్న రైతు


లక్షల ఎకరాల్లో విత్తు.. పెరిగిన మెట్టపంటల విస్తీర్ణం

గతేడాది ఇదే సమయానికి 13,07,249 ఎకరాల్లో సాగు

ఈసారి 22,33,820 ఎకరాలకు పరిస్థితులు అనుకూలిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం

సోయాబీన్ విత్తనాల కొరత.. పత్తికి నకిలీల బెడద



సాక్షి, హైదరాబాద్:ఏరువాకకు ముందే రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు జోరందుకుంటోంది. వ్యవసాయ పనుల ఆరంభ దినంగా జరుపుకునే ‘ఏరువాక’ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జరపనుంది. అయితే, ముందుగానే తొలకరి వర్షాలు పలకరించడంతో ఇప్పటికే రైతులు లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సంవత్సరం రెట్టింపు విస్తీర్ణంలో అన్నదాతలు విత్తనాలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జొన్న, మొక్కజొన్న లాంటి ధాన్యపు పంటలు, సోయాబీన్ లాంటి నూనె గింజల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



అయితే, వరుణుడు కరుణిస్తున్నా.. పరిస్థితులు అనుకూలిస్తున్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నకిలీ విత్తనాలు రైతన్నను ముంచేస్తున్నాయి. వ్యవసాయ శాఖ చేస్తున్న నామమాత్రపు తనిఖీల్లోనే ఇప్పటివరకూ రూ.2 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పత్తికి గిట్టుబాటు ధర రాకపోవడంతో పలు ప్రాంతాలలో రైతులు సోయాబీన్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. కానీ దానికి సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.



మరోవైపు ఈ ఏడాది వర్షాధార మెట్ట పంటల సాగు రికార్డు స్థాయికి చేరుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మొక్కజొన్న సాగు విస్తీర్ణమే 2.8 లక్షల ఎకరాలు దాటింది. నూనె గింజల సాగు 3.8 లక్షల ఎకరాలకు చేరుకుంది. వర్షాలు మరింత కురిస్తే ఈ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. జూన్ 19 నాటికి రాష్ట్రంలో ధాన్యం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 2,10,847 ఎకరాలు కాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 3,66,548 ఎకరాల్లో విత్తనం పడింది. ఇక కంది, మినుము లాంటి పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 1,92,742 ఎకరాలు కాగా.. ఈసారి 2,22,394 ఎకరాల్లో సాగవుతోంది. గతేడాది ఇది 17,297 ఎకరాల్లోనే సాగయింది. నూనె గింజలు గతేడాది 1,45,792 ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి 3,60,773 ఎకరాలకు పెరిగింది. మొత్తంగా గతేడాది జూన్ 19 నాటికి వివిధ పంటలు సాగైన విస్తీర్ణం 13,07,249 ఎకరాలు ఉండగా.. ఈ ఏడాది అది 22,33,820 ఎకరాలుగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top