కాటేసిన కరెంటు

Farmer Dies Of Electrocution In Visakha District - Sakshi

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దేవరాపల్లి మండలం వేచలం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రైతు వేచలపు వెంకటరావు(60) తన పొలంలోని మోటా రుకు సమీపంలో గడ్డి కోస్తుండగా విద్యుత్‌ తీగ తగిలి షాక్‌కు గురై కన్నుమూశాడు. 

సాక్షి, దేవరాపల్లి(మాడుగుల): వేచలం గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు.  గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన  వేచలపు వెంకటరావు(60)అనే రైతు తన పొలంలో గల వ్యవసాయ మోటారుకు సమీపంలో  ఆదివారం సాయంత్రం  గడ్డి కోస్తున్నాడు. అయితే వ్యవసాయ మోటారుకు విద్యుత్‌ సరఫరా చేసే వైరు గడ్డిలో ఉండడాన్ని గుర్తించని అతను గడ్డితో కలిపి వైర్లను కొడవలితో కోసేయడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో పది నిముషాల్లో త్రిఫేజ్‌ విద్యుత్‌ సరఫరా నిలిపి వేసే సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై వెంకటరావు మృతిచెందడాన్ని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

గడ్డి కోసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు వెంకటరావుకు భార్య నాగభూషణమ్మ, వివాహితులైన నలుగురు కుమార్తెలు, అవివాహితుడైన కుమారుడు నర్సింహనాయుడు ఉన్నారు.   వెంకటరావు మృతితో వేచలం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.   సంఘటన స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ కె. శంకరరావు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక వైఎస్సార్‌సీపీ నాయుకులు నాగిరెడ్డి శఠారినాయుడు, రెడ్డి బలరాం తదితరులు పరామర్శించారు.

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top