కితకితలు పెట్టిన.. గోదారోళ్లు

face book friends meet in doragari bangla - Sakshi

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ ఆత్మీయ కలయిక

మూడు వేల మందికి మందిపైగా హాజరు

దేశ విదేశాల నుంచి వచ్చిన ‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్‌బుక్‌ సభ్యుల సమావేశంలో గోదావరి జిల్లా హాస్యం మీసం మెలేసింది. వినూత్న రీతిలో ప్రారంభమైన ఈ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సమావేశంలోని సభ్యులందరూ హాస్యపు పోస్టింగ్స్‌తో ఇంతవరకూ ఆనందంతో ఉప్పొంగిపోయేవారు. ఆ గోదావరి ప్రాంతానికి వెళ్లి.. హాస్యపు కడలిలో మునిగి తేలిపోవాలన్న ఆశతో వచ్చిన ఆ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బలయ్యారు. ఫేస్‌బుక్‌లో ఇంతవరకూ హాస్యంగా పలుకరించిన గోదావరి వాళ్లు.. అక్కా, చెల్లి, బావా అంటూ పలుకరిస్తూ చూపిన మర్యాద, ఆప్యాయతలు.. కొసరికొసరి వడ్డిస్తూ పెట్టిన భోజనాల్లో్ల వంటకాల ఘుమçఘుమలు.. వారిని మైమరపించాయి.

తూర్పుగోదావరి, ధవళేశ్వరం (రాజమండ్రి రూరల్‌):  హాయ్‌ అక్క, బావ అనే పలకరింపులతో దొరగారి బంగ్లా సందడిగా మారింది. అలా అనుకుంటే వీరంతా బంధువులు కానేకాదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆవిర్భవించిన ‘గోదారోళ్ల కితకితలు’ఫేస్‌బుక్‌ టీమ్‌ సభ్యులు వీరంతా. దేశ విదేశాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఫ్రెండ్స్‌ అందరూ ఆత్మీయ కలయిక పేరిట ఆదివారం స్థానిక హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న చంటి దొరగారి బంగ్లాలో కలుసుకున్నారు. బొమ్మూరుకు చెందిన ఈవీవీ సత్యనారాయణ ఒక్కడితో సరదా ప్రారంభమైన ఈ గ్రూప్‌లో 27 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు మూడు వేల మందికిపైగా సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం కోసం సుమారు మూడు నెలల క్రితం వారి గ్రూప్‌లో ప్రకటించారు. అప్పటి నుంచి పలుసార్లు సమావేశాలు నిర్వహించుకుంటూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరూ ఆప్యాయంగా అక్క, బావ, చెల్లి అంటూ పలకరించుకున్నారు. ఉదయం 11 రకాల దోసెలను అల్పాహారంగా అందించారు. మధ్యాహ్నం భోజనంలో గోదావరి జిల్లా రుచులు ఘమఘమలాడాయి. పలు రకాల స్వీట్లు వడ్డన చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన గ్రూప్‌ సభ్యుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ హాస్యానికి పెద్దపీట వేస్తున్న గోదారోళ్ల కితకితలు గ్రూప్‌లో సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కలయికకు కారణమైన ఈవీవీని అభినందించారు. ప్రముఖ నఖ చిత్రకారుడు డాక్టర్‌ రవి పరస చిత్రీకరించిన ఫొటోను రామారెడ్డికి అందజేసి సత్కరించారు. గ్రూప్‌ సభ్యులు, సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ బిజీ లైఫ్‌లో కాసేపు రిలాక్స్‌ కోసం ఈ గ్రూప్‌ ఉపయోగపడుతుందన్నారు.

ఇంతమంది అక్కలను, బావలను ఇలా చూడడం ఆనందంగా ఉందన్నారు. తన చేతితో చిత్రించిన గణపతి ఫొటోలను పలువురికి రవి పరస అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్‌ సభ్యుల్లోని పలువురు ప్రముఖులకు సత్కారం చేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గ్రూప్‌ అడ్మిన్, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన నిబ్బనపూడి వాసుప్రసాద్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహమతులు అందజేశారు.  కిఫీ హస్పిటల్‌ అధినేత డాక్టర్‌ కరుటూరి సుబ్రహ్మణ్యం, నూజిళ్ల శ్రీనివాస్, రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ మద్దు సతీష్, గోవింద్‌ తదితరులు పాల్గొనగా, వాకలపూడి హేమ, గొల్లపూడి గాయత్రి, రాయుడు బొడ్డు, వాలిశెట్టి రవి, బొజ్జా శ్రీను, సర్వేశ్వరరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చాలా ఆనందంగా ఉంది
ఇంతమంది అక్కలను, బావలను ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం మణుగూరు నుంచి ఎంతో శ్రమించి ఇక్కడకు వచ్చాను. గ్రూప్‌లో హాస్యాన్ని అందిస్తే, ఇక్కడ అభిమానాన్ని చూపించారు.    – మణి తిప్ప, మణుగూరు, ఖమ్మం జిల్లా

ఆప్యాయతను మూట కట్టుకెళ్తున్నా
ఎంతో వ్యయప్రయాసలకోర్చి వచ్చాను. ఇక్కడ ఇంత ఆనందాన్ని, అనురాగాన్ని మూట కట్టుకుని వెళుతున్నాను. నా జీవితంలో మరువలేని మధుర స్మృతులు ఇవి.
– గార్లపాటి విజయలక్ష్మి, తాడిపత్రి, అనంతపురం జిల్లా

మూడు నెలలుగా శ్రమిస్తున్నా
మూడు నెలలుగా శ్రమిస్తున్నాను. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించాను. ఇంతమందిని ఇలా చూశాక పడ్డ శ్రమంతా దూదిపింజలా ఎగిరిపోయింది.
– రాయుడు బొడ్డు, కానవరం

ఒక్కడిగా ప్రారంభమై..
ఏదో సరదాగా గోదావరి యాసను అందరికీ తెలియజేయాలని ఈ గ్రూప్‌ క్రియేట్‌ చేశాను. ఒక్కడిగా ప్రారంభమైన గ్రూప్‌ నేడు విశ్వవ్యాప్తంగా 27 వేల మంది సభ్యులకు చేరింది. నా జీవితంలో మరువలేని అత్యంత సంతోష క్షణాలు ఇవి. ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఎప్పటికీ మరువలేను. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
– ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్‌ క్రియేటర్, బొమ్మూరు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top