సర్కార్‌ బడులు.. ఇంగ్లిష్‌ క్లాసులు

English Classes Starts From Educational Year - Sakshi

ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం

అసెంబ్లీలో బిల్లు ఆమోదం 

వచ్చే ఏడాది నుంచి అమలు

జిల్లాలో 1.40 లక్షల మందికి లబ్ధి

పేద, మధ్య తరగతి ప్రజల్లో హర్షాతిరేకాలు

సర్కార్‌ స్కూళ్లలో చదివే పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది పేదలకు అందని ద్రాక్షలా ఉన్న ఇంగ్లిష్‌ మీడియం చదువులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ చెప్పనున్నారు. దీనికి సంబంధించి బిల్లును సోమవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. 1 నుంచి 6వ తరగతి వరకు లక్షలాది మంది పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఆయా వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

నెల్లూరు(టౌన్‌): ప్రాథమిక దశ నుంచి ఇంగ్లిష్‌ లో బోధన లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించలేకపోతున్నారు. ఉద్యోగాలు పొందడంలో వెనుకబడిపోతున్నారు. ఇంగ్లిష్‌ మీడియం చదివేందుకు కార్పొరేట్‌ పాఠశాలల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంది. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది తలకుమించిన భారంగా మారింది. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటు విద్యావేత్తలు, ఇటు పలు సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సర్కార్‌ బాట..
జిల్లాలో మొత్తం 4,486 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. వీటిల్లో మొత్తం 3.97 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వానికి చెందిన ప్రాథమిక పాఠశాలలు 2,665 ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1.40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశ పెడుతున్నారు. కాగా తెలుగు సబ్జెక్టును అన్ని తరగతుల్లో తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు భారమైనా తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం చదివించేందుకు ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలకు పంపుతున్నారు. కాగా పాఠశాల స్థాయిలో తెలుగు మీడియంలో చదివి ఇంటర్‌ లేదా ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సుల్లో ఇంగ్లిష్‌ మీడియం చేరి చదవలేక మధ్యలోనే చదువును నిలిపివేస్తున్న వారు ఎందరో ఉన్నారు. పోటీ పరీక్షలు సైతం ఇంగ్లిష్‌లోనే ఉండడంతో మిగిలిన వారితో పోటీపడలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో కార్పొరేట్‌ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్న వారందరూ సర్కాస్‌ బడుల బాట పట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 6వ తరగతి వరకూ సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రానున్నరోజుల్లో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను అమలు చేయాలన్న నిర్ణయంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఇంగ్లిష్‌ మీడియం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం. పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్‌ బాగా మాట్లాడగలిగితేనే కార్పొరేట్‌ సెక్టార్లల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు. – కె.వాసు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌ టీఎఫ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top